ఒక్క డబుల్ మీనింగ్ డైలాగ్ లేకుండా సినిమా చేస్తున్నాను - మారుతి
‘‘నంబర్‌ప్లేట్‌లు వేసుకొనే ఓ కుర్రాడు... ఆఫీస్‌బాయ్‌గా ఉద్యోగం చేసిన ఓ కుర్రాడు ఈ రోజు సినిమా డెరైక్టర్. ఇదంతా నిజంగా మాయలా ఉంది. అంత చిన్న స్థాయి నుంచి దాదాపు వంద మంది ఉద్యోగులకు జీతాలిచ్చే స్థాయికి వచ్చానంటే... నిజంగా దైవకృపే’’ అని దర్శకుడు మారుతి అన్నారు. నేడు ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో పత్రికల వారితో ప్రత్యేకంగా ముచ్చటించారు.
ప్రస్తుతం తాను డెరైక్ట్ చేస్తున్న ‘కొత్తజంట’ సినిమా గురించి చెబుతూ -‘‘ఇద్దరు స్వార్థపరులు ప్రేమించుకుంటే పర్యవసానం ఎలా ఉంటుంది అనేదే ‘కొత్తజంట’. ఇప్పటివరకూ నేను తీసిన సినిమాలకు సంబంధంలేని టాపిక్ ఇది. శిరీష్ తను టెన్త్ చదువుతున్నప్పట్నుంచీ నాకు తెలుసు. అతని ప్లస్‌లు, మైనస్‌లు అన్నీ తెలిసినవాణ్ణి. అందుకే అతనికి తగ్గ కథను ఎన్నుకున్నాను. అలాగే... ఒక్క డబుల్‌మీనింగ్ డైలాగ్ లేకుండా, కనీసం స్మోకింగ్ మెసేజ్ కూడా కనబడనంత క్లియర్‌గా ఈ చిత్రం తీస్తున్నాను. నిర్మాతతో అనవసరపు ఖర్చు పెట్టించడం విషయంలో నేను వ్యతిరేకిని.
అయితే... గీతా ఆర్ట్స్ స్థాయికి తగ్గట్టుగా గ్రాండియర్‌గా ఈ సినిమా ఉంటుంది. ప్రేమకథల్లో ఓ కొత్త ట్రెండ్‌ని క్రియేట్ చేస్తుందీ సినిమా. సగానికి పైగా చిత్రీకరణ పూర్తయింది’’ అని తెలిపారు. ఇకపై కూడా దర్శకత్వ పర్యవేక్షణ చేస్తారా? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ -‘‘నిజానికి ‘ప్రేమకథాచిత్రమ్’ చిత్రానికి దర్శకుణ్ణి నేనే. ఆ సినిమాకు ‘దర్శకత్వ పర్యవేక్షణ’ అని టైటిల్ వేసుకోవడానికి బలమైన కారణం ఉంది. ‘కొత్తజంట’ సెట్‌కి వెళ్లడం ఆలస్యం అవుతుండటంతో ఈ మధ్య గ్యాప్‌లో ఓ చిన్న సినిమా చేసుకుంటానని అరవింద్‌గారిని అడిగాను. ‘ఆ సినిమా సరిగ్గా ఆడకపోతే... మళ్లీ నా సినిమాకు ఇబ్బంది కదా’ అనే అనుమానం వ్యక్తం చేశారు అరవింద్.
దాంతో ‘ప్రేమకథాచిత్రమ్’ చిత్రానికి దర్శకునిగా టైటిల్ కార్డ్ వేసుకోడానికి భయపడ్డాను. కానీ ఆ సినిమా నా గత చిత్రాలన్నింటికంటే పెద్ద విజయం సాధించింది. ఇతర భాషల్లో కూడా సక్సెస్ సాధించింది. యూటీవీ, పద్మాలయా సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాయి. అక్కడ కూడా దర్శకుణ్ణి నేనే’’ అని తెలిపారు. ప్రస్తుతం తన సొంత ప్రొడక్షన్ హౌస్‌లో లవ్యూ బంగారం, గ్రీన్‌సిగ్నల్, లవర్స్ చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయని, అలాగే... డీవీవీ దానయ్య, బన్నీ వాసు, బెల్లంకొండ సురేష్, గుడ్ సినిమా గ్రూప్, ‘జులాయి’ నిర్మాత రాధాకృష్ణ, దిల్‌రాజు చిత్రాలకు దర్శకత్వం వహించనున్నాననీ మారుతి చెప్పారు.