అది అహంకారం కాదు..ఆత్మవిశ్వాసం! | Allu Sirish exclusive interview | Sakshi
Sakshi News home page

అది అహంకారం కాదు..ఆత్మవిశ్వాసం!

Published Tue, Apr 29 2014 10:35 PM | Last Updated on Sat, Sep 2 2017 6:42 AM

అది అహంకారం కాదు..ఆత్మవిశ్వాసం!

అది అహంకారం కాదు..ఆత్మవిశ్వాసం!

 ‘‘కేవలం ఒక్క సినిమాతో ఆర్టిస్టుల జాతకాన్ని నిర్ణయించలేం’’ అంటున్నారు అల్లు శిరీష్. ‘గౌరవం’గా వెండితెరకు పరిచయమైన ఈ యువహీరో, మారుతి దర్శకత్వంలో చేసిన ‘కొత్త జంట’ రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించారు.
 
 ‘కొత్త జంట’ ఎలా ఉంటుంది?
 రెండు గంటల పాటు హాయిగా నవ్వుకునేలా మారుతి ఈ సినిమాను మలిచాడు. కేరక్టర్లు కూడా గమ్మత్తుగా ఉంటాయి. ఇందులో నేను, రెజీనా మీడియా వ్యక్తులం. ఇద్దరం బీభత్సమైన పిసినార్లం. అలాంటి మా పాత్రలు ప్రేమలో పడితే ఎలా ఉంటుంది? అనేదే ‘కొత్త జంట’. అలకలు, అల్లర్లు మధ్య మధ్యలో సున్నితమైన  భావోద్వేగాలు... ఓవరాల్‌గా మనసుని మెలిపెట్టే ఎంటర్‌టైనర్ ఇది. ముఖ్యంగా మారుతితో పనిచేయడం ఓ అందమైన అనుభవం.
 
 ‘ఖైదీ నంబర్ 786’లో అన్ని హిట్టు పాటలుండగా, ‘అటు అమలాపురం..’ పాటనే ఎందుకు రీమిక్స్ చేశారు?
 కథలో వచ్చే ఓ కీలకమైన మలుపుకి ముందు ఓ ఐటమ్‌సాంగ్ అవసరం. కొత్త పాట పెట్టడం కంటే... ఫేమస్ సాంగ్‌నే రీమిక్స్ చేస్తే ప్రేక్షకులకు తొందరగా రీచ్ అవ్వొచ్చనే ఆలోచనలో భాగంగానే ‘అటు అమలాపురం’ పాటను రీమిక్స్ చేశాం. ఈ పాట కోసమే మధురిమని తీసుకోలేదు. కథలో ఆమెది కీలక పాత్ర.
 
 తొలి అడుగుతోనే ఎదురుదెబ్బ రుచి చూశారు. మరి ఈ మలి ప్రయత్నానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
 ‘గౌరవం’ నటునిగా నాకు సంతృప్తినిచ్చిన సినిమా. అలాంటి సినిమా ద్వారా పరిచయం అయినందుకు గర్వపడతాను. ఆ సినిమాలో వాణిజ్య విలువలు లోపించడం, నిడివి ఎక్కువ అవ్వడం, తమిళ వాసన... ఆ సినిమా పరాజయం పాలవ్వడానికి కారణాలు. అయితే... కేవలం ఒక్క సినిమాతో ఆర్టిస్టుల జాతకాన్ని నిర్ణయించలేం. రాబో తున్న నా ‘కొత్తజంట’లో ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఉంటాయి.
 
 ఈ సినిమా విషయంలో మీ నాన్న అల్లు అరవింద్ ప్రమేయం ఎంతవరకు ఉంది? కొన్ని రీషూట్లు జరిగాయని, సంపూర్ణేష్‌బాబు ఎపిసోడ్ అంతా తొలగించారని టాక్. మీరేమంటారు?
 కథా చర్చల్లో నాన్నగారు కూర్చుంటారు. అవి ముగిశాక మళ్లీ ఎడిటింగ్ రూమ్‌లోనే ఆయన కలిసేది! మధ్యలో జరిగే షూటింగ్‌లో ఆయన ఇన్వాల్వ్ అవ్వరు. నిజానికి ఈ సినిమా విషయంలో రీషూట్స్ ఏం చేయలేదు. కొన్ని సీన్లను తొలగించిన మాట మాత్రం వాస్తవం. సినిమా మొత్తం వేసుకొని చూసుకున్నప్పుడు సంపూర్ణేష్‌బాబు ట్రాక్ కథకు సంబంధం లేకుండా సాగినట్లు అనిపించింది. అందుకే ఆ ట్రాక్ తీసేశాం. యూనిట్ మొత్తం తీసుకున్న నిర్ణయం ఇది.
 
 మీరు మీ నాన్నగారి బాధ్యతల్ని తీసుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ మీరేమో సడన్‌గా హీరో అయిపోయారు. అంటే ఇక నిర్మాణం జోలికి పోరా?
 నిర్మాతగా చేస్తా. అయితే, దానికి అయిదారేళ్లు పడుతుంది. నిర్మాతగా కొనసాగాలంటే నా వయసు, అనుభవం సరిపోదు. గతంలో కొన్ని ప్రయత్నాలు చేశా. కానీ వర్కవుట్ కాలేదు.
 
 మీ బన్నీ అన్నయ్య కొడుకు ఎలా ఉన్నాడు?
 కాస్త పెరిగేదాకా పిల్లల దగ్గరకు నేను వెళ్లలేను. ఆరేడు నెలలు వచ్చాక అప్పుడు ఆడుకుంటా. పిల్లలకు డైపర్లు మార్చడం లాంటివి నాకు చేతకాదు. వాడైతే చాలా బాగున్నాడు. అంతా వాళ్ల అమ్మ పోలిక అంటున్నారు. అయితే... పోలిక ఇప్పుడే చెప్పలేం. వాడు పెరిగే కొద్దీ బన్నీ పోలికలు రావొచ్చు. ఇటీవలే బన్నీ మా ‘కొత్త జంట’ సినిమా చూశాడు. సమ్మర్‌లో మంచి హిట్ ఇవ్వబోతున్నావ్ అని నన్ను, మా టీమ్‌ని అభినందించాడు.
 
 నటునిగా ఎలా ముందుకెళ్లాలనుకుంటున్నారు?

 ఓ అయిదు సినిమాల వరకూ యువత మనోభావాలకు తగ్గట్టే వెళతాను. ఆ తర్వాత మాస్ సినిమా, ప్రయోగాలు చేయాలని ఉంది.
 
 ‘శిరీష్ అహంకారి’ అని బయట టాక్. దానికి మీ సమాధానం?
 అది అహంకారం కాదు ఆత్మవిశ్వాసం. సవాళ్లను స్వీకరించడం నాకు చిన్నప్పట్నుంచీ అలవాటు. ఏదైనా సూటిగా మాట్లాడతా. దాన్నే చాలామంది అహంకారం అనుకుంటున్నారు. నన్ను దగ్గరగా చూసేవారికి తెలుసు నేనేంటో.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement