
‘మనం’లో అతిథిగా అమితాబ్
ఇది స్పెషల్ న్యూస్... తెలుగు తెరకు సమ్‌థింగ్ స్పెషల్ న్యూస్. ఇండియన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తొలిసారిగా ఓ తెలుగు సినిమాలో నటించారు. అది కూడా ‘మనం’ సినిమా కావడం విశేషం. మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు చివరాఖరి సినిమా ఇది. ఏయన్నార్ తన తనయుడు నాగార్జున, మనవడు నాగచైతన్యతో కలిసి నటించిన ఏకైక చిత్రం ‘మనం’పై ప్రేక్షకుల్లో చాలా అంచనాలు ఉన్నాయి. దానికి తోడు అమితాబ్ కూడా అతిథి పాత్ర చేశారన్న వార్త తెలియడంతో ఆ అంచనాలు రెట్టింపు అవుతాయన్నది ఏ మాత్రం అతిశయోక్తి కాదు. ‘మనం’లో అమితాబ్ నటించిన విషయాన్ని యూనిట్ వర్గాలు రహస్యంగా ఉంచాయి కానీ, అమితాబ్ తన బ్లాగ్ ద్వారా అధికారికంగా ప్రకటించేశారు.
‘‘లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావుగారి తనయుడు, నా ఆప్తమిత్రుడు నాగార్జున తన తండ్రితో కలిసి నటించిన సినిమాలో నేను అతిథి పాత్ర చేశాను’’ అని అమితాబ్ తన బ్లాగ్‌లో వెల్లడించారు. అమితాబ్‌తో నాగార్జునకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. వీరిద్దరూ కలిసి ఆ మధ్య ఓ వాణిజ్య ప్రకటనలో నటించారు. ఇటీవలకాలంలో అమితాబ్ తన సినిమాల ప్రమోషన్ నిమిత్తం తరచుగా హైదరాబాద్ వస్తున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తాను నటించిన ‘బుడ్డా హోగా తేరా బాప్’ ప్రచారం నిమిత్తం హైదరాబాద్ వచ్చినప్పుడు తెలుగు సినిమాలపై తనకున్న మక్కువను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘‘తెలుగు సినిమాలు చాలా బాగుంటాయి. భవిష్యత్తులో ఎప్పుడైనా అవకాశం వస్తే తప్పకుండా ఓ తెలుగు సినిమాలో నటిస్తా’’ అని చెప్పారు. ఎట్టకేలకు అమితాబ్ కోరిక ‘మనం’తో నెరవేరింది. ముంబయ్‌లోని ఫిల్మిస్తాన్ స్టూడియోలో ఆయన వెర్షన్‌ని చిత్రీకరించారు.