సినిమా రివ్యూ: సాదాసీదా 'బాస్'! | Akshay Kumar fails as "Boss' | Sakshi
Sakshi News home page

సినిమా రివ్యూ: సాదాసీదా 'బాస్'!

Published Wed, Oct 16 2013 3:11 PM | Last Updated on Fri, Sep 1 2017 11:41 PM

సినిమా రివ్యూ: సాదాసీదా 'బాస్'!

సినిమా రివ్యూ: సాదాసీదా 'బాస్'!

'వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై దోబారా' చిత్రంతో పూర్తి స్థాయిలో బాలీవుడ్ అగ్రనటుడు అక్షయ్ కుమార్  ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయిన సంగతి తెలిసిందే. అయితే  మమ్ముట్టి, పృథ్వీరాజ్, శ్రీయ సరన్ లు నటించిన మలయాళ చిత్రం పోకిరి రాజా ఆధారంగా  రూపొందిన 'బాస్' చిత్రం ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు మరోసారి ప్రయత్నం చేశాడు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ తోపాటు మిథున్ చక్రవర్తి, శివ్ పండిట్, అధితి రావు హైద్రీ, రోనిత్ రాయ్ లాంటి అగ్రతారలందరూ నటించడం, మీట్ బ్రాస్ అంజన్, చిరంతన్ భట్, పీఏ దీపక్, యో యో హనీ సింగ్ కలిసి చిత్రానికి సంగీతం అందించడం, అతిధి పాత్రలో సోనాక్షి సిన్హా, ప్రత్యేక పాటల్లో ప్రభుదేవా, హనీ సింగ్ లు కనిపించడం, ప్రపంచవ్యాప్తంగా  సుమారు 3800 థియేటర్లలో విడుదల లాంటి అంశాలు 'బాస్' పై ఆసక్తిని, అంచనాలను పెంచాయి. బాలీవుడ్ లో అగ్రస్థానం కోసం కొనసాగుతున్న ఆధిపత్య పోరులో అక్షయ్ కుమార్ ను బాలీవుడ్ లో 'బాస్'గా నిలిపిందా అనే విషయాన్ని తెలుసుకునేందుకు కథలోకి వెళ్లాల్సిందే. 
 
విలువలకు కట్టుబడి ఉండే సత్యకాంత్ శాస్త్రి (మిథున్ చక్రవర్తి) ఓ టీచర్. సత్యకాంత్ కు సూర్య (అక్షయ్ కుమార్), శివ్ (శివ్ పండిట్) ఇద్దరు కుమారులుంటారు. ఇద్దరు కొడుకుల్లో పెద్దవాడు సూర్య ముక్కు సూటి మనస్తత్వంతో తండ్రికి ఇబ్బందిగా మారుతాడు. అయితే కొన్ని సంఘటనల కారణంగా సూర్యను చిన్నతనంలోనే ఇంటి నుంచి వెళ్లగొడతాడు. ఇంటి నుంచి బయటకు వచ్చిన సూర్య.. బిగ్ బాస్ (డానీ) అనే ట్రాన్స్ పోర్ట్ యజమానిని ఓ హత్య ప్రయత్నం నుంచి కాపాడుతాడు. దాంతో సూర్యను చేరదీసి బాస్ గా తయారు చేస్తాడు. ట్రాన్ పోర్ట్ బిజినెస్ తోపాటు కాంట్రాక్ట్ మాఫియా వ్యవహారాలు కూడా నిర్వహిస్తుంటాడు బిగ్ బాస్. కథ ఇలా నడుస్తుండగా.. హోంమంత్రి అండతో ఆయుష్మాన్ ఠాకూర్ అనే  పోలీస్ ఆఫిసర్ సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుంటాడు. ఆయుష్మాన్ చెల్లెలు అంకితతో (ఆధితి రావు హైదరీ) శివ్ ప్రేమలో పడుతాడు. అప్పటికే హోంమంత్రి కుమారుడితో అంకితకు నిశ్చితార్ధం ఖాయం కావడంతో శివ్ ను అంకిత నుంచి దూరం చేయడమే కాకుండా మట్టుపెట్టేందుకు హోంమంత్రి, పోలీస్ ఆఫీసర్ లు బాస్ ను ఆశ్రయిస్తారు. అయితే తాను మట్టుపెట్టాల్సింది తన తమ్ముడినే అని తెలుసుకున్న బాస్.. శివ్ ను ఎలా రక్షించాడు. తండ్రికి ఎలా చేరువయ్యాడు అనే ప్రశ్నలకు సమాధానమే 'బాస్' చిత్రం. 
 
'బాస్' గా అక్షయ్ కుమార్ అన్న, కొడుకు, ఓ మాస్ హీరో ఎలిమెంట్స్ ఉన్న పాత్రను పోషించాడు. గతంలో అక్షయ్ కుమార్ ఎలాంటి పాత్రల్లో ఎక్కువగానే కనిపించాడు. అయితే అక్షయ్ కుమార్ ను బాలీవుడ్ లో బాస్ గా నిలపెట్టే పాత్ర కాకపోవడం అభిమానులను నిరాశపరిచే అంశం.  అయితే అక్కడక్కడా తన కామెడీ పంచ్ లతో అభిమానులను ఉత్సాహ పరిచాడంలో కొంత అక్షయ్ సఫలమయ్యాడు. 
 
అక్షయ్ తండ్రిగా మిథున్ పాత్ర పరిధి మేరకు పర్వాలేదనింపించాడు. సత్యకాంత్ పాత్ర మిథున్ కు గొప్ప పేరును తీసుకువస్తుందని ఆశించడం పొరపాటే అవుతుంది. దుష్ట పోలీస్ ఆఫిసర్ గా రోనిత్ రాయ్ ఓకే అయినా.. అక్షయ్ కుమార్ ముందు తేలిపోయాడు. శివ్ పండిట్ పాత్రకు ప్రాధాన్యత లేకపోయింది. అధితి ఓ బికిని సీన్ లో మెరిసినా.. ఆ తర్వాత అతిధి పాత్రకే పరిమితమైంది. 
 
మీట్ బ్రాస్ అంజన్, చిరంతన్ భట్, పీఏ దీపక్, యో యో హనీ సింగ్ లు నలుగురు కలిసి అందించిన సంగీతం కూడా ఆకట్టుకోలేకపోయింది. ఇక కథ రొటిన్ గా ఉండటం, పాతకాలం నాటి కథకు కొత్తగా చూపించే ప్రయత్నం బెడిసి కొట్టిందని చెప్పవచ్చు. పాత కథకు కమర్షియల్ హంగులు కల్పించడంలో దర్శకుడు అంథోని డిసౌజా దారుణంగా విఫలమయ్యాడు. కామెడి చిత్రంగానో లేక యాక్షన్ చిత్రంగా రూపొందించాలనే సందిగ్ఘంలో దర్శకుడు కొంత తడబాటుకు గురైనట్టు కనిపించింది. ఇక రెండు ప్రత్యేక పాటల్లో కనిపించిన సోనాక్షి సిన్హా, ఓ పాటలో కనిపించిన ప్రభుదేవా కూడా ప్రేక్షకుల్ని థియేటర్ రప్పించడం కష్తమే. ఏది ఏమైనా.. బాలీవుడ్ లో ఈ చిత్రం ద్వారా అక్షయ్ కుమార్ సాదాసీదా 'బాస్' గానే మిగిలి పోవడం ఖాయం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement