అంతా ఆ దేవుడి లీల!
‘‘సౌందర్య చిన్నప్పుడు ‘అమర్‌చిత్ర కథ’ పుస్తకాలు బాగా చదివేది. అలాంటి సినిమాలు తీస్తానని చెబుతుండేది. ఇప్పుడు అద్భుత సాంకేతిక పరిజ్ఞానంతో ‘కొచ్చడయాన్’ రూపొందించింది. అందరూ తనను అభినందిస్తుంటే ఓ తండ్రిగా ఎంతో ఆనందంగా, గర్వంగా ఉంది’’ అన్నారు రజనీకాంత్. తన కుమార్తె సౌందర్య దర్శకత్వంలో ఆయన నటించిన ‘కొచ్చడయాన్’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం హిందీ వెర్షన్ ప్రచార చిత్రాలను ముంబయ్‌లో అమితాబ్ బచ్చన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా అమితాబ్ మాట్లాడుతూ -‘‘రజనీకాంత్, నేనూ మంచి స్నేహితులం. ఎప్పుడు కలిసినా సినిమాల గురించి, జీవితం గురించి మాట్లాడుకుంటాం.
భారతీయ సినిమా చరిత్రను ఎవరైనా రాస్తే... ‘కొచ్చడయాన్’కి ముందు ‘కొచ్చడయాన్’కి తర్వాత అని రాస్తారు’’ అని చెప్పారు. రజనీకాంత్ మాట్లాడుతూ -‘‘ ‘రోబో’ సమయంలో ముంబై వచ్చాను. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఇప్పుడీ వేడుకలో పాల్గొన్నాను. ‘కొచ్చడయాన్’ సాంకేతికంగా చాలా ఉన్నతంగా ఉంటుంది. టెక్నాలజీ గురించి నాకస్సలు అవగాహన లేదు. కానీ, ఇలాంటి సినిమాల్లో నటిస్తున్నానంటే, అంతా ఆ దేవుడి లీల. ఇలాంటి సినిమాలు ఓ సవాల్ . ఈ సవాల్ నాకు మంచి అనుభూతిని మిగిల్చింది’’ అని చెప్పారు. హలీవుడ్ చిత్రం ‘అవతార్’ స్థాయిలో ఫొటో రియలిస్టిక్ పెర్ఫార్మెన్స్ క్యాప్చర్ టెక్నాలజీతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ టెక్నాలజీతో రూపొందిన తొలి భారతీయ సినిమా ఇదే కావడం విశేషం. తెలుగులో ఈ చిత్రం ‘విక్రమసింహ’ పేరుతో విడుదల కానుంది.