ఏకే 57లో అక్షరహాసన్?
అజిత్ 57వ చిత్రంలో కమలహాసన్ రెండో కూతురు అక్షరహాసన్ నటించే అవకాశం ఉందన్నది తాజా సమాచారం. వేదాళం వంటి విజయవంతమైన చిత్రం తరువాత అజిత్ తాజా చిత్రానికి సిద్ధమయ్యారు. ఇది ఆయన నటించే 57వ చిత్రం అవుతుంది. దీనికి శివ దర్శకత్వం వహిస్తున్నారు. వీరి కాంబినేషన్‌లో ఇంతకు ముందు వీరం, వేదాళం చిత్రాలు రూపొందిన విషయం తెలిసిందే. ఇప్పడు ముచ్చటగా మూడో చిత్రానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిలింస్ పతాకంపై త్యాగరాజన్ నిర్మింస్తున్నారు. అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు ఇటీవలే నిరాడంబరంగా ప్రారంభం అయ్యాయి.
ఇందులో కాథానాయకిగా అనుష్క నటించనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఆమెకు సంబంధించిన అంశాన్ని నిర్మాతలు ఇప్పటికీ ప్రస్తావించ లేదు. ఇందులో కాజల్‌అగర్వాల్ ఒక నాయకిగా నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. తాజా సమాచారం ఏమిటంటే ఇందులో కమలహాసన్ రెండో కూతురు అక్షరహాసన్ అతిథిగా కీలక పాత్రలో నటించే అవకాశం ఉందనే కోలీవుడ్ వర్గాల ప్రచారం. అక్షర ప్రస్తుతం తన తండ్రి కమలహాసన్,అక్క శ్రుతిహాసన్‌లు కలిసి నటిస్తున్న శభాష్‌నాయుడు చిత్రానికి సహాయ దర్శకురాలిగా పనిచేస్తున్నారు.
అజిత్ చిత్రంలో నటించే విషయం నిజమైతే ఇదే అక్షరహాసన్ తొలి తమిళ చిత్రం అవుతుంది.ఇక పోతే అజిత్ ఇందులో హీరోతో పాటు విలన్ పాత్రను తనే పోషించనున్నట్లు సమాచారం. అదే విధంగా ఈ చిత్రంలో అజిత్‌తో కలిసి నటుడు కరుణాస్ తొలిసారిగా నటించనున్నారు.ఈ చిత్రం ఆగస్ట్ మొదటి వారంలో బల్గేరియాలో చిత్రీకరణకు శ్రీకారం చుట్టనుందని సమాచారం.