సమసమాజం కోసం...
అవినీతి లేని సమాజాన్ని చూడాలనేది ఆ యువకుడి ఆశయం. ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న అధికారులు అవినీతిని అంతమొందిస్తారన్నది అతని ఆశ. కానీ, అతని ఆశ నెరవేరే పరిస్థితి కనిపించదు. చివరకు తనే నడుం బిగిస్తాడు. తను అనుకున్నట్లుగానే అవినీతిని సమూలంగా అంతమొందించడానికి ఏం చేసాడు? అనే శక్తిమంతమైన కథాంశంతో చైతన్య ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై భాస్కరరావు వేండ్రాతి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తోన్న చిత్రం ‘ప్రభంజనం’. ‘రంగం’ ఫేమ్ అజ్మల్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం మూడో షెడ్యూల్ వచ్చే నెల 2న ప్రారంభం కానుంది.
ఈ సందర్భంగా దర్శక, నిర్మాత మాట్లాడుతూ -‘‘నేను మెటలర్జికల్ ఇంజినీరింగ్ చదివాను. సమాజంలో ఒకడిగా సమాజాన్ని చదివి సమసమాజం కోసం ప్రయోగాత్మకంగా ఈ సినిమా చేస్తున్నాను. ఐఏయస్, ఐపీయస్, ఐఆర్‌యస్ శాఖల్లో ఉన్నవారే అవినీతిని నియంత్రించలేకపోవడంతో, సోషల్ అర్కిటెక్‌గా మారిన ఓ సివిల్ ఇంజనీర్ రాజకీయ వ్యవస్థపై ఎలా పోరాటం చేస్తాడు? అనేది ఈ చిత్రకథ’’ అన్నారు. సందేశ్, ఆరుషి, పంచిబొర, గొల్లపూడి మారుతీరావు, కోట శ్రీనివాసరావు, నాజర్, నాగేంద్రబాబు, ఆహుతిప్రసాద్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పాటలు: సిరివెన్నెల, సంగీతం: ఆర్.పి.పట్నాయక్, కెమెరా: సురేందర్‌రెడ్డి, కథ-కథనం-మాటలు-నిర్మాత-దర్శకత్వం: భాస్కరరావు వేండ్రాతి.