దాసరికి అల్లు రామలింగయ్య పురస్కారం
హైదరాబాద్ : ప్రముఖ దర్శక, నిర్మాత దాసరి నారాయణరావుకు హాస్యనటుడు అల్లు రామలింగయ్య పురస్కారం ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత, అల్లు రామలింగయ్య తనయుడు అల్లు అరవింద్, ప్రముఖ నటుడు మోహన్ బాబు, వరప్రసాద్‌రెడ్డి, తమ్మారెడ్డి, భరద్వాజ, దాసరి కుటుంబసభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాసరి మాట్లాడుతూ డాక్టర్ అల్లు రామలింగయ్య కళాపీఠం జాతీయ పురస్కారం అందుకోవడం ఆనందంగా ఉందన్నారు.
కొన్ని వస్తువలతో పాటు, కొందరి వ్యక్తులకు ప్రత్యామ్నాయం ఉండరని, అలాంటి నటుడే అల్లు రామలింగయ్య గారు అని అన్నారు. ఒక ఆర్టిస్ట్ పేరు మీద జాతీయ అవార్డును ఏర్పాటు చేయడం, ఆ అవార్డును తాను అందుకోవడంతో అల్లు రామలింగయ్యకు, తనకు అనుబంధం మరింత బలపడిందన్నారు. మూడు నెలలు తర్వాత మీడియాతో మాట్లాడటం సంతోషంగా ఉందని, ఇది సొంత మనుషుల అవార్డు అని అందుకే ఈ కార్యక్రమంలోనే తొలిసారి పెదవి విప్పానన్నారు. అల్లు రామలింగయ్యకు, తనకు ఉన్న అనుబంధం ఇండస్ట్రీలో అందరికీ తెలుసన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ దాసరి నారాయణరావుగారు అనారోగ్యం నుంచి కోలుకోవడం చాలా ఆనందంగా ఉందని, ఆస్పత్రిలో ఉన్నప్పుడు కూడా ఆయన తన సినిమా గురించి అడిగారని గుర్తు చేసుకున్నారు.
కాగా ఈ ఏడాది జనవరిలో దాసరి నారాయణరావు శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతూ కిమ్స్‌లో చేరారు. ఊపిరితిత్తుల్లోని ఇన్‌ఫెక్షన్ క్లీన్ చేస్తున్న సమయంలో దాసరికి గుండెపోటు రావడం, కిడ్నీల పనితీరు మందగించడంతో ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి డయాలసిస్ నిర్వహించిన విషయం తెలిసిందే.