కమర్షియల్ హీరోగా...శుభమస్తు అని దీవించారు!
‘‘గంగోత్రి’కీ, ‘ఆర్య’కీ మధ్య బన్నీ (అల్లు అర్జున్) ఎంత వేరియేషన్ చూపించాడో... తన తొలి రెండు చిత్రాలకీ, ‘శ్రీరస్తు శుభమస్తు’కీ మధ్య అంతటి వేరియేషన్ శిరీష్ చూపించాడు. అన్న బన్నీలాగే శిరీష్ కూడా మంచి కథానాయకుడిగా ఎదుగుతాడు’’ అని నిర్మాత రాక్‌లైన్ వెంకటేశ్ అన్నారు. అల్లు శిరీష్ హీరోగా గీతా ఆర్ట్స్ పతాకంపై పరశురామ్ దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మించిన ‘శ్రీరస్తు శుభమస్తు’ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం కర్ణాటకలోనూ మంచి వసూళ్లు రాబడుతోందని చిత్రబృందం పేర్కొంది. అందుకే బెంగళూరులో సక్సెస్‌మీట్ నిర్వహించారు. ఈ వేడుకలో పలువురు కన్నడ చిత్రరంగ ప్రముఖులు, అభిమానులు పాల్గొన్నారు. నటుడు-దర్శకుడు రమేశ్ అరవింద్ చిత్రబృందానికి శుభాకాంక్షలు అందజేశారు. శిరీష్ మాట్లాడుతూ - ‘‘అన్నయ్యని కర్ణాటక ప్రేక్షకులు లోకల్ హీరోగానే చూస్తుంటారు. నేనూ అలాగే దగ్గరవ్వాలనుకుంటున్నా’’ అన్నారు. ఇంకా చిత్రబృందం మాటల్లో పలు విశేషాలు...
♦ గీతా ఆర్ట్స్‌లాంటి సొంత నిర్మాణ సంస్థ అందుబాటులో ఉన్నప్పటికీ సినీ పరిశ్రమలో తాను చేయాలనుకొన్న ప్రయాణమే వేరని చాటుతూ ‘గౌరవం’గా కెరీర్‌ని ఆరంభించాడు శిరీష్. కొత్త రకమైన కథలపై శిరీష్ ఆసక్తి చూపుతున్నాడనే విషయం ఆ చిత్రంతోనే రుజువైంది. ఆ తర్వాత ‘కొత్తజంట’తో ప్రేక్షకులకు చేరువయ్యాడు. ప్రస్తుతం కథా బలమున్న చిత్రం ‘శ్రీరస్తు శుభమస్తు’తో సందడి చేస్తున్నాడు. తనలో ఎంత మంచి నటుడున్నాడో ఈ చిత్రంతో నిరూపించాడు అల్లు శిరీష్. లుక్ వైజ్‌గానే కాకుండా, అన్ని రకాల భావోద్వేగాల్ని చక్కగా పలి కించి విమర్శకుల్ని సైతం ఆశ్చర్యపరిచాడు. శిరీష్ ప్రయత్నించకపోయినా ప్రేక్షకులు మాత్రం కమర్షియల్ హీరోగా శుభమస్తు అని దీవిస్తున్నారు. సినిమాకి లభిస్తున్న వసూళ్లే అందుకు సాక్ష్యం. ‘కొత్త జంట’ చిత్రానికి ఫుల్ రన్‌లో వచ్చిన షేర్‌ను ‘శ్రీరస్తు శుభమస్తు’ మొదటి వారంలోనే దాటేసింది.
అటు క్లాస్‌నీ.. ఇటు మాస్‌నీ.. : ఇప్పుడిప్పుడే తొలి అడుగులేస్తున్న కథానాయకుడు శిరీష్. కానీ ఆయన ‘శ్రీరస్తు శుభమస్తు’తో సాధించిన వసూళ్లు మాత్రం సీనియర్ హీరోల స్టామినాకి తగ్గట్టుగా ఉన్నాయి. దీన్నిబట్టి ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి లభిస్తున్న ఆదరణ ఎలాంటిదో అర్థమవుతోంది. ఈ ఆదరణకి సినిమాలోని కంటెంటే ప్రధాన కారణమని చెప్పొచ్చు. పరశురామ్ తీర్చిదిద్దిన ఈ సినిమాలో కంటెంట్ గురించి తెలుసుకొని క్లాసూ, మాసూ అనే తేడా లేకుండా ప్రేక్షకులు థియేటర్లవైపు కదులుతున్నారు.
శిరీష్ మరో స్థాయికి: తొలి రెండు సినిమాల్లో శిరీష్‌ని చూసినవాళ్లు ‘కుర్రాడు ఇంకా రాటుదేలాలి’ అన్నా రు. ‘శ్రీరస్తు శుభమస్తు’తో ఓ కథానాయకుడు నటనలో రాటుదేలడమంటే ఏంటో నిరూపించా డు శిరీష్. ఒకపక్క కామెడీ చేశాడు, మరోపక్క భావోద్వేగాల్ని పండించాడు. ఇంకో పక్క రొమాంటిక్ హీరో అనిపించుకొనే ప్రయత్నం కూడా చేశాడు. సినిమాని చూసినవాళ్లంతా శిరీష్‌లో ఇన్ని యాంగిల్స్ ఉన్నాయా అని ఆశ్చర్యపోతున్నారు. నిస్సందేహంగా ‘శ్రీరస్తు శుభమస్తు’ శిరీష్‌ని ఓ మెట్టు పైకి ఎక్కించి మరో స్థాయికి తీసుకెళ్లిన చిత్రమవుతుంది.
అన్న అడుగు జాడల్లో: అల్లు అర్జున్ ఓ మాస్ కథానాయకుడు. ఆయన సినిమా విడుదలవుతోందంటే ఆంధ్ర, తెలంగాణే కాదు... కర్ణాటక, కేరళతోపాటు ఓవర్సీస్‌లోనూ పెద్ద ఎత్తున హంగామా కనిపిస్తుంటుంది. ఇప్పుడు ఆయన అడుగుజాడల్లోనే నడవాలనుకొంటున్నా డు శిరీష్. అంటే బన్నీలా శిరీష్ కూడా మాస్ కథలు చేయబో తున్నాడని కాదు. అన్నయ్యలాగే అన్ని ప్రాంతాల్లోని ప్రేక్షకుల్ని అలరించాలని అనుకుంటున్నాడు.