![ఐశ్వర్య ఆత్మహత్య; ఫేక్ న్యూస్ కలకలం - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/4/71480932482_625x300.jpg.webp?itok=DLKfwjW4)
ఐశ్వర్య ఆత్మహత్య; ఫేక్ న్యూస్ కలకలం
ముంబై: బాలీవుడ్ టాప్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ బచ్చన్ వదంతుల బాధితుల జాబితాలో చేరారు. ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయారని ఆదివారం వార్తలు రావడంతో కలకలం రేగింది. కుటుంబ కలహాలతో ఐష్ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుందని, ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు రహస్యంగా ఉంచారని ప్రచారం జరిగింది.
‘ఏ దిల్ హై ముష్కిల్’ సినిమాలో రణబీర్ కపూర్ సన్నిహితంగా నటించడంతో ఆమె కుటుంబంలో కలతలు రేగాయని కథ అల్లారు. ఐశ్వర్య ఆత్మహత్యాయత్నం చేయడంతో బచ్చన్ కుటుంబం డాక్టర్ ను పిలిపించిందని, అప్పటికే ఆమె చనిపోయిందని.. ఈ విషయాన్ని బయటకు రానీయలేదని ఈ కథనంలో పేర్కొన్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమైంది. బ్లాగుల్లోనూ విపరీతంగా ట్రెండయింది.
ఆదివారం అర్థరాత్రి ఓ పార్టీలో సెలబ్రిటీ డిజైనర్ మనీష్ మల్హోత్ర తో కలిసి ఐశ్వర్య కనబడడంతో ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది. కత్రినా కైఫ్, అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా, దిలీప్ కుమార్, హనీ సింగ్, రజనీకాంత్, లతా మంగేష్కర్ చనిపోయినట్టు గతంలో వదంతులు రేగిన సంగతి తెలిసిందే.