
ప్లీజ్... అవార్డు వెనక్కి తీసేసుకోండి!
జాతీయ పురస్కారం అందుకునే అర్హత నాకు లేదని ఎవరైనా భావిస్తే... వాళ్లు నాకు వచ్చిన అవార్డును వెనక్కి తీసేసుకోవచ్చు’’ అన్నారు అక్షయ్‌కుమార్.
‘‘జాతీయ పురస్కారం అందుకునే అర్హత నాకు లేదని ఎవరైనా భావిస్తే... వాళ్లు నాకు వచ్చిన అవార్డును వెనక్కి తీసేసుకోవచ్చు’’ అన్నారు అక్షయ్‌కుమార్. ఇటు చిత్ర పరిశ్రమలోనూ, అటు ప్రేక్షకుల్లోనూ ఈ ఏడాది 64వ జాతీయ చలనచిత్ర అవార్డులు అగ్గి రాజేశాయి. ముఖ్యంగా జాతీయ ఉత్తమ నటుడిగా అక్షయ్ కుమార్‌కి అవార్డు ఇవ్వడం వివాదాస్పదమైంది.
దాంతో జాతీయ అవార్డుల కమిటీ చైర్మన్ ప్రియదర్శన్ వెంటనే రంగంలోకి దిగి... ‘‘రుస్తుం’ మాత్రమే కాదు, ‘ఎయిర్‌లిఫ్ట్’లోనూ అక్షయ్ నటనను పరిగణలోకి తీసుకుని అవార్డు ఇచ్చాం’’ అని వివరణ ఇచ్చారు. అవార్డులు ప్రకటించిన రోజునే ఈ వివాదం అక్షయ్ కుమార్ దృష్టికి వెళ్లినట్టుంది. ‘‘నేను ఛీటింగ్ చేయలేదు. అవార్డు కోసం ఎవరికీ ఫోనూ చేయలేదు. నాకు ఫేవర్ చేయమని డబ్బులూ ఇవ్వలేదు’’ అన్నారాయన.
అయినప్పటికీ విమర్శలు ఆగలేదు. సోమవారం ముంబయ్‌లో జరిగిన మూవీ స్టంట్ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యక్రమంలో అక్షయ్ పాల్గొన్నారు. అక్కడ ఈ జాతీయ అవార్డు గురించి ప్రస్తావన రాగానే... ‘‘గత పాతికేళ్లుగా గమనిస్తున్నా. ఎప్పుడు ఎవరు అవార్డు (నేషనల్) నెగ్గినా ఓ చర్చ మొదలవుతుంది.
‘వాళ్లు అవార్డు నెగ్గి ఉండాల్సింది. వీళ్లకు దక్కి ఉండకూడదు’ అని వివాదం సృష్టిస్తారు. నటుడిగా ప్రయాణం ప్రారంభించిన 26 ఏళ్లకు నాకు జాతీయ అవార్డు వచ్చింది. ఎవరైనా నాకీ అవార్డు రాకూడదని కోరుకుంటే... ప్లీజ్, నా నుంచి తీసేసుకోండి’’ అని కాస్త ఘాటుగానే స్పందించారు అక్షయ్. ఇకనైనా, ఈ అవార్డు గోలకు ఫుల్‌స్టాప్ పడుతుందో... లేదో?