రాజకీయ ప్రభంజనం
ఓ అల్లరి కుర్రాడు అటు కళాశాలలోనూ, ఇటు కుటుంబంలోనూ అనుకోని దుర్ఘటనలను ఎదుర్కొంటాడు. ఈ ఘటనలు.. స్వాతంత్య్రానంతర చరిత్రను తాను అధ్యయనం చేయడానికి పురిగొల్పుతాయి. తన అధ్యయనం ద్వారా సామాజిక, ఆర్థిక అసమానతలు, దోపిడీ రాజకీయ వ్యవస్థ, దానికి తోడైన అధికార వ్యవస్థలపై పూర్తిగా అవగాహన చేసుకొని ఓటర్లలో చైతన్యం తేవడానికి ప్రయత్నిస్తాడు. తదనంతరం తాను ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నాడు? అనే ఆసక్తికరమైన కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘ప్రభం జనం’. ‘రంగం’ ఫేమ్ అజ్మల్ హీరోగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని భాస్కరరావు వేండ్రాతి స్వీయదర్శకత్వంలో నిర్మిస్తున్నారు. మంగళవారం హైదరాబాద్‌లో రెండో షెడ్యూలు మొదలైంది.
ఈ సందర్భంగా భాస్కరరావు వేండ్రాతి మాట్లాడుతూ -‘‘నలుగురు ఇంజినీరింగ్ స్టూడెంట్స్ కథ ఇది. సందేశంతో పాటు కావాల్సినంత వినోదం కూడా ఈ కథలో ఉంటుంది. ఇందులో మొత్తం 5 పాటలుంటాయి. సిరివెన్నెల సీతారామశాస్త్రి అద్భుతమైన సాహిత్యం అందించారు. చాలా రోజుల విరామం తర్వాత ఆర్పీ పట్నాయక్ మా చిత్రానికి స్వరాలందించారు. డిసెంబర్ ద్వితీయార్ధంలో పాటలను, జనవరిలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. సందేశ్, ఆరుషి,పంచి బొరా, నాజర్, నాగబాబు, కోట శ్రీనివాసరావు, గొల్లపూడి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సురేందర్‌రెడ్డి, నిర్మాణం: చైతన్య ఆర్ట్ క్రియేషన్స్.