శాండిల్‌వుడ్‌లో సూపర్‌ ఆఫర్‌ | Amy Jackson to star in Shivarajkumar-Sudeep movie | Sakshi
Sakshi News home page

శాండిల్‌వుడ్‌లో సూపర్‌ ఆఫర్‌

Published Thu, May 18 2017 2:59 AM | Last Updated on Tue, Sep 5 2017 11:22 AM

శాండిల్‌వుడ్‌లో సూపర్‌ ఆఫర్‌

శాండిల్‌వుడ్‌లో సూపర్‌ ఆఫర్‌

నటి ఎమీజాక్సన్‌కు శాండిల్‌వుడ్‌ నుంచి  కాలింగ్‌ వచ్చింది.  అదీ సూపర్‌ ఆఫర్‌తో, ఎమీ కోలీవుడ్‌కు వచ్చే ముందు నక్కను తొక్కొచ్చి ఉంటుంది. వరుసగా లక్కీ ఆఫర్లు తలుపు తడుతున్నాయి. మదరాసుపట్టణంతో కోలీవుడ్‌ గడప తొక్కిన ఈ ఇంగ్లీష్‌ భామకు ఆ తరువాత పెద్దగా సక్సెస్‌లు లేకపోయినా స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ నుంచి ఐ చిత్రంలో నటించే భారీ అవకాశం తలుపు తట్టింది. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని అందించకపోయినా బాలీవుడ్‌కు ఎగుమతి అయ్యింది.

అక్కడా విజయాన్ని అందుకోలేకపోయినా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో రొమాన్స్‌ చేసే అనూహ్య అవకాశాన్ని మళ్లీ దర్శకుడు శంకర్‌నే కల్పించారు. దీన్ని లక్కు అనక మరేమంటారు. మధ్యలో టాలీవుడ్‌లోనూ ఎవడు అనే చిత్రంతో అడుగు పెట్టేసింది. ప్రస్తుతం రజనీకాంత్‌కు జంటగా నటించిన 2.ఓ చిత్రం విజయం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న ఎమీజాక్సన్‌ పనిలో పనిగా చెన్నైలో ఇక అందమైన ఇల్లు కొనేసుకుంది.

 ఇలా స్థిరాస్తులు కూడగట్టుకుంటున్న ఈ బ్యూటీ తదుపరి చిత్రం ఏంటని ఆలోచించుకునేలోపే శాండిల్‌వుడ్‌ నుంచి ఒక సూపర్‌ ఆఫర్‌ వచ్చేసింది. అక్కడ సూపర్‌స్టార్స్‌గా రాణిస్తున్న శివరాజ్‌కుమార్, కిచ్చా సుధీప్‌లతో కలిసి నటించే మల్టీస్టారర్‌ చిత్రంలో నటించే అవకాశం ఎమీ ముంగిట వాలింది. అంతే సంతోషంతో ఎగిరి గంతేసి ఒప్పేసుకుందట. దీనికి ది విలన్‌ అనే టైటిల్‌ నిర్ణయించారు. ఈ చిత్రానికి ప్రేమ్‌ దర్శకత్వం వహించనున్నారు. ఈ క్రేజీ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement