అల్లు గొప్ప దేశభక్తిపరుడు - చిరంజీవి
అల్లు గొప్ప దేశభక్తిపరుడు - చిరంజీవి
Published Tue, Oct 1 2013 2:10 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM
అల్లు రామలింగయ్య మహానటుడే కాదు గొప్ప దేశభక్తుడని చిరంజీవి అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో పద్మశ్రీ అల్లు రామలింగయ్య 92వ జన్మదిన సందర్భంగా సారిపల్లి కొండలరావు సారధ్యంలో పద్మశ్రీ అల్లు రామలింగయ్య కళాపీఠం జాతీయ పురస్కార ప్రదానోత్సవం - 2013 జరిగింది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ... గొప్ప గాంధేయవాది, పరమహంసకు ఆధ్యాత్మిక శిష్యుడు అల్లు. నిజ జీవితంలో పెద్ద డాక్టర్ అని కొనియాడారు. నటునిగా నాకు ఆయన గొప్ప స్ఫూర్తి ప్రదాత అని చెప్పారు.
చిన్న కుమారుడు చనిపోయిన సమయంలో గుండెల్లో బాధను అదుముకొని నటించిన కార్యదక్షకుడు అల్లు అని చెప్పారు. అంతటి గొప్ప నటుడి పేరు మీద అదే స్థాయిలో పేరున్న పెద్ద నటుడు కోట శ్రీనివాసరావుకు పురస్కారాన్ని ప్రదానం చేయటం ముదావాహం అని తెలిపారు. మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ... సమాజంలో చెడును తీసేసే రంగం సినిమా రంగమన్నారు. మరికొంతమంది నటులకు పద్మశ్రీ పురస్కారాలు రావల్సి ఉందని తెలిపారు.
రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ... చిరంజీవికి సామాజిక-రాజకీయ స్ఫూర్తి ఇచ్చింది అల్లు రామలింగయ్య అని తెలిపారు. తెలుగు మాండలికాలకు ప్రాధాన్యత తెచ్చింది కోట శ్రీనివాసరావు అని చెప్పారు. బహ్మానందం మాట్లాడుతూ... అల్లు రామలింగయ్య అంటే వళ్లంతా పులకరించే ఆనందం అని తెలిపారు. అల్లుతో నటించానని చెప్పటానికి గర్విస్తున్నానన్నారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ... భయపెడుతూ, నవ్విస్తూ, ఏడిపిస్తూ నటించటం తాతయ్యకే చెల్లిందని తెలిపారు.
అల్లు గొప్ప నటుడని తనికెళ్ల భరణి అన్నారు. అనంతరం అల్లు రామలింగయ్య కళాపీఠం జాతీయ పురస్కారంలో భాగంగా కోట శ్రీనివాసరావుకు చిరంజీవి స్వర్ణకంకణం తొడిగారు. మంత్రి కాసు శాలువతో సత్కరించగా, బ్రహ్మానందం తలపాగా తొడిగారు. అవార్డును మండలి, ప్రశంసాపత్రాన్ని అల్లు అరవింద్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐపిఎస్ అధికారి ఎం.శివప్రసాద్, పరుచూరి వెంకటేశ్వరరావు, ఎల్‌బీ శ్రీరామ్, డా.వెంకటేశ్వరరావు, బెల్లంపల్లి శ్రీనివాస్, డా. వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement