Kotha Janta
-
‘కొత్త జంట’ 25 రోజుల వేడుక
-
పండగలో... ‘కొత్త జంట’
‘‘నా దృష్టిలో డబ్బులొచ్చిన సినిమానే హిట్ సినిమా. ‘కొత్తజంట’ విడుదలై మూడు వారాలు దాటుతున్నా... ఇంకా వసూళ్లు రాబడుతూనే ఉంది. కుటుంబం మొత్తం చూడదగ్గ చక్కని ఎంటర్టైనర్గా మారుతి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మా శిరీష్‌కి మంచి సక్సెస్ ఇచ్చిన మారుతితో గీతా ఆర్ట్స్ బేనర్లోనే మరో సినిమా తీస్తా’’ అని అల్లు అరవింద్ అన్నారు. అల్లు శిరీష్, రెజీనా జంటగా మారుతి దర్శకత్వంలో బన్నీ వాసు నిర్మించిన చిత్రం ‘కొత్త జంట’. ఈ చిత్రం 25 రోజుల వేడుకను శనివారం హైదరాబాద్‌లో జరిపారు. ఈ సందర్భంగా చిత్రం సమర్పకుడు అల్లు అరవింద్ మాట్లాడారు. శిరీష్‌తో పెద్ద హిట్ తీయాలని కాకుండా, స్వచ్ఛమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీయాలని ఈ చిత్రం చేశానని, తన గత చిత్రాల్లా కాకుండా, బలవంతపు వినోదం లేకుండా చేసిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకుంటోందని మారుతి ఆనందం వ్యక్తం చేశారు. ‘‘నా కెరీర్‌కి ఇది చాలా ముఖ్యమైన సినిమా. ఈ సక్సెస్‌తో నా బాధ్యత పెరిగింది. మంచి విజయాన్నిచ్చిన మారుతికి కృతజ్ఞతలు’’ అని అల్లు శిరీష్ అన్నారు. ఇంకా నటీనటులు శ్రుతి, మధు నందన్, రవి, హరి, ఏడిద శ్రీరామ్, ప్రవీణ్, సంగీత దర్శకుడు జేబీ, ఆర్ట్ డెరైక్టర్ రమణ తదితరులు మాట్లాడారు. -
మారుతి అంటే 'ఆ' హీరోలకు భయమెందుకో..?
-
అది అహంకారం కాదు..ఆత్మవిశ్వాసం!
‘‘కేవలం ఒక్క సినిమాతో ఆర్టిస్టుల జాతకాన్ని నిర్ణయించలేం’’ అంటున్నారు అల్లు శిరీష్. ‘గౌరవం’గా వెండితెరకు పరిచయమైన ఈ యువహీరో, మారుతి దర్శకత్వంలో చేసిన ‘కొత్త జంట’ రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించారు. ‘కొత్త జంట’ ఎలా ఉంటుంది? రెండు గంటల పాటు హాయిగా నవ్వుకునేలా మారుతి ఈ సినిమాను మలిచాడు. కేరక్టర్లు కూడా గమ్మత్తుగా ఉంటాయి. ఇందులో నేను, రెజీనా మీడియా వ్యక్తులం. ఇద్దరం బీభత్సమైన పిసినార్లం. అలాంటి మా పాత్రలు ప్రేమలో పడితే ఎలా ఉంటుంది? అనేదే ‘కొత్త జంట’. అలకలు, అల్లర్లు మధ్య మధ్యలో సున్నితమైన భావోద్వేగాలు... ఓవరాల్‌గా మనసుని మెలిపెట్టే ఎంటర్టైనర్ ఇది. ముఖ్యంగా మారుతితో పనిచేయడం ఓ అందమైన అనుభవం. ‘ఖైదీ నంబర్ 786’లో అన్ని హిట్టు పాటలుండగా, ‘అటు అమలాపురం..’ పాటనే ఎందుకు రీమిక్స్ చేశారు? కథలో వచ్చే ఓ కీలకమైన మలుపుకి ముందు ఓ ఐటమ్‌సాంగ్ అవసరం. కొత్త పాట పెట్టడం కంటే... ఫేమస్ సాంగ్‌నే రీమిక్స్ చేస్తే ప్రేక్షకులకు తొందరగా రీచ్ అవ్వొచ్చనే ఆలోచనలో భాగంగానే ‘అటు అమలాపురం’ పాటను రీమిక్స్ చేశాం. ఈ పాట కోసమే మధురిమని తీసుకోలేదు. కథలో ఆమెది కీలక పాత్ర. తొలి అడుగుతోనే ఎదురుదెబ్బ రుచి చూశారు. మరి ఈ మలి ప్రయత్నానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ‘గౌరవం’ నటునిగా నాకు సంతృప్తినిచ్చిన సినిమా. అలాంటి సినిమా ద్వారా పరిచయం అయినందుకు గర్వపడతాను. ఆ సినిమాలో వాణిజ్య విలువలు లోపించడం, నిడివి ఎక్కువ అవ్వడం, తమిళ వాసన... ఆ సినిమా పరాజయం పాలవ్వడానికి కారణాలు. అయితే... కేవలం ఒక్క సినిమాతో ఆర్టిస్టుల జాతకాన్ని నిర్ణయించలేం. రాబో తున్న నా ‘కొత్తజంట’లో ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఉంటాయి. ఈ సినిమా విషయంలో మీ నాన్న అల్లు అరవింద్ ప్రమేయం ఎంతవరకు ఉంది? కొన్ని రీషూట్లు జరిగాయని, సంపూర్ణేష్‌బాబు ఎపిసోడ్ అంతా తొలగించారని టాక్. మీరేమంటారు? కథా చర్చల్లో నాన్నగారు కూర్చుంటారు. అవి ముగిశాక మళ్లీ ఎడిటింగ్ రూమ్‌లోనే ఆయన కలిసేది! మధ్యలో జరిగే షూటింగ్లో ఆయన ఇన్వాల్వ్ అవ్వరు. నిజానికి ఈ సినిమా విషయంలో రీషూట్స్ ఏం చేయలేదు. కొన్ని సీన్లను తొలగించిన మాట మాత్రం వాస్తవం. సినిమా మొత్తం వేసుకొని చూసుకున్నప్పుడు సంపూర్ణేష్‌బాబు ట్రాక్ కథకు సంబంధం లేకుండా సాగినట్లు అనిపించింది. అందుకే ఆ ట్రాక్ తీసేశాం. యూనిట్ మొత్తం తీసుకున్న నిర్ణయం ఇది. మీరు మీ నాన్నగారి బాధ్యతల్ని తీసుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ మీరేమో సడన్‌గా హీరో అయిపోయారు. అంటే ఇక నిర్మాణం జోలికి పోరా? నిర్మాతగా చేస్తా. అయితే, దానికి అయిదారేళ్లు పడుతుంది. నిర్మాతగా కొనసాగాలంటే నా వయసు, అనుభవం సరిపోదు. గతంలో కొన్ని ప్రయత్నాలు చేశా. కానీ వర్కవుట్ కాలేదు. మీ బన్నీ అన్నయ్య కొడుకు ఎలా ఉన్నాడు? కాస్త పెరిగేదాకా పిల్లల దగ్గరకు నేను వెళ్లలేను. ఆరేడు నెలలు వచ్చాక అప్పుడు ఆడుకుంటా. పిల్లలకు డైపర్లు మార్చడం లాంటివి నాకు చేతకాదు. వాడైతే చాలా బాగున్నాడు. అంతా వాళ్ల అమ్మ పోలిక అంటున్నారు. అయితే... పోలిక ఇప్పుడే చెప్పలేం. వాడు పెరిగే కొద్దీ బన్నీ పోలికలు రావొచ్చు. ఇటీవలే బన్నీ మా ‘కొత్త జంట’ సినిమా చూశాడు. సమ్మర్లో మంచి హిట్ ఇవ్వబోతున్నావ్ అని నన్ను, మా టీమ్‌ని అభినందించాడు. నటునిగా ఎలా ముందుకెళ్లాలనుకుంటున్నారు? ఓ అయిదు సినిమాల వరకూ యువత మనోభావాలకు తగ్గట్టే వెళతాను. ఆ తర్వాత మాస్ సినిమా, ప్రయోగాలు చేయాలని ఉంది. ‘శిరీష్ అహంకారి’ అని బయట టాక్. దానికి మీ సమాధానం? అది అహంకారం కాదు ఆత్మవిశ్వాసం. సవాళ్లను స్వీకరించడం నాకు చిన్నప్పట్నుంచీ అలవాటు. ఏదైనా సూటిగా మాట్లాడతా. దాన్నే చాలామంది అహంకారం అనుకుంటున్నారు. నన్ను దగ్గరగా చూసేవారికి తెలుసు నేనేంటో. -
అటు అమలాపురం...ఇటు పెద్దాపురం...
చిరంజీవి నటించిన ‘ఖైదీ నెంబర్ 786’ చిత్రంలోని ‘అటు అమలాపురం... ఇటు పెద్దాపురం’ పాట అప్పట్లో సూపర్‌హిట్టు. ఈ పాటను ‘కొత్త జంట’ కోసం రీమిక్స్ చేశారు. ‘సరదాగా కాసేపు’ తదితర చిత్రాల్లో నాయికగా చేసిన మధురిమపై ఈ పాట చిత్రీకరించారు. అల్లు శిరీష్, రెజీనా జంటగా మారుతి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మించిన ‘కొత్త జంట’ మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. మారుతి తనదైన శైలిలో పూర్తి స్థాయి వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారని, అన్ని వర్గాలకూ నచ్చే విధంగా రొమాన్స్, కామెడీలను కలబోసారని నిర్మాత తెలిపారు. మారుతి మాట్లాడుతూ -‘‘అల్లు శిరీష్ శారీరక భాషకు సరిపోయే కథ ఇది. శిరీష్, రెజీనా మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. శిరీష్‌ని హీరోగా నిలబెట్టే సినిమా అవుతుంది. కథా కథనాలు చాలా ఆసక్తిగా ఉంటాయి’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: జె.బి,ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎస్.కె.ఎన్. -
‘కొత్త జంట’ ఆడియో ఆవిష్కరణ
-
నేను ఈ స్థాయికి రావడానికి కారణం ఆ నలుగురు : అల్లు శిరీష్
‘‘మనం చేసే తప్పుల్ని ఎత్తి చూపేవారు చాలా తక్కువమంది ఉంటారు. నిజానికి వారే మన శ్రేయోభిలాషులు. నా వరకు నా తమ్ముడు శిరీష్ అలాంటివాడే. నా సినిమాల్లో నేను చేసిన తప్పులు ఎంచి చెబుతూ... ఎప్పటికప్పుడు నన్ను నార్మల్ పర్సన్‌గా ఉంచుతాడు తను. ప్రపంచానికి నేను హీరోని కావచ్చు. వాడికి మాత్రం అన్నయ్యనే’’ అని అల్లు అర్జున్ అన్నారు. ఆయన తమ్ముడు అల్లు శిరీష్ హీరోగా, రెజీనా కథానాయికగా మారుతి దర్శకత్వంలో బన్నీ వాసు నిర్మించిన చిత్రం ‘కొత్త జంట’. అల్లు అరవింద్ ఈ చిత్రానికి సమర్పకుడు. జె.బి. స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. కె.రాఘవేంద్రరావు ఆడియో సీడీని ఆవిష్కరించి వి.వి.వినాయక్‌కి అందించారు. ఈ సందర్భంగా బన్నీ మరిన్ని విషయాలు చెబుతూ- ‘‘ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. అందులో సందేహం లేదు. ఎందుకంటే... ఈ సినిమా నేను చూశాను. శిరీష్, రెజీనాలకు మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది’’ అన్నారు. ‘‘నేను ఈ స్థాయికి రావడానికి కారణం మెగా కుటుంబం. నా గత చిత్రాలు లో బడ్జెట్లో తీశాను. కానీ ఈ సినిమాకు బాగా ఖర్చయింది. ‘కొత్త జంట’ టైటిల్‌కి శిరీష్, రెజీనా సరిగ్గా సరిపోయారు. ఎన్నో గొప్ప చిత్రాలను నిర్మించిన ‘గీతా ఆర్ట్స్’లో సినిమా చేయడం గర్వంగా ఉంది’’ అని మారుతి అన్నారు. శిరీష్ మాట్లాడుతూ- ‘‘బన్నీవాసు విన్నింగ్ సబ్జెక్ట్ ఎంచుకున్నాడు. తను నాకు మరో అన్నయ్య. కొన్నాళ్లుగా నాకు ఫ్రెండ్ అయిన మారుతీ... ఈ రోజు బ్రాండ్‌గా మారాడు. నాతో అద్భుతమైన సినిమా తీశాడు. నేనీ రోజు ఇక్కడ నిలబడటానికి కారణమైన తాతయ్య, నాన్న, చిరంజీవిగారు, పవన్‌కల్యాణ్‌గార్లకు థ్యాంక్స్. నాకు గురువు, మిత్రుడు అన్నయ్య బన్నీనే. నటునిగా తనే నాకు ప్రేరణ’’ అన్నారు. ఇంకా యూనిట్ సభ్యులతో పాటు దిల్ రాజు, బీవీఎస్ఎన్ ప్రసాద్, ఎన్వీ ప్రసాద్, జెమినీ కిరణ్, కేఎల్ నారాయణ, నల్లమలుపు బుజ్జి, డా.వెంకటేశ్వరరావు, సుకుమార్, సురేందర్‌రెడ్డి, గోపిచంద్ మలినేని, హరీశ్‌శంకర్, చంటి అడ్డాల, ఠాగూర్ మధు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
అల్లు శిరీష్, మారుతిల 'కొత్త జంట' ట్రైలర్
-
స్వార్థ ప్రేమికులు...
నిస్వార్థ ప్రేమికులను చాలామందిని చూసి ఉంటాం. కానీ స్వార్థ ప్రేమికులను చూడాలంటే మాత్రం ‘కొత్త జంట’ సినిమా చూడాల్సిందే అంటున్నారు దర్శకుడు మారుతి. ఇద్దరు స్వార్థపరులు ప్రేమలో పడితే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించారట. మారుతి తన పంథా మార్చి చేసిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. అల్లు శిరీష్, రెజీనా జంటగా నటించారు. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ మొత్తం పూర్తయింది. ఈ నెలాఖరున పాటలను, ఏప్రిల్ మూడోవారంలో చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘శిరీష్ శారీరక భాషకు సరిపోయే కథ ఇది. ‘ఖైదీ నెంబర్ 786’లోని సూపర్ హిట్ సాంగ్ ‘అటు అమలాపురం... ఇటు పెద్దాపురం’ పాటను రీమిక్స్ చేశాం. శిరీష్, మధురిమపై ఈ పాటను అద్భుతంగా చిత్రీకరించాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: జేబీ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎస్.కె.ఎన్. -
అటు అమలాపురం...ఇటు పెద్దాపురం
‘అటు అమలాపురం.. ఇటు పెద్దాపురం.. మధ్య గోదావరీ..’ ఈ పాట వినగానే.. ‘ఖైదీ నంబర్ 786’ సినిమా కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది. చిరంజీవి కథానాయకునిగా 1988లో విడుదలైన ఈ చిత్రం మ్యూజికల్‌గా ఓ సెన్సేషన్. సిల్క్‌స్మిత, కోట శ్రీనివాసరావులపై దర్శకుడు విజయబాపినీడు ఈ పాట తీశారు. ఆ రోజుల్లో మాస్‌ని విపరీతంగా ఆకట్టుకుందీ పాట. ప్రస్తుతం రీమిక్స్‌ల కాలం నడుస్తోంది. ప్రేక్షకాదరణ పొందిన పాత పాటల్ని రీమిక్స్ చేసేసి తేలిగ్గా సక్సెస్ కొట్టేస్తున్నారు దర్శక, నిర్మాతలు. ఈ పదిహేనేళ్లలో దాదాపు ఓ పాతిక పాత పాటలైనా రీమిక్స్ అయి వుంటాయి. ‘అటు అమలాపురం..’ పాట మాత్రం వారెవరికీ గుర్తు రాకపోవడం నిజంగా విచిత్రమే. ఆ అవకాశాన్ని మారుతి అందిపుచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన అల్లు శిరీష్ హీరోగా ‘కొత్తజంట’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకోసం ‘అటు అమలాపురం.. ఇటు పెద్దాపురం’ పాటను రీమిక్స్ చేయనున్నారు మారుతి. పాతికేళ్ల క్రితం సిల్క్‌స్మిత అదరహో అనిపించిన ఈ పాటలో ఇప్పుడు మధురిమ నర్తించబోతున్నారు. మధురిమకు ఈ పాట ఓ ఛాలెంజే అని చెప్పాలి. కృష్ణ ‘పండంటికాపురం’లోని ‘వెన్నెలైనా..చీకటైనా..’ పాటను చాలా అందంగా, అభినందనీయంగా రీమిక్స్ చేయించారు మారుతి. ‘ప్రేమకథా చిత్రమ్’ చిత్రానికి ఆ పాట నిజంగా ఓ ఆభరణమే. మరి ‘కొత్తజంట’లో ఆయన రీమిక్స్ చేయనున్న ఈ పాట మరి ఆ స్థాయి అభినందనల్ని అందుకుంటుందో లేదో, చూడాలి. రెజీనా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. -
ఒక్క డబుల్ మీనింగ్ డైలాగ్ లేకుండా సినిమా చేస్తున్నాను - మారుతి
‘‘నంబర్ప్లేట్లు వేసుకొనే ఓ కుర్రాడు... ఆఫీస్‌బాయ్‌గా ఉద్యోగం చేసిన ఓ కుర్రాడు ఈ రోజు సినిమా డెరైక్టర్. ఇదంతా నిజంగా మాయలా ఉంది. అంత చిన్న స్థాయి నుంచి దాదాపు వంద మంది ఉద్యోగులకు జీతాలిచ్చే స్థాయికి వచ్చానంటే... నిజంగా దైవకృపే’’ అని దర్శకుడు మారుతి అన్నారు. నేడు ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో పత్రికల వారితో ప్రత్యేకంగా ముచ్చటించారు. ప్రస్తుతం తాను డెరైక్ట్ చేస్తున్న ‘కొత్తజంట’ సినిమా గురించి చెబుతూ -‘‘ఇద్దరు స్వార్థపరులు ప్రేమించుకుంటే పర్యవసానం ఎలా ఉంటుంది అనేదే ‘కొత్తజంట’. ఇప్పటివరకూ నేను తీసిన సినిమాలకు సంబంధంలేని టాపిక్ ఇది. శిరీష్ తను టెన్త్ చదువుతున్నప్పట్నుంచీ నాకు తెలుసు. అతని ప్లస్‌లు, మైనస్‌లు అన్నీ తెలిసినవాణ్ణి. అందుకే అతనికి తగ్గ కథను ఎన్నుకున్నాను. అలాగే... ఒక్క డబుల్‌మీనింగ్ డైలాగ్ లేకుండా, కనీసం స్మోకింగ్ మెసేజ్ కూడా కనబడనంత క్లియర్‌గా ఈ చిత్రం తీస్తున్నాను. నిర్మాతతో అనవసరపు ఖర్చు పెట్టించడం విషయంలో నేను వ్యతిరేకిని. అయితే... గీతా ఆర్ట్స్ స్థాయికి తగ్గట్టుగా గ్రాండియర్‌గా ఈ సినిమా ఉంటుంది. ప్రేమకథల్లో ఓ కొత్త ట్రెండ్‌ని క్రియేట్ చేస్తుందీ సినిమా. సగానికి పైగా చిత్రీకరణ పూర్తయింది’’ అని తెలిపారు. ఇకపై కూడా దర్శకత్వ పర్యవేక్షణ చేస్తారా? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ -‘‘నిజానికి ‘ప్రేమకథాచిత్రమ్’ చిత్రానికి దర్శకుణ్ణి నేనే. ఆ సినిమాకు ‘దర్శకత్వ పర్యవేక్షణ’ అని టైటిల్ వేసుకోవడానికి బలమైన కారణం ఉంది. ‘కొత్తజంట’ సెట్‌కి వెళ్లడం ఆలస్యం అవుతుండటంతో ఈ మధ్య గ్యాప్‌లో ఓ చిన్న సినిమా చేసుకుంటానని అరవింద్‌గారిని అడిగాను. ‘ఆ సినిమా సరిగ్గా ఆడకపోతే... మళ్లీ నా సినిమాకు ఇబ్బంది కదా’ అనే అనుమానం వ్యక్తం చేశారు అరవింద్. దాంతో ‘ప్రేమకథాచిత్రమ్’ చిత్రానికి దర్శకునిగా టైటిల్ కార్డ్ వేసుకోడానికి భయపడ్డాను. కానీ ఆ సినిమా నా గత చిత్రాలన్నింటికంటే పెద్ద విజయం సాధించింది. ఇతర భాషల్లో కూడా సక్సెస్ సాధించింది. యూటీవీ, పద్మాలయా సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని బాలీవుడ్లో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాయి. అక్కడ కూడా దర్శకుణ్ణి నేనే’’ అని తెలిపారు. ప్రస్తుతం తన సొంత ప్రొడక్షన్ హౌస్‌లో లవ్యూ బంగారం, గ్రీన్‌సిగ్నల్, లవర్స్ చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయని, అలాగే... డీవీవీ దానయ్య, బన్నీ వాసు, బెల్లంకొండ సురేష్, గుడ్ సినిమా గ్రూప్, ‘జులాయి’ నిర్మాత రాధాకృష్ణ, దిల్‌రాజు చిత్రాలకు దర్శకత్వం వహించనున్నాననీ మారుతి చెప్పారు.