
స్కూల్‌కెళుతున్న ఐశ్వర్యారాయ్!
ఐశ్వర్యారాయ్ ప్రతిరోజూ పాఠశాలకు వెళ్తున్నారు. ఇది చదవగానే ‘ఈ వయసులో పాఠశాలకు వెళ్లడం ఏంటి?’ అని ఆశ్చర్యంగా ఉంది కదూ. తన కూతురు ఆరాధ్య కోసమే ఆమె పాఠశాల బాట పట్టారు.
ఇటీవలే ఆరాధ్యను ప్లే స్కూల్‌లో చేర్చారు. పిల్లలను తొలిసారి స్కూల్‌కు పంపించేటప్పుడు ఏ తల్లీతండ్రికైనా ఒకింత బెంగగా ఉంటుంది. కొంతమంది పిల్లలు వెళ్లనని మారాం కూడా చేస్తుంటారు. కానీ, ఆరాధ్య అలాంటి పిల్ల కాదు. చక్కగా స్కూల్‌కెళ్తున్నారట కానీ, ఐశ్వర్యకే స్కూల్లో పిల్ల ఎలా ఉంటుందో అని బెంగ పట్టుకుంది. అందుకని తనే స్వయంగా ఆరాధ్యను డ్రాప్ చేయడంతో పాటు స్కూల్ వదిలే వరకు అక్కడే ఉంటున్నారట. దీన్నిబట్టి కూతురి విషయంలో ఆమె ఎంత జాగ్రత్తగా ఉంటున్నారో అర్థమవుతోంది.
అయితే, స్కూల్ నియమ నిబంధనల ప్రకారం తల్లిదండ్రులను లోపలికి అనుమతించరు. గేట్ దగ్గరే వదిలిపెట్టి వెనక్కి తిరగాల్సిందే. కానీ, ఐష్ సీన్ వేరు కదా. మాజీ అందాల సుందరి, స్టార్ హీరోయిన్, బచ్చన్ ఇంటి కోడలు కాబట్టి నిబంధనలను పట్టించుకోకుండా కూతురితో పాటు స్కూల్లో ఉండనిస్తున్నారని ఊహించవచ్చు.