అటు అమలాపురం...ఇటు పెద్దాపురం | Chiranjeevi Song Remix in Allu Sirish's Kotha Janta movie | Sakshi
Sakshi News home page

అటు అమలాపురం...ఇటు పెద్దాపురం

Published Wed, Nov 20 2013 12:56 AM | Last Updated on Sat, Sep 2 2017 12:46 AM

Chiranjeevi Song Remix in Allu Sirish's Kotha Janta movie

‘అటు అమలాపురం.. ఇటు పెద్దాపురం.. మధ్య గోదావరీ..’ ఈ పాట వినగానే.. ‘ఖైదీ నంబర్ 786’ సినిమా కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది. చిరంజీవి కథానాయకునిగా 1988లో విడుదలైన ఈ చిత్రం మ్యూజికల్‌గా ఓ సెన్సేషన్. సిల్క్‌స్మిత, కోట శ్రీనివాసరావులపై దర్శకుడు విజయబాపినీడు ఈ పాట తీశారు. ఆ రోజుల్లో మాస్‌ని విపరీతంగా ఆకట్టుకుందీ పాట. ప్రస్తుతం రీమిక్స్‌ల కాలం నడుస్తోంది. ప్రేక్షకాదరణ పొందిన పాత పాటల్ని రీమిక్స్ చేసేసి తేలిగ్గా సక్సెస్ కొట్టేస్తున్నారు దర్శక, నిర్మాతలు. ఈ పదిహేనేళ్లలో దాదాపు ఓ పాతిక పాత పాటలైనా రీమిక్స్ అయి వుంటాయి. ‘అటు అమలాపురం..’ పాట మాత్రం వారెవరికీ గుర్తు రాకపోవడం నిజంగా విచిత్రమే. ఆ అవకాశాన్ని మారుతి అందిపుచ్చుకున్నారు.
 
 ప్రస్తుతం ఆయన అల్లు శిరీష్ హీరోగా ‘కొత్తజంట’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకోసం ‘అటు అమలాపురం.. ఇటు పెద్దాపురం’ పాటను రీమిక్స్ చేయనున్నారు మారుతి. పాతికేళ్ల క్రితం సిల్క్‌స్మిత అదరహో అనిపించిన ఈ పాటలో ఇప్పుడు మధురిమ నర్తించబోతున్నారు. మధురిమకు ఈ పాట ఓ ఛాలెంజే అని చెప్పాలి. కృష్ణ ‘పండంటికాపురం’లోని ‘వెన్నెలైనా..చీకటైనా..’ పాటను చాలా అందంగా, అభినందనీయంగా రీమిక్స్ చేయించారు మారుతి. ‘ప్రేమకథా చిత్రమ్’ చిత్రానికి ఆ పాట నిజంగా ఓ ఆభరణమే. మరి ‘కొత్తజంట’లో ఆయన రీమిక్స్ చేయనున్న ఈ పాట మరి ఆ స్థాయి అభినందనల్ని అందుకుంటుందో లేదో, చూడాలి. రెజీనా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement