షారుక్‌ఖాన్, ఐశ్వర్యారాయ్ మళ్లీ కలిసి నటించనున్నారా?
షారుక్‌ఖాన్, ఐశ్వర్యారాయ్ మళ్లీ కలిసి నటించనున్నారా? బాలీవుడ్ వర్గాలు అవుననే అంటున్నాయి. వీరిద్దరూ కలిసి నటించిన ‘దేవదాసు’ చిత్రం విమర్శకుల ప్రశంసలందుకుంది. అంతేకాక షారుక్, ఐశ్వర్యల కెమిస్ట్రీ యువతరాన్ని సైతం ఉర్రూతలూగించింది. మళ్లీ వీరు కలిసి నటించడమంటే... సినీ ప్రియులకు అది నిజంగా శుభవార్తే. ఇంతకీ వీరిద్దరూ కలిసి చేయబోతున్న సినిమా ఏంటి? అనే వివరాల్లోకెళ్తే- షారుక్‌తో బ్లాక్‌బస్టర్ ‘చెన్నయ్ ఎక్స్‌ప్రెస్’ని రూపొందించిన రోహిత్ శెట్టి, మళ్లీ ఆయనతోనే తన తదుపరి ప్రాజెక్ట్‌ని ప్లాన్ చేశారు. కథ రీత్యా ఇందులో కథానాయిక పాత్ర చాలా కీలకం.
ఆ పాత్రను ఐశ్వర్యారాయ్ చేత చేయిస్తే కరెక్ట్‌గా ఉంటుందని రోహిత్ భావించారట. ఒక వేళ ఆ పాత్రకు ఐశ్వర్య ‘ఓకే’ చెప్పని పక్షాన, ‘చెన్నయ్ ఎక్స్‌ప్రెస్’ కథానాయిక దీపిక పదుకొనేతో ఆ పాత్ర చేయించాలని ఆయన అనుకున్నారట. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఇందులో కథానాయికగా ఐశ్వర్య ఖరారైనట్లు తెలుస్తోంది. పన్నెండేళ్ల తర్వాత షారుక్‌తో ఐష్ కలిసి చేయబోయే సినిమా ఇదే అవుతుంది. కూతురు ఆరాధ్య పుట్టాక దాదాపు సినిమాలకు దూరంగా ఉన్న ఐష్ ఇటీవలే తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. ప్రస్తుతం సంజయ్ గుప్తా దర్శకత్వంలో ‘జజ్‌బా’ చిత్రంలో ఇర్ఫాన్‌ఖాన్‌కి జోడీగా ఆమె నటిస్తున్నారు.