
కట్టేసి మరీ పెళ్లి చేసేట్లున్నారు :అల్లరి నరేశ్
‘‘ఇక నుంచి మా ‘ఈవీవీ సినిమాస్’ సంస్థలో నాన్న పేరును నిలబెట్టే సినిమాలు తీయాలనే సంకల్పంతో ఉన్నాం’’ అని అల్లరి నరేశ్ అన్నారు. నేడు ఆయన బర్త్‌డే. ఈ సందర్భంగా విలేకరులతో ముచ్చటించారు నరేశ్. ‘‘ప్రస్తుతం మేం నిర్మిస్తున్న చిత్రం ‘బందిపోటు’. జూలై 1న సెట్స్‌కి వెళ్లనున్న ఈ సినిమాకు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకుడు. దొంగల్ని దోచుకునే ఘరానా దొంగలా ఇందులో కనిపిస్తా. తొలిసారి నిర్మాణ బాధ్యతలు తీసుకున్నాను కాబట్టి... ముందు నన్ను నేను ప్రిపేర్ చేసుకునే పనిలో ఉన్నాను’’ అని చెప్పారు నరేశ్.
వచ్చే ఏడాది ప్రారంభమయ్యే తన 50వ చిత్రం కెరీర్‌లో నిలిచిపోయేలా ఉంటుందని, అలాగే... 2017లో తన దర్శకత్వంలో సినిమా ఉంటుందన్నారు. -‘‘ఇక నుంచి ప్రేక్షకుల ఆకాంక్ష మేరకు కామెడీ సినిమాలే చేస్తా. అయితే.. ఇక నా సినిమాల్లో అనుకరణలు మాత్రం ఉండవ్’’ అని తేల్చేశారు. గత కొనేళ్ల నుంచి మార్చి 31 లోపు పెళ్లి చేసేయాలనే మా ఇంట్లో ప్రయత్నిస్తున్నా వారికి కుదరడం లేదని, వచ్చే ఏడాది మాత్రం కట్టేసి మరీ పెళ్లి చేసేట్లు ఉన్నారని తనదైన శైలిలో నవ్వుతూ చెప్పారు నరేశ్. చిన్నికృష్ణ దర్శకత్వంలో చేస్తున్న సినిమా రెండు పాటలు, ప్యాచ్ వర్క్ మినహా పూర్తయిందని, దానికి టైటిల్ ఇంకా ఖరారు కాలేదని నరేష్ తెలిపారు.