Prabhanjanam
-
సమాజంలో మార్పు కోసం...
సమసమాజ స్థాపనే ధ్యేయంగా ముందుకు సాగిన నలుగురు యువకుల కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘ప్రభంజనం’. ‘రంగం’ఫేం అజ్మల్, సందేశ్, ఆరుషి, పంచిబోర ఇందులో ప్రధాన పాత్రధారులు. భాస్కరరావు వేండ్రాతి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రచార చిత్రాలను సోమవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. భాస్కరరావు మాట్లాడుతూ -‘‘ఇరవై ఏళ్ల నా ఆలోచనలకు రూపమే ఈ ‘ప్రభంజనం’. 67 ఏళ్ల స్వతంత్ర భారతంలో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వచ్చి మార్పులేంటి? ఆ మార్పుకు కారణమేంటి? అనే అంశాలపై నలుగురు యువకులు చేసిన పరిశోధన ఎలాంటి ఫలితాలిచ్చింది. సమాజంలో మార్పుకై వాళ్లు ఏ విధంగా ముందుకెళ్లారు అనేదే మా సినిమా కథాంశం. ఆ రోజు అంబేద్కర్ ప్రవేశపెట్టిన రిజర్వేషన్ల ప్రభావం దేశంపై ఎలా ఉందో ఈ చిత్రంలో చర్చించాం. నోటుకు అమ్ముడు పోయి ఓటు వేస్తే పర్యవసానం ఎలా ఉంటుందో ఇందులో వివరించాం. అయితే ఎవర్నీ ఇందులో కించపరచలేదు’’ అని తెలిపారు. ఈ సినిమా కోసం నేను స్వరపరిచిన ‘ప్రభంజనం..’ టైటిల్‌సాంగ్‌ని నేను అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచారం కోసం ఉపయోగించుకోవడం గర్వంగా ఉందని, అయితే... ఈ సినిమాకానీ, ఆ పాటగానీ ఏ పార్టీకి సంబంధించింది కాదని ఆర్పీ పట్నాయక్ చెప్పారు. ఇంకా చిత్రం యూనిట్ సభ్యులతో పాటు టి.ప్రసన్నకుమార్, నాగార్జున రెడ్డి కూడా మాట్లాడారు. -
ప్రభంజనం మూవీ ప్రెస్‌మీట్
-
ఆలోచింపజేసే సినిమా
ఓటర్లలో అవగాహన పెంచి, వారిలో ఉద్యమస్ఫూర్తిని రగిలించి, సన్మార్గంలో నడిపించడానికి కృషి చేసిన నలుగురు యువకుల కథతో తెరకెక్కిన చిత్రం ‘ప్రభంజనం’. భాస్కరరావు వేండ్రాతి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అజ్మల్, సందేశ్, అరుషి, పంచిబోర ముఖ్య తారలు. సెన్సార్ కార్యక్రమాలు ముగించుకున్న ఈ చిత్రం నెల 12న లేదా 18న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భాస్కరరావు మాట్లాడుతూ -‘‘జనం కోసం తీసిన సినిమా ఇది. 67 ఏళ్ల స్వతంత్ర భారతంలో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి. పజలపై వాటి ప్రభావం ఎంత బలీయంగా ఉందో తెలిపే సినిమా ఇది. అలాగని డాక్యుమెంటరీలా ఈ సినిమా ఉండదు. కమర్షియల్ హంగులన్నీ ఇందులో ఉంటాయి. నటీనటుల నటన, సాంకేతిక నిపుణుల అద్భుతమైన ప్రతిభ ఈ సినిమాకు ప్రధాన బలాలు. ఓ వైపు ఆనందింపజేస్తూ, మరో వైపు ఆలోచింపజేసే సినిమా ఇది’’ అన్నారు. లంచగొండితనంపై ఇప్పటివరకూ చాలా సినిమాలొచ్చాయని, కానీ వాటిలో చూపించని ఎన్నో అంశాలను ఇందులో చూపించారని, ప్రస్తుతం సమాజంలో ఏం జరుగుతుంది? దేశ పౌరులుగా మన బాధ్యత ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా అని ఆర్పీ పట్నాయక్ చెప్పారు. మంచి సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉందని అజ్మల్, సందేశ్, అరుషి ఆనందం వెలిబుచ్చారు. -
ప్రభంజనం ఆడియో వేడుక
-
ఒక ఆశయం కోసం...
‘‘సినిమా... వినోదానికి మాత్రమే పరిమితమైన నేటి తరుణంలో ఇలాంటి సినిమా ఒకటి రావడమే ఒక ప్రభంజనం’’ అని సిరివెన్నెల సీతారామశాస్త్రి అన్నారు. ‘రంగం’ ఫేం అజ్మల్, సందేశ్, ఆరుషి, పంచిబోర ముఖ్య తారలుగా భాస్కరరావు వేండ్రాతి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘ప్రభంజనం’. పే బ్యాక్ టు సొసైటీ అనేది ఉపశీర్షిక. ఆర్పీ పట్నాయక్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఏ.కోదండరామిరెడ్డి, దశరథ్ కలిసి ఆడియో సీడీని ఆవిష్కరించి, తొలి ప్రతిని సిరివెన్నెలకి అందించారు. ప్రచార చిత్రాల్ని సి.బి.ఐ. మాజీ జె.డి. లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు. ‘‘మనుషుల్లో మార్పు వస్తేనే సమాజంలో మార్పు వస్తుంది. ఆ మార్పు కోసమే ‘ప్రభంజనం’ తీశాడు భాస్కరరావు. ఆయన ప్రయత్నం సఫలం అవ్వాలి’’ అని ఆకాంక్షించారు సిరివెన్నెల. భాస్కరరావు వేండ్రాతి మాట్లాడుతూ -‘‘ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ అధికారులు ఎంతమంది వచ్చినా సమాజంలో లంచగొండితనాన్ని నిర్మూలించలేకపోతున్నారు. ఎందుకిలా జరుగుతోందని నలుగురు ఇంజినీర్లు సర్వే చేస్తారు. ఆ సర్వేలో ఈ పరిస్థితికి కారణం ఓటర్లు, రాజకీయ నాయకులని బయటపడుతోంది. ఓటర్లలో మార్పు తెస్తేనే ఈ దుర్నీతిని అంతం చేయగలమని నిర్ణయించుకున్న ఆ ఇంజినీర్లు ఏ విధంగా అడుగులేశారు అనేదే ఈ సినిమా కథాంశం. ఒక ఆశయం కోసం తీస్తున్న ఈ చిత్రానికి సిరివెన్నెల సాహిత్యం, పట్నాయక్ సంగీతం ఆభరణాలుగా నిలుస్తాయి’’ అని చెప్పారు. మంచి సినిమాకు సంగీతం అందిస్తున్నందుకు ఆనందంగా ఉందని ఆర్పీ పట్నాయక్ అన్నారు. ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా ఇదని అజ్మల్ చెప్పారు. ఇంకా సుందర్, ఆరుషి, పంచిబోర కూడా మాట్లాడారు. గొల్లపూడి మారుతీరావు, బి.గోపాల్, ఎస్.గోపాల్‌రెడ్డి, కోటి తదితరులు పాల్గొన్నారు. -
సమసమాజం కోసం...
అవినీతి లేని సమాజాన్ని చూడాలనేది ఆ యువకుడి ఆశయం. ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న అధికారులు అవినీతిని అంతమొందిస్తారన్నది అతని ఆశ. కానీ, అతని ఆశ నెరవేరే పరిస్థితి కనిపించదు. చివరకు తనే నడుం బిగిస్తాడు. తను అనుకున్నట్లుగానే అవినీతిని సమూలంగా అంతమొందించడానికి ఏం చేసాడు? అనే శక్తిమంతమైన కథాంశంతో చైతన్య ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై భాస్కరరావు వేండ్రాతి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తోన్న చిత్రం ‘ప్రభంజనం’. ‘రంగం’ ఫేమ్ అజ్మల్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం మూడో షెడ్యూల్ వచ్చే నెల 2న ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాత మాట్లాడుతూ -‘‘నేను మెటలర్జికల్ ఇంజినీరింగ్ చదివాను. సమాజంలో ఒకడిగా సమాజాన్ని చదివి సమసమాజం కోసం ప్రయోగాత్మకంగా ఈ సినిమా చేస్తున్నాను. ఐఏయస్, ఐపీయస్, ఐఆర్‌యస్ శాఖల్లో ఉన్నవారే అవినీతిని నియంత్రించలేకపోవడంతో, సోషల్ అర్కిటెక్గా మారిన ఓ సివిల్ ఇంజనీర్ రాజకీయ వ్యవస్థపై ఎలా పోరాటం చేస్తాడు? అనేది ఈ చిత్రకథ’’ అన్నారు. సందేశ్, ఆరుషి, పంచిబొర, గొల్లపూడి మారుతీరావు, కోట శ్రీనివాసరావు, నాజర్, నాగేంద్రబాబు, ఆహుతిప్రసాద్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పాటలు: సిరివెన్నెల, సంగీతం: ఆర్.పి.పట్నాయక్, కెమెరా: సురేందర్‌రెడ్డి, కథ-కథనం-మాటలు-నిర్మాత-దర్శకత్వం: భాస్కరరావు వేండ్రాతి. -
రాజకీయ ప్రభంజనం
ఓ అల్లరి కుర్రాడు అటు కళాశాలలోనూ, ఇటు కుటుంబంలోనూ అనుకోని దుర్ఘటనలను ఎదుర్కొంటాడు. ఈ ఘటనలు.. స్వాతంత్య్రానంతర చరిత్రను తాను అధ్యయనం చేయడానికి పురిగొల్పుతాయి. తన అధ్యయనం ద్వారా సామాజిక, ఆర్థిక అసమానతలు, దోపిడీ రాజకీయ వ్యవస్థ, దానికి తోడైన అధికార వ్యవస్థలపై పూర్తిగా అవగాహన చేసుకొని ఓటర్లలో చైతన్యం తేవడానికి ప్రయత్నిస్తాడు. తదనంతరం తాను ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నాడు? అనే ఆసక్తికరమైన కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘ప్రభం జనం’. ‘రంగం’ ఫేమ్ అజ్మల్ హీరోగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని భాస్కరరావు వేండ్రాతి స్వీయదర్శకత్వంలో నిర్మిస్తున్నారు. మంగళవారం హైదరాబాద్‌లో రెండో షెడ్యూలు మొదలైంది. ఈ సందర్భంగా భాస్కరరావు వేండ్రాతి మాట్లాడుతూ -‘‘నలుగురు ఇంజినీరింగ్ స్టూడెంట్స్ కథ ఇది. సందేశంతో పాటు కావాల్సినంత వినోదం కూడా ఈ కథలో ఉంటుంది. ఇందులో మొత్తం 5 పాటలుంటాయి. సిరివెన్నెల సీతారామశాస్త్రి అద్భుతమైన సాహిత్యం అందించారు. చాలా రోజుల విరామం తర్వాత ఆర్పీ పట్నాయక్ మా చిత్రానికి స్వరాలందించారు. డిసెంబర్ ద్వితీయార్ధంలో పాటలను, జనవరిలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. సందేశ్, ఆరుషి,పంచి బొరా, నాజర్, నాగబాబు, కోట శ్రీనివాసరావు, గొల్లపూడి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సురేందర్‌రెడ్డి, నిర్మాణం: చైతన్య ఆర్ట్ క్రియేషన్స్.