'బట్టలంటే నాకు ఎలర్జీ'
అహ్మదాబాద్: సల్మాన్ చొక్కా విప్పాడంటే చాలు.. థియేటర్లలో అభిమానులు ఆనందంతో విజిల్స్ వేస్తుంటారు. 50 ఏళ్లకు దగ్గర పడుతున్నప్పటికీ సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించే ఈ బాలీవుడ్ బ్రహ్మచారిపై మహిళా ప్రేక్షకులు ఇప్పటికీ మనసు పారేసుకుంటున్నారు. అభిమానులు ముద్దుగా సల్లూబాయ్గా పిలుచుకునే స్టార్ హీరో.. తెరపై ఎక్కువగా షర్ట్ విప్పడం వెనక అసలు కథను ఎట్టకేలకు చెప్పేశాడు. ఐఐటీ అహ్మదాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సల్మాన్ కొన్ని విషయాలను వెల్లడించాడు. తనకు బట్టలు వేసుకోవడమంటే కాస్త ఎలర్జీగా ఉంటుందన్నాడు. బట్టలు వేసుకుంటే తనకు ఏదోలా ఉంటుందని, అవి అంతగా సౌకర్యంగా ఉండవని చెప్పాడు. అసలు తాను దుస్తులు వేసుకుంటుంటేనే ఏదో అయిపోతుందన్నాడు.
ఫ్యాషన్ డిజైనర్స్ రూపొందించిన ఖాదీ దుస్తులను ధరించి స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హాతో కలిసి ర్యాంప్ వాక్ చేసిన తర్వాత ఈ వివరాలను సల్మాన్ మీడియాతో పంచుకున్నాడు. ''కావాలంటే ఎవరైనా మా ఇంటికి వచ్చి చూడండి. నాతో పాటు మా నాన్న సలీంఖాన్ కూడా తక్కువగా బట్టలు వేసుకుంటారు. ఎక్కువగా ప్యాంట్, బనియన్ మాత్రమే వేసుకుంటాం. అప్పుడప్పుడు షర్ట్ ధరిస్తా'' అని చెప్పుకొచ్చాడు. కాలేజీ రోజుల్లో ఖాదీ బట్టలు వేసుకుని పూర్తిగా బటన్స్ పెట్టుకోవాలంటే చాలా కష్టంగా ఉండేదని, ప్రస్తుతం చాలా మంచి డిజైన్స్ వస్తున్నాయని చెప్పాడు. ఖాదీ భారత్లో మొదటగా తయారైనందుకు మనం గర్వపడాలని సల్మాన్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు.