నేను ఈ స్థాయికి రావడానికి కారణం ఆ నలుగురు : అల్లు శిరీష్
‘‘మనం చేసే తప్పుల్ని ఎత్తి చూపేవారు చాలా తక్కువమంది ఉంటారు. నిజానికి వారే మన శ్రేయోభిలాషులు. నా వరకు నా తమ్ముడు శిరీష్ అలాంటివాడే. నా సినిమాల్లో నేను చేసిన తప్పులు ఎంచి చెబుతూ... ఎప్పటికప్పుడు నన్ను నార్మల్ పర్సన్‌గా ఉంచుతాడు తను. ప్రపంచానికి నేను హీరోని కావచ్చు. వాడికి మాత్రం అన్నయ్యనే’’ అని అల్లు అర్జున్ అన్నారు. ఆయన తమ్ముడు అల్లు శిరీష్ హీరోగా, రెజీనా కథానాయికగా మారుతి దర్శకత్వంలో బన్నీ వాసు నిర్మించిన చిత్రం ‘కొత్త జంట’. అల్లు అరవింద్ ఈ చిత్రానికి సమర్పకుడు. జె.బి. స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు.
కె.రాఘవేంద్రరావు ఆడియో సీడీని ఆవిష్కరించి వి.వి.వినాయక్‌కి అందించారు. ఈ సందర్భంగా బన్నీ మరిన్ని విషయాలు చెబుతూ- ‘‘ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. అందులో సందేహం లేదు. ఎందుకంటే... ఈ సినిమా నేను చూశాను. శిరీష్, రెజీనాలకు మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది’’ అన్నారు. ‘‘నేను ఈ స్థాయికి రావడానికి కారణం మెగా కుటుంబం. నా గత చిత్రాలు లో బడ్జెట్‌లో తీశాను. కానీ ఈ సినిమాకు బాగా ఖర్చయింది. ‘కొత్త జంట’ టైటిల్‌కి శిరీష్, రెజీనా సరిగ్గా సరిపోయారు. ఎన్నో గొప్ప చిత్రాలను నిర్మించిన ‘గీతా ఆర్ట్స్’లో సినిమా చేయడం గర్వంగా ఉంది’’ అని మారుతి అన్నారు. శిరీష్ మాట్లాడుతూ- ‘‘బన్నీవాసు విన్నింగ్ సబ్జెక్ట్ ఎంచుకున్నాడు.
తను నాకు మరో అన్నయ్య. కొన్నాళ్లుగా నాకు ఫ్రెండ్ అయిన మారుతీ... ఈ రోజు బ్రాండ్‌గా మారాడు. నాతో అద్భుతమైన సినిమా తీశాడు. నేనీ రోజు ఇక్కడ నిలబడటానికి కారణమైన తాతయ్య, నాన్న, చిరంజీవిగారు, పవన్‌కల్యాణ్‌గార్లకు థ్యాంక్స్. నాకు గురువు, మిత్రుడు అన్నయ్య బన్నీనే. నటునిగా తనే నాకు ప్రేరణ’’ అన్నారు. ఇంకా యూనిట్ సభ్యులతో పాటు దిల్ రాజు, బీవీఎస్‌ఎన్ ప్రసాద్, ఎన్వీ ప్రసాద్, జెమినీ కిరణ్, కేఎల్ నారాయణ, నల్లమలుపు బుజ్జి, డా.వెంకటేశ్వరరావు, సుకుమార్, సురేందర్‌రెడ్డి, గోపిచంద్ మలినేని, హరీశ్‌శంకర్, చంటి అడ్డాల, ఠాగూర్ మధు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.