ఆలోచింపజేసే సినిమా
ఆలోచింపజేసే సినిమా
Published Thu, Apr 3 2014 11:51 PM | Last Updated on Sat, Sep 2 2017 5:32 AM
ఓటర్లలో అవగాహన పెంచి, వారిలో ఉద్యమస్ఫూర్తిని రగిలించి, సన్మార్గంలో నడిపించడానికి కృషి చేసిన నలుగురు యువకుల కథతో తెరకెక్కిన చిత్రం ‘ప్రభంజనం’. భాస్కరరావు వేండ్రాతి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అజ్మల్, సందేశ్, అరుషి, పంచిబోర ముఖ్య తారలు. సెన్సార్ కార్యక్రమాలు ముగించుకున్న ఈ చిత్రం నెల 12న లేదా 18న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భాస్కరరావు మాట్లాడుతూ -‘‘జనం కోసం తీసిన సినిమా ఇది. 67 ఏళ్ల స్వతంత్ర భారతంలో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి.
పజలపై వాటి ప్రభావం ఎంత బలీయంగా ఉందో తెలిపే సినిమా ఇది. అలాగని డాక్యుమెంటరీలా ఈ సినిమా ఉండదు. కమర్షియల్ హంగులన్నీ ఇందులో ఉంటాయి. నటీనటుల నటన, సాంకేతిక నిపుణుల అద్భుతమైన ప్రతిభ ఈ సినిమాకు ప్రధాన బలాలు. ఓ వైపు ఆనందింపజేస్తూ, మరో వైపు ఆలోచింపజేసే సినిమా ఇది’’ అన్నారు. లంచగొండితనంపై ఇప్పటివరకూ చాలా సినిమాలొచ్చాయని, కానీ వాటిలో చూపించని ఎన్నో అంశాలను ఇందులో చూపించారని, ప్రస్తుతం సమాజంలో ఏం జరుగుతుంది? దేశ పౌరులుగా మన బాధ్యత ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా అని ఆర్పీ పట్నాయక్ చెప్పారు. మంచి సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉందని అజ్మల్, సందేశ్, అరుషి ఆనందం వెలిబుచ్చారు.
Advertisement
Advertisement