ఒక ఆశయం కోసం...
ఒక ఆశయం కోసం...
Published Sun, Feb 2 2014 11:46 PM | Last Updated on Tue, Nov 6 2018 4:19 PM
‘‘సినిమా... వినోదానికి మాత్రమే పరిమితమైన నేటి తరుణంలో ఇలాంటి సినిమా ఒకటి రావడమే ఒక ప్రభంజనం’’ అని సిరివెన్నెల సీతారామశాస్త్రి అన్నారు. ‘రంగం’ ఫేం అజ్మల్, సందేశ్, ఆరుషి, పంచిబోర ముఖ్య తారలుగా భాస్కరరావు వేండ్రాతి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘ప్రభంజనం’. పే బ్యాక్ టు సొసైటీ అనేది ఉపశీర్షిక. ఆర్పీ పట్నాయక్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఏ.కోదండరామిరెడ్డి, దశరథ్ కలిసి ఆడియో సీడీని ఆవిష్కరించి, తొలి ప్రతిని సిరివెన్నెలకి అందించారు.
ప్రచార చిత్రాల్ని సి.బి.ఐ. మాజీ జె.డి. లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు. ‘‘మనుషుల్లో మార్పు వస్తేనే సమాజంలో మార్పు వస్తుంది. ఆ మార్పు కోసమే ‘ప్రభంజనం’ తీశాడు భాస్కరరావు. ఆయన ప్రయత్నం సఫలం అవ్వాలి’’ అని ఆకాంక్షించారు సిరివెన్నెల. భాస్కరరావు వేండ్రాతి మాట్లాడుతూ -‘‘ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్, ఐఆర్‌ఎస్ అధికారులు ఎంతమంది వచ్చినా సమాజంలో లంచగొండితనాన్ని నిర్మూలించలేకపోతున్నారు. ఎందుకిలా జరుగుతోందని నలుగురు ఇంజినీర్లు సర్వే చేస్తారు. ఆ సర్వేలో ఈ పరిస్థితికి కారణం ఓటర్లు, రాజకీయ నాయకులని బయటపడుతోంది.
ఓటర్లలో మార్పు తెస్తేనే ఈ దుర్నీతిని అంతం చేయగలమని నిర్ణయించుకున్న ఆ ఇంజినీర్లు ఏ విధంగా అడుగులేశారు అనేదే ఈ సినిమా కథాంశం. ఒక ఆశయం కోసం తీస్తున్న ఈ చిత్రానికి సిరివెన్నెల సాహిత్యం, పట్నాయక్ సంగీతం ఆభరణాలుగా నిలుస్తాయి’’ అని చెప్పారు. మంచి సినిమాకు సంగీతం అందిస్తున్నందుకు ఆనందంగా ఉందని ఆర్పీ పట్నాయక్ అన్నారు. ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా ఇదని అజ్మల్ చెప్పారు. ఇంకా సుందర్, ఆరుషి, పంచిబోర కూడా మాట్లాడారు. గొల్లపూడి మారుతీరావు, బి.గోపాల్, ఎస్.గోపాల్‌రెడ్డి, కోటి తదితరులు పాల్గొన్నారు.
Advertisement