అనిరుధ్ ఔట్... మిక్కీ జె. మేయర్ ఇన్! | Anirudh Ravichander out of A..Aa | Sakshi
Sakshi News home page

అనిరుధ్ ఔట్... మిక్కీ జె. మేయర్ ఇన్!

Published Fri, Jan 22 2016 11:17 PM | Last Updated on Sun, Sep 3 2017 4:07 PM

అనిరుధ్ ఔట్... మిక్కీ జె. మేయర్ ఇన్!

అనిరుధ్ ఔట్... మిక్కీ జె. మేయర్ ఇన్!

‘వై దిస్ కొలవెరి డీ’ (ఎందుకింత పగ అని స్థూలంగా అర్థం) పాటతో సంచలనం రేపిన సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్. మొన్నటి దాకా క్రేజీ యువ దర్శకుడిగా పేరున్న పాతికేళ్ళ అనిరుధ్‌కు ఇటీవల మాత్రం టైమ్ బాగున్నట్లు లేదు. తమిళనాట ‘బీప్ సాంగ్’తో ఇటీవల వివాదానికి కేంద్రమయ్యారు. అమ్మాయిల్ని ఆడిపోసుకునే మాటలను ‘బీప్ సౌండ్’ ద్వారా చెప్పకుండానే చెబుతూ, హీరో శింబు పాడిన పాట ఇంటర్నెట్‌లో లీకై, మొన్న డిసెం బర్‌లో కథ కేసులు, కోర్టుల దాకా వెళ్ళింది. శింబు పాడిన ఆ ‘‘ప్రైవేట్’’ బీప్‌సాంగ్ అనిరుధ్ రూపొందించినదే అని కథనం. తాజాగా ఆయన మళ్ళీ వార్తల్లోకి ఎక్కారు.

త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంత జంటగా రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘అ...ఆ (అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి)’ చిత్రం నుంచి సంగీత దర్శకుడిగా అనిరుధ్‌ను పక్కకు తప్పించారు. ఒక పక్క ‘బీప్‌సాంగ్’ వివాదం, మరో పక్క ఇప్పటికే ఒప్పుకొన్న స్టేజ్ షోలు, చేతిలో ఉన్న తమిళ ప్రాజెక్ట్స్‌తో అనిరుధ్ ‘అ...ఆ...’ చిత్రంపై ఇప్పటి వరకు దృష్టి పెట్టనేలేదని చెన్నై సమాచారం. సమ్మర్ రిలీజ్ ప్లాన్‌తో, హైదరాబాద్ పరిసరాల్లో శరవేగంతో షూటింగ్ జరుపుకొంటున్న ‘అ..ఆ’ చిత్ర యూనిట్‌కు ఇది పెద్ద తలనొప్పిగా మారింది.

ఇప్పటి దాకా సహనంతో భరించిన యూనిట్ ఇక లాభం లేదని ప్రత్యామ్నాయం ఆలోచించింది. ఫలితంగా అనిరుధ్ స్థానంలో మిక్కీ జె. మేయర్‌కు మ్యూజిక్ డెరైక్షన్ చాన్స్ దక్కింది. ‘హ్యాపీ డేస్’ మొదలు పలు హిట్ చిత్రాలకు బాణీలు కూర్చిన మిక్కీ తాజాగా మహేశ్‌బాబు ‘బ్రహ్మో త్సవం’కి సంగీతమిస్తున్నారు. ఇప్పుడిలా అనుకోకుండా త్రివిక్రమ్ లాంటి దర్శకుడి చిత్రానికి స్వరాలు కూర్చే అవకాశం మిక్కీకి దక్కింది.
 
తెలుగు సినిమాలపై... ‘వై దిస్ కొలవెరి డీ’! సహజంగానే ఈ వార్త సినీవర్గాల్లో సంచలన మైంది. రజనీకాంత్‌కు బంధువూ, ధనుష్, ఆయన భార్య ఐశ్వర్యా ధనుష్‌ల ఆశీస్సులు పుష్కలంగా అనిరుధ్ గతంలోనూ తెలుగు సినిమాల విషయంలో ఇలానే వ్యవహరించారని కృష్ణానగర్ వర్గాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. రామ్‌చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శక త్వంలో వచ్చిన ‘బ్రూస్‌లీ’కి మొదట అనిరుధ్‌నే తీసు కున్నారు. ఆ సినిమాతో తెలుగులో స్వరంగేట్రం చేయాల్సిన మనవాడు తీరా, అజిత్ హీరోగా తమిళ ‘వేదాళమ్’ ఆఫర్ రావడంతో ‘బ్రూస్ లీ’ని అర్ధంతరంగా వదిలేశాడు. దర్శక - నిర్మాతలకు చుక్కలు చూపించాడు. ఫలితంగా, ‘బ్రూస్‌లీ’ బృందం తమన్‌ను ఆశ్రయించాల్సి వచ్చింది.

ఇప్పుడు మళ్ళీ ‘అ...ఆ’కు అలాంటి పరిస్థితే వచ్చింది. చిత్రమేమి టంటే, ‘అ..ఆ’ యూనిట్ మొదట ఎంచుకొన్న ఆర్ట్ డెరైక్టర్ రాజీవన్ కానీ, ఇప్పుడు అనిరుధ్ కానీ ఇద్దరూ ప్రొఫెషనలిజమ్‌ను విస్మరించి, తమ విధులు సరిగ్గా నిర్వర్తించకపోవడం, సరైన టైమ్‌లో స్పందించక పోవడం! ఫలితంగా ఇద్దరినీ ‘అ...ఆ’ నుంచి పక్కకు తప్పించాల్సి వచ్చింది. వాళ్ళ అన్‌ప్రొఫెషనలిజమ్ వాళ్ళపై ఏ మేరకు ప్రభావం చూపిందో కానీ, ఇక్కడి దర్శకనిర్మాతలకు డబ్బు, కాలం వృథా కదా!

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement