ఉత్తర కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ నగరంలో సిలికానాంధ్ర 22వ సంస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలోని డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి భవనం ఈ వేడకకు వేదికయ్యింది. గత 22ఏళ్ల ఆనవాయితీ ప్రకారం.. ఈ సభ కూడా బ్రహ్మశ్రీ మారేపల్లి నాగవేంకటశాస్త్రిగారి వేదాశ్వీరచనంతో మొదలయ్యింది. సంస్థాపక దినోత్సవ వేడుకలో ప్రముఖ ఆకర్షణగా కళారత్న గుమ్మడి గోపాలకృష్ణ దర్శకత్వంలో, ఆకెళ్ల రచించిన శ్రీనాథుడు పూర్తి నిడివి తెలుగు పద్య నాటకాన్ని ప్రదర్శించారు. ఇందులో గుమ్మడి గోపాలకృష్ణ శ్రీనాథుడి పాత్ర పోషించగా, సిలికానాంధ్ర కుటుంబ సభ్యులు మిగిలిన పాత్రలు పోషించారు.
నాటకాన్ని తిలకించిన ప్రేక్షకులు పాత్రలతో మమేకమైపోయారు. శ్రీనాథుడి జీవిత చరమాంక సన్నివేశాల్లో సభలో కంటతడి పెట్టని వారు లేరంటే అతిశయోక్తి కాదు. నాటకం అనంతరం డా. లక్కిరెడ్డి హనిమిరెడ్డి చేతుల మీదుగా గుమ్మడి గోపాలకృష్ణకు సన్మానం జరిగింది. ఆయనకు శాలువా కప్పి పదివేల డాలర్ల బహుమతి కూడా ప్రకటించారు. ఈ కార్యక్రమానికి బూదరాజు శ్రీనివాసమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఒక పద్యనాటక ప్రదర్శన చూడలేదని పేర్కొన్నారు. సిలికానంద్ర కుటుంబానికి ఆప్తులు, సన్నిహితులు దివంగత సిరివెన్నెల సీతారామశాస్త్రి కుటుంబం కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
వేదికంతా పొగ కమ్మేయగా సిరివెన్నెలే వచ్చారా అన్నట్టుగా వారి కుమారుడు యోగిని వాళ్ళ నాన్నగారిలా వేదిక మీదకి రావడం ఆహూతులకు ఆశ్చర్యానంద అనుభూతిని కలిగించింది.సిరివెన్నెల కుటుంబసభ్యుల సమక్షంలో యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర తెలుగు శాఖలో వచ్చే ఏడాది నుంచి సిరివెన్నెల ఆచార్య పీఠం ప్రారంభిస్తున్నట్టు యూనివర్సిటీ అధ్యక్షులు డా. కూచిభొట్ల ఆనంద్ ప్రకటించారు. అలానే ప్రతీ సంవత్సరం విశ్వవిద్యాలయ స్నాతకోత్సవ సభలో సిరివెన్నెల స్మారకోపన్యాసము, సిరివెన్నెల స్మారక పతకం ఇవ్వనున్నట్టు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment