నీ ధైర్యం అపూర్వం: అమితాబ్
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్.. నటుడు ఇమ్రాన్ హష్మిని పొగడ్తలతో ముంచెత్తారు. చాలా ధైర్యం గల తండ్రివి అంటూ కితాబునిచ్చారు. ఇమ్రాన్ ఆరేళ్ల కుమారుడు అయాన్ కేన్సర్తో పోరాడిన విషయం తెలిసిందే. 2014లో అయాన్ కిడ్నీ కేన్సర్ వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారు. వెంటనే బాలుడిని కెనడా తీసుకెళ్లి చికిత్స అందించారు. ఎంతో బాధాకరమైన ఆ చికిత్సను అయాన్ విజయవంతంగా ఎదుర్కొన్నాడు.
చాలా ధైర్యం కలిగిన తండ్రిగా ఉన్నందుకు ధన్యవాదాలు, ఒక్కటే చెప్పగలం.. అయాన్ మనోధైర్యం సాటిలేనిదని పేర్కొంటూ బిగ్ బీ ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్కు స్పందిస్తూ ఇమ్రాన్ అమితాబ్ను 'ఒరిజినల్ సూపర్ హీరో' అని కొనియాడారు. అయాన్ బ్యాట్ మ్యాన్ కావాలని కోరుకుంటాడు, కానీ బ్యాట్ మ్యాన్ మీలా కావాలని కోరుకుంటాడు.. మీరే అసలైన సూపర్ హీరో అంటూ ఇమ్రాన్ ట్వీట్ చేశాడు.
కాగా తన కొడుకు జీవితం, కిడ్నీ కేన్సర్‌పై పోరాటం, తల్లిదండ్రులు అనుభవించిన మానసిక వేదన తదితర అంశాలతో హష్మీ, బిలాల్ సిద్దిఖీ రాసిన 'కిస్ ఆఫ్ లైఫ్' పుస్తకాన్ని ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో సీఎం కేజ్రీవాల్ ఆవిష్కరించిన విషయం తెలిసిందే.