పిల్లలకూ.. పెద్దలకూ...
యుక్త వయసులోకి అడుగుపెట్టిన పిల్లలతో చర్చించాల్సిన విషయాలను విస్మరించడం వల్ల జరిగే విపత్కర పరిణామాల నేపథ్యంలో ఓఎంజీ (ఆఫ్ బీట్ మీడియా గైడ్) బేనర్ ఓ చిత్రం నిర్మిస్తోంది. శ్రీకాంత్ వెలగలేటి దర్శకత్వంలో ఆనంద్ చవాన్ నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు దృశ్యానికి ప్రసాద్ ల్యాబ్స్ అధినేత రమేశ్ ప్రసాద్ కెమెరా స్విచ్ఛాన్ చేయగా, తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పుస్కూరు రామ్మోహనరావు క్లాప్‌నిచ్చారు.
నిఖిల్ దేవాదుల, అష్‌నూర్ కౌర్, అనుష్కా సేన్, చేతన్ జయలాల్, ప్రగత్ కీలక పాత్రధారులు. ‘‘హిందీ హీరో, జెనీలియా భర్త రితేశ్ దేశ్‌ముఖ్ మరాఠీలో నిర్మించిన ‘బాలక్ పాలక్’కి ఇది రీమేక్. ఈ నెల 7న రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం’’ అని నిర్మాత అన్నారు. ‘‘పెద్దలకు, పిల్లలకు ఉపయోగకరంగా ఉండే అంశాలతో ఈ చిత్రం చేస్తున్నాం’’ అని దర్శకుడు తెలిపారు. నరేశ్, తేజస్వి మదివాడ, ఈటీవీ ప్రభాకర్, వినోద్ బాల, నళిని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: చీనార్ మహేశ్, విశాల్–శేఖర్, కెమేరా: అంజి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: డా. ఆకునూరు గౌతమ్, లైన్ ప్రొడ్యూసర్: శ్రీనివాస్ రెడ్డి న్యాలకొండ.