కొత్త అభిమానులు ఏర్పడ్డారు! | Allu Arjun Exclusive Interview | Sakshi
Sakshi News home page

కొత్త అభిమానులు ఏర్పడ్డారు!

Published Sat, May 14 2016 11:58 PM | Last Updated on Mon, Sep 4 2017 12:06 AM

కొత్త అభిమానులు ఏర్పడ్డారు!

కొత్త అభిమానులు ఏర్పడ్డారు!

 ఫ్యాన్స్ గుండెల్లోకి రేసుగుర్రంలా దూసుకెళ్లిపోయారు అల్లు అర్జున్. ‘దే...వు...డా’ అంటూ సరదాగా నవ్వించినా, ‘గమ్మునుండవోయ్’ అంటూ మాటలతో కొట్టినంత పని చేసినా... బన్నీ ఏం చేసినా స్టైల్‌గా ఉంటుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బన్నీ చేసిన ‘సరైనోడు’ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ‘ఈ చిత్రం మంచి వసూళ్లు రాబట్టడం ఆనందంగా ఉంది’ అని బన్నీ అన్నారు. ‘సాక్షి’ జరిపిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో మరిన్ని విశేషాలు చెప్పారు.
 
 బోయపాటితో సినిమా అనగానే, తెరపై మీరు కనిపించరు.. బాలకృష్ణే కనిపిస్తారని చాలామంది అనుకున్నారు.. కానీ మీరే కనిపించారు?
 (నవ్వుతూ..) బాలకృష్ణగారితో బోయపాటి వరుసగా రెండు సూపర్ హిట్ సినిమాలు చేశారు. ఆ తరువాత ఏ హీరోతో సినిమా చేసినా.. ఆ హీరోని బాలకృష్ణగారిలానే  చూపిస్తారేమో అనుకుని ఉంటారు. బాలకృష్ణగార్ని ఎలా ప్రెజెంట్ చేయాలో ఆయన్ను బోయపాటి అలానే ప్రెజెంట్ చేశారు. ‘సరైనోడు’ షూటింగ్ సమయంలో ‘నాకు మైఖేల్ జాక్సన్ దొరికితే డ్యాన్స్, మైక్ టైసన్ దొరికితే బాక్సింగ్ సినిమా తీస్తా’ అని బోయపాటి అన్నారు. హీరో ఎలా ఉంటే దానికి తగ్గట్టు సినిమా తీస్తారాయన. ‘హీ ఈజ్ వెరీ గుడ్ డెరైక్టర్’. నన్ను ప్రెజెంట్ చేసేటప్పుడు ఏ స్థాయిలో పుష్ చేయాలో అంతే చేశారు. ఎంత పుష్ చేయాలో, ఎక్కడ ఆపాలో తెలిసిన వ్యక్తి.
 
 ఊర మాస్‌గా కనిపించడంతో మీ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు...
 అభిమానులు హ్యాపీ అంటే నేను హ్యాపీనే. కానీ, ఇప్పుడున్న ఫ్యాన్స్ కాకుండా కొత్త ఫ్యాన్స్ కూడా ఏర్పడేలా చేసిన సినిమా ఇది. ఇప్పటి వరకూ నా సినిమాలు ఒక లెవల్ వరకు వెళ్లాయి కానీ, ఈ చిత్రం కింది స్థాయి వరకూ తీసుకెళ్లింది. ఇటు క్లాస్, అటు మాస్ కాకుండా యూనివర్సల్ అవ్వాలనేదే నా కోరిక. అది ‘సరైనోడు’తో తీరింది.
 
 50 కోట్ల మార్క్ దాటేశారు... వంద దాకా?
 యాభై కోట్లు అనేది ఈ సినిమాతో కాదు.. ఎప్పుడో దాటేశా. రికార్డ్స్ గురించి మాట్లాడను. ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘రేసుగుర్రం’, ‘సరైనోడు’.. ఇలా వరుస విజయాలతో హ్యాట్రిక్ సాధించాను. ‘సన్నాఫ్..’, ‘రేసుగుర్రం’ కొంచెం క్లాస్ పర్సన్స్‌కి, చదువుకున్నవారికీ నచ్చాయి. కానీ, ‘సరైనోడు’ లారీ డ్రైవర్... ఆఫీస్ బాయ్.. ఇలా అందరికీ రీచ్ అయ్యింది. ఇప్పటివరకూ నేను రీచ్ కాని వారికి కూడా దగ్గరవడం హ్యాపీగా ఉంది. ‘రుద్రమదేవి’లో చేసిన గోన గన్నారెడ్డి పాత్ర కింద లెవల్‌కి వెళ్లడానికి ఎంతో కొంత హెల్ప్ చేస్తే, ‘సరైనోడు’ ఫుల్‌గా చేసింది.
 
  కొత్త కాన్సెప్ట్స్‌తో తీసే సినిమాలపై మీ అభిప్రాయం?
 కొత్తగా ట్రై చేయడం మంచిదే. నా మటుకు నేను కొత్తగా ఉంది కదా అని ఒప్పేసుకోను. అది బాగుందా? లేదా? అని చెక్ చేసుకుని, ఆ తర్వాతే ముందుకెళతా. కొత్తగా ఉన్నది ప్రేక్షకులకు నచ్చాలని లేదు, నచ్చకూడదనీ లేదు. బేసిక్‌గా గుడ్ ఫిల్మ్ అనేది అందరికీ రీచ్ అవుతుంది. ‘సరైనోడు’నే తీసుకుందాం.. కొత్తగా చేయాలనే కోరిక నాకుంది. కొత్తగా చూపించాలనే కోరిక బోయపాటికి ఉంది. నేర్చుకోవాలనే తపన నాకుంది, నేర్పించాలని ఆయనకుంది. అందుకే సినిమా బాగా వచ్చింది.
 
 కథ విన్నప్పుడే ఈ సినిమా రిజల్ట్‌ని మీరు జడ్జ్ చేయగలిగారా?
 ఈ చిత్రకథ విని, రిజల్ట్‌ని జడ్జ్ చేయడం కష్టం. హీరోను ప్రెజెంట్ చేసే విధానం, ఆడియోను సరైన చోట ప్రెజెంట్ చేయడం, యాక్షన్ పార్ట్ వంటివన్నీ సరిగ్గా కుదిరితే ‘ఇట్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఫిలిం’. ఈ సినిమాకి బోయపాటి అన్నీ చక్కగా కుదిరేలా చేశారు. కొన్ని చిత్రాలకు ముందే రిజల్ట్ ఊహించడం కష్టం. ‘ఆర్య’ను తీసుకుందాం. క్యారెక్టర్‌ని ఫాలో అయ్యే సినిమా అది. కొన్ని చిత్రాలు స్క్రీన్‌ప్లే బేస్డ్‌గా ఉంటాయి. ఒక్కో ఫిల్మ్ ఒక్కో దాన్ని బేస్ చేసుకుని వెళుతుంటుంది. ఇప్పట్లో మాత్రం పర్‌ఫెక్ట్ స్టోరీతో నడిచే చిత్రాలంటే  కష్టమే. నేను చేసినవాటిలో ‘పరుగు’ అలాంటి సినిమానే. మంచి స్టోరీ ఓరియెంటెడ్ మూవీ.
 
 ఫైట్స్ లేని సినిమా చేయడానికి రెడీయా?
 సినిమాలో ఫైట్స్ లేనప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేసే హై కంటెంట్ ఉండాలి. అది ఉన్నప్పుడు చేయొచ్చు.
 
 ‘24’ చిత్రం... మీ చిత్రం కలెక్షన్లపై ప్రభావం చూపిస్తోందా?
 ఒక ప్రాంతీయ చిత్రాన్ని ఎప్పుడూ ఓ డబ్బింగ్ సినిమా బీట్ చేయలేదు. ఎంత స్ట్రాంగ్ హీరో వచ్చినా కూడా. ఇక్కడ నా సినిమా వంద శాతం వసూలు చేస్తే, తమిళంలో ఇరవై నుంచి ముప్ఫై శాతం చేస్తుందంతే. అదే సూర్యగారి సినిమా తమిళంలో వంద శాతం వసూలు చేస్తే, ఇక్కడ ఇరవై నుంచి ముప్ఫై శాతం రాబడుతుంది. రజనీకాంత్‌గారు సీనియర్ కాబట్టి ఆయన సినిమా ఇక్కడ యాభై నుంచి అరవై శాతం వసూలు చేస్తుంది.
 
 పదమూడేళ్ల కెరీర్‌ని తల్చుకుంటే ఏమనిపిస్తోంది?
 నాకున్న లుక్స్‌కి, బాడీ లాంగ్వేజ్‌కి ఇంతదూరం రావడం ఎక్కువ. వచ్చేశా. ఇంకో 20 ఏళ్ల కెరీర్ ఉంటుందేమో. ఇలానే కెరీర్‌ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటాను.
 
 మీ సినిమాల గురించి మీ ఆవిడ స్నేహ ఏమంటారు?
 పెద్దగా పట్టించుకోదు. సినిమా హిట్టైనా, ఫ్లాప్ అయినా ఒకేలా ఉంటుంది. అదే బెస్ట్. నేను మాత్రం సినిమా విడుదలకు మూడు రోజులు ముందు, తర్వాత ఓ మూడు రోజులు కొంచెం తికమకగా ఉంటా. నా మూడ్‌ను అర్థం చేసుకుని ఆ టైమ్‌లో తను కూడా ఏమీ మాట్లాడదు.
 
 మీ అబ్బాయి పుట్టినరోజును ఫ్యామిలీ మెంబర్స్‌తో ఇక్కడ కాకుండా విదేశాల్లో సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకలా?
 వన్ ఇయర్, టు ఇయర్స్ పిల్లలకి ఎంత గ్రాండ్‌గా బర్త్‌డే చేసినా, అది వాళ్లకు తెలియదు. ఆ టైమ్‌లో అందర్నీ పిలిచి సెలబ్రేట్ చేస్తే అందరూ ఎవరికి వాళ్లు మాట్లాడుకోవడం తప్ప పిల్లలకు సెలబ్రేట్ చేసినట్టుండదు. నాకు తెలిసి నాలుగేళ్లో, ఐదేళ్లో వచ్చిన తర్వాత సెలబ్రేట్ చేస్తే వాడి ఫీలింగ్స్‌కి రెస్పెక్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. అందుకే ఊహ తెలిశాక ఇక్కడ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు మాత్రం పిల్లలను ఎక్కడికి తీసుకెళితే ఎంజాయ్ చేస్తారో అక్కడి తీసుకెళుతున్నాను. విదేశాలకు వెళ్ళిపోతే తగినంత ప్రైవసీ ఉంటుంది. అక్కడ జూకు తీసుకెళితే జంతువులను చూసి, ఎంజాయ్ చేస్తాడు. నేను వాటివైపు చూడకపోతే నన్ను ‘నాన్నా నాన్నా’ అని పిలుస్తాడు. అప్పటికీ చూడకపోతే ‘అర్జున్’ అని పిలుస్తాడు.
 
  అర్జున్ అని పిలుస్తాడా? ఆ పిలుపు ఎలా అలవాటైంది?
 మా ఆవిడ అలానే పిలుస్తుంది. అది వింటాడు కదా.
 
  సరే.. మీ అబ్బాయి అయాన్ గురించి ఇంకొన్ని ముచ్చట్లు చెప్పండి.
 ఏవైనా తినమంటే ఒక్కోసారి మారాం చేస్తుంటాడు. అబ్బాయి కదా... హుషారుగా పరిగెడుతుంటాడు. తిన్న వెంటనే అదంతా కక్కేసుకునే రేంజ్‌లో ఆడతాడు. మాకేమో ఖంగారు. కన్ను మూసి తెరిచే లోపు ఏదో ఒకటి లాగేస్తుంటాడు. గోల గోల చేసేస్తాడు (నవ్వుతూ...). చాలా ఎంజాయబుల్‌గా ఉంటుంది.
 
 అయాన్‌కి మీరెప్పుడైనా స్నానం చేయించారా?
 ఒక్కసారి చేయించాను. స్నానం చేసి బాత్రూమ్ నుంచి బయటికి తీసుకొచ్చి, నేను మ్యాట్ మీద నిలబడి, తనని నా కాళ్ల మధ్యలో నిలబెట్టుకున్నాను. అంతే.. జర్రున జారాడు. వెనక్కి బోర్లా పడ్డాడు. తలకి బాగా దెబ్బ తగిలినట్లుంది. గుక్కపట్టి ఏడ్చేశాడు. దాంతో పాటు తిన్నది మొత్తం కక్కేశాడు. భయమేసేసింది. కొద్ది సేపటికి నార్మల్ అయ్యాడు. మరుసటి రోజు ఆస్పత్రికి తీసుకెళ్లి, చెక్ చేయించాం. నార్మల్.. ఏం ఫర్లేదని చెప్పారు. ‘నిన్ను నమ్మి రెండు రోజులు బాబును అప్పగిస్తేనా..?’ అని మా ఆవిడ సీరియస్ అయ్యింది. నేనైతే ఓ రోజు హ్యాండిల్ చేయగలనేమో కానీ అంతకంటే ఎక్కువంటే కష్టం.
 
 కొంతమంది పిల్లలు ఎత్తుకోమంటూ మారాం చేస్తారు. మరి, మీవాడు?
 ఎత్తుకోమంటాడు. ఇక్కడ ఉన్నప్పుడు ఎవరో ఒకరుంటారు కాబట్టి, అందరూ ఎత్తుకుంటారు. విదేశాలు వెళ్లేటప్పుడు కూడా ఒక మనిషిని తీసుకెళతాం. కానీ, ఎంత తీసుకెళ్లినా స్విమ్మింగ్ పూల్‌లో దిగినప్పుడో, జూకి వెళ్లినప్పుడో మనమే జాగ్రత్తగా ఎత్తుకోవాలి కదా. అప్పుడు నా చేతులు నొప్పి పుడతాయి చూడండీ.. మామూలుగా ఉండదు. అయ్య బాబోయ్.. పిల్లల్ని పెంచడం చాలా కష్టమండీ బాబు. కొంతమంది ఎవరి హెల్పూ లేకుండా పెంచుతారు. వాళ్లకు జోహార్లు చెప్పాల్సిందే.
 
 సెలబ్రిటీ లైఫ్ కొంచెం క్లిష్టమే. పబ్లిక్‌లో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి కదా?
 ఫ్రెండ్స్‌తో కొంచెం సరదాగా ఉంటా. పబ్లిక్ ఫంక్షన్లో డీసెంట్‌గా ఉంటా. స్టేజ్‌పైన ఉన్నప్పుడు సరదాగా మాట్లాడే మాట ఒక్కోసారి ఎక్కడికో దారి తీస్తుంది. కావాలని అలా అనకపోయినా కొంతమందిని ఆ మాటలు హర్ట్ చేస్తాయి. ఆ తర్వాత ఆలోచించుకుంటే... ఏంటీ.. అలా మాట్లాడేశామని అనిపిస్తుంది. అందుకే పబ్లిక్ ఫంక్షన్స్‌లో మాట్లాడేటప్పుడు వీలైనంత జాగ్రత్తగా ఉంటా.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement