
మణిరత్నం , అమితాబ్, ఐశ్వర్యరాయ్
సినిమా: ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం చిత్రం అంటేనే కచ్చితంగా దానికో ప్రత్యేకత ఉంటుంది. మౌనరాగం, బొంబాయి చిత్రాల నుంచి ఓ కాదల్ కణ్మణి వరకూ ఎన్నో ప్రేమ కథాలను తెరకెక్కించిన మణిరత్నం నాయగన్, దళపతి, ఘర్షణ వంటి మాస్ మసాలా చిత్రాలను తెరపై తనదైన శైలిలో ఆవిష్కరించి సక్సెస్ అయ్యారన్నది తెలిసిన విషయమే. ఇటీవల కథల విషయంలో కాస్త తడబడ్డా తాజాగా సెక్క సివంద వానం చిత్రంతో మళ్లీ ఫేమ్‌లోకి వచ్చారు. అంతే కాదు అరవిందస్వామి, శింబు, విజయ్‌సేతుపతి, అరుణ్‌విజయ్, జ్యోతిక, అదితిరావ్, ఐశ్వర్యరాజేశ్‌లతో రూపొందించిన ఆ చిత్ర విజయంతో మల్టీస్టారర్ చిత్రాలను తెరకెక్కించడంలో తనకు తానే సాటి అని మరో సారి నిరూపించుకున్నారు. ఆయనిప్పుడు మళ్లీ మల్టీస్టారర్ కథను తెరకెక్కించడానికే సిద్ధం అవుతున్నారు.
ఈ సారి మరింత భారీ తారాగణంతో చిత్రం చేయతలపెట్టారు. అంతే కాదు ఇంతకు ముందే చేయాలనుకున్న ఒన్నియిన్ సెల్వన్ చిత్రాన్ని ఇప్పుడు రూపొందించబోతున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇంతకు ముందు నటుడు విజయ్, టాలీవుడ్ స్టార్ నటుడు మహేశ్‌బాబు, అందాలభామ ఐశ్వర్యరాయ్ లాంటి స్టార్స్‌తో పొన్నియిన్ సెల్వన్ చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నం చేశారు. అయితే అప్పుడు బడ్జెట్ కారణాల వల్ల డ్రాప్ అయ్యింది. అదే కథతో ఇప్పుడు విక్రమ్, శింబు, జయంరవి హీరోలుగా పొన్నియిన్ సెల్వన్ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇక ఇందులో ప్రత్యేకం ఏమిటంటే బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్‌బచ్చన్‌ను, ఆయన కోడలు, అందాలరాశి ఐశ్వర్యరాయ్‌ను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. ఇప్పటికే మణిరత్నం అమితాబ్‌ను కలిసి కథ వినిపించినట్లు తెలిసింది. ఆయన కనుక నటించడానికి అంగీకరిస్తే మణిరత్నం దర్శకత్వంలో తండ్రి కొడుకులు నటించినట్లు అవుతుంది. ఇంతకుముందు గురు చిత్రంలో అభిషేక్‌బచ్చన్ నటించిన విషయం తెలిసిందే. ఇక నటి ఐశ్వర్యారాయ్ ఇప్పుటికే ఇద్దరు, గురు, రావణన్ చిత్రాలతో నటించింది. తాజాగా నాలుగోసారి మణిరత్నం దర్శకత్వంలో నటించనుందన్న మాట. ఏఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందించనున్న ఈ చిత్రం త్వరలోనే అంటే పొంగల్ తరువాత ప్రారంభం కానున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment