
కామెడీ హీరోలు చులకనైపోయారు!
యాక్షన్ హీరోగా ఎంట్రీ ఇచ్చినా, కామెడీ పాత్రలతోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకోగలిగాడు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్. హెరాఫెరీ, వెల్కం, సింగ్ ఈజ్ కింగ్ లాంటి సినిమాలతో కామెడీ హీరోగా మంచి ఇమేజ్ సొంతం చేసుకున్న ఆయన.. హాస్యాన్ని పండించే హీరోలకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రావటం లేదని.. రొమాంటిక్, యాక్షన్, ఫ్యామిలీ సినిమాలు చేస్తున్న హీరోలతో పోలిస్తే కామెడీ క్యారెక్టర్లు చేస్తున్న నటులను చిన్నచూపు చూస్తున్నారని వాపోతున్నాడు!
బేబి, బ్రదర్స్ లాంటి సీరియస్ సినిమాల తరువాత మరోసారి తనుకు బాగా నచ్చిన కామెడీ జానర్లో తెరకెక్కిన సింగ్ ఈజ్ బ్లింగ్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు అక్షయ్ కుమార్. అమీజాక్సన్, లారాదత్త, కెకె మీనన్లు ఇతర లీడ్ రోల్స్లో నటిస్తున్న ఈ సినిమాకు దర్శకుడు ప్రభుదేవా. ఇప్పటికే షూటింగ్తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 2న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా అక్షయ్ మంగళవారం మీడియాతో మాట్లాడారు.
ఏది ఏమైనప్పటికీ తనకు మాత్రం కామెడీ సినిమాలు చేయటమే ఇష్టమని, నటుడిగా కామెడీ పండించడంలో ఛాలెంజ్ ఉందంటున్నాడు. అమితాబ్, కిశోర్కుమార్ లాంటి లెజెండ్స్ కూడా కామెడీ సినిమాలు చేశారన్న అక్షయ్, తనకు అలాంటి పాత్రలు చేయటమే ఇష్టమన్నాడు. సినిమా రంగంతో పాటు టివి షోస్లో కూడా ఎక్కువగా కామెడీ మీదే దృష్టిపెడుతుండటంతో కామెడీ టైమింగ్ ఉన్ననటులకు మంచి అవకాశాలు వస్తున్నాయని చెబుతున్నాడు.