Beep song
-
పెరియార్‌కుత్తుకు చిందేసిన శింబు
సంచలనం, కలకలం, వివాదం, అంతకు మించి ప్రతిభ ఇవన్నీ కలిస్తే శింబు. ఈ యువ నటుడు పాడినా, మాట్లాడినా, ఆడినా వార్తే. అలా శింబు ఎప్పుడూ ప్రత్యేకమే. శింబు షూటింగ్‌కు సరిగా రారు, నిర్మాతలను ఇబ్బంది పెడతారు, దర్శకులతో గొడవ పడతారు లాంటి ఆరోపణలూ ఉన్నాయి. ఆ మధ్య విజయాలకు దూరమై విమర్శలకు బాగా దగ్గరైన శింబుపై రెడ్ కార్డ్ పడనుందనే దుమారం వరకూ పరిస్థితులను తెచ్చుకున్న నటుడు శింబు. ఇక ఆ మధ్య బీప్ పాటతో పోలీసులకు ఫిర్యాదు, కేసులు, కోర్టులు వరకూ వెళ్లారు. అలాంటివి తగ్గి ఇటీవల నటించిన సెక్క సివంద వానం చిత్ర విజయంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన శింబు నటుడిగా బిజీ అయ్యారు. ఆయన నటించిన తాజా చిత్రం వందా రాజాదాన్ వరువేన్ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. చేతిలో చాలా అవకాశాలు ఉన్నాయి కూడా. ఇలాంటి సమయంలో పెరియార్ కుత్తు అనే ప్రైవేట్ ఆల్బ మ్తో మరోసారి సంచలనానికి రెడీ అయ్యారు. తమిళనాడులో పెరియార్‌కు చాలా ఉన్నత భావాలు కలిగిన రాజకీయ సామాజిక వాది అనే పేరు ఉంది. అలాంటి నాయకుడి పేరుకు కుత్తు (ఐటమ్ సాంగ్‌కు కుత్తు పదాన్ని వాడతారు) పదం చేర్చి శింబు పాడి, ఆడిన పాటతో కూడిన ఆడియోను శుక్రవారం యూ ట్యూబ్‌లో విడుదల చేశారు. జాతి, మత వివక్షతను ఎండగట్టేలా సాగే ఆ పాటకు నటుడు శింబు నల్లషర్టు, ప్యాంటు ధరించి గ్రాఫిక్స్‌తో రూపొందించిన పెరియార్ శిల వద్ద ఐటమ్ సాంగ్ మాదిరి చిందులేస్తూ నటించడం విశేషం. ఇప్పుడా వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ దుమ్మురేపుతోంది. మరి ఈ వీడియోను ఎవరు ఏ విధంగా కెలికి వివాదంగా తెరపైకి తీసుకొచ్చారో చూడాలి. -
ప్లే బాయ్ హిట్ కొట్టాడు
కోలీవుడ్ హీరో శింబు టైం ప్రస్తుతం అంతగా బాలేదు. చాలా రోజులుగా సరైన హిట్ లేక కెరీర్ పరంగా కష్టాల్లో ఉన్న ఈ యంగ్ హీరో, ఈ మధ్య కాలంలో వివాదాలతో మరింత ఇబ్బందుల్లో పడ్డాడు. బీప్ సాంగ్ వివాదంతో కొంత కాలం సినిమాలకు, మీడియాకు దూరమవ్వటంతో అతని సినిమాల రిలీజ్లు కూడా వాయిదా పడ్డాయి. ముఖ్యంగా తన మాజీ ప్రేయసి నయనతారతో కలిసి నటించిన ఇదు నమ్మ ఆలు సినిమాను రిలీజ్ చేయడానికి ఏకంగా మూడేళ్ల సమయం పట్టింది. అయితే ఈ నెల 20న ఆడియన్స్ ముందుకు వచ్చిన ఇదు నమ్మ ఆలు శింబు కెరీర్‌ను గాడిలో పట్టినట్టుగా కనిపిస్తోంది. చాలా కాలం తరువాత శింబు, నయన్‌లు కలిసి నటించటం, సినిమాలో డైలాగ్స్ వారికి నిజజీవిత రిలేషన్స్‌పై సెటైర్స్లా అనిపించటం, ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీతో కూడా అలరించటంతో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. తొలిరోజే 14 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఇదు నమ్మ ఆలు శింబు కెరీర్లోనే బిగెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా రికార్డ్ సృష్టించింది. -
కోవై పోలీసులకు శింబు లొంగుబాటు
చెన్నై: ఎట్టకేలకు నటుడు శింబు సోమవారం కోవై పోలీసులకు లొంగిపోయాడు. బీప్ సాంగ్ వ్యవహారం ఇటీవల కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ బీప్ సాంగ్‌కు కారకులంటూ నటుడు శింబు, సంగీత దర్శకుడు అనిరుద్‌లపై ఫిర్యాదులు రావడంతో కేసులు నమోదు చేశారు. మహిళా సంఘాల ఆందోళలు, కేసుల నమోదు, కోర్టుల్లో పిటిషన్లు అంటూ పెద్ద సంచలనానికే దారితీయడంతో కొన్ని రోజుల పాటు శింబు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. సరిగ్గా ఆ సమయంలో కెనడాలో ఉన్న సంగీత దర్శకుడు అనిరుద్ ఇటీవల రహస్యంగా కోవై పోలీసుల ఎదుట హాజరై బీప్ సాంగ్‌కు తనకు ఎలాంటి సంబంధం లేదంటూ వివరణ ఇచ్చుకున్నాడు. శింబు మాత్రం చెన్నై హైకోర్టును ఆశ్రయించారు. అయితే శింబు కోవై పోలీసుల ఎదుట హాజరు కావలసిందేనంటూ ఆదేశిస్తూ కాస్త సమయమిచ్చి అవకాశాన్ని కల్పించింది.ఈ నేపథ్యంలో శింబు సోమవారం కోవై పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోయారు. శింబు ఉదయం 7.30 గంటల ప్రాంతంలో విమానంలో చెన్నై నుంచి కోవైకి చేరుకున్నారు. ఆయనతో పాటు తన తండ్రి టీ.రాజేందర్, న్యాయవాది శింబుతో పాటు ఉన్నారు. కోవైలోని ఒక హోటల్లో దిగిన శింబు బృందం ఉదయం 10 గంటలకు స్థానిక గాంధీపురం, కాట్టూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ అసిస్టెంట్ కమిషనర్ రమేశ్కృష్ణన్, సబ్ ఇన్స్పెక్టర్ సెల్వరాజ్, ఎస్ఐ ప్రేమలు వేసిన ప్రశ్నలకు శింబును వివరణ ఇచ్చాడు. ఆ తరువాత 10.20 గంటలకు శింబు బృందం పోలీస్‌స్టేషన్ నుంచి బయటకు వచ్చారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయమై ప్రస్తుతం తానేమీ చెప్పలేనని శింబు పేర్కొన్నాడు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు వివరణ ఇచ్చానని ఆపై భగవంతుడే చూసుకుంటాడని వ్యాఖ్యానించాడు. కాగా శింబు పోలీస్‌స్టేషన్‌కు వస్తున్న సమాచారం తెలియడంతో ఆయన అభిమానులు భారీ ఎత్తున్న అక్కడికి తరలి వచ్చారు. శింబును చూడటానికి పోలీస్‌స్టేషన్ లోనికి చొరబడ ప్రయత్నించగా గట్టి బందోబస్తును ఏర్పాటు చేసిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. శింబు లొంగుబాటు సమయంలోనూ అక్కడ కొంత కలకలం చెలరేగినట్లు తెలుస్తోంది. -
అనిరుధ్ ఔట్... మిక్కీ జె. మేయర్ ఇన్!
‘వై దిస్ కొలవెరి డీ’ (ఎందుకింత పగ అని స్థూలంగా అర్థం) పాటతో సంచలనం రేపిన సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్. మొన్నటి దాకా క్రేజీ యువ దర్శకుడిగా పేరున్న పాతికేళ్ళ అనిరుధ్‌కు ఇటీవల మాత్రం టైమ్ బాగున్నట్లు లేదు. తమిళనాట ‘బీప్ సాంగ్’తో ఇటీవల వివాదానికి కేంద్రమయ్యారు. అమ్మాయిల్ని ఆడిపోసుకునే మాటలను ‘బీప్ సౌండ్’ ద్వారా చెప్పకుండానే చెబుతూ, హీరో శింబు పాడిన పాట ఇంటర్నెట్లో లీకై, మొన్న డిసెం బర్లో కథ కేసులు, కోర్టుల దాకా వెళ్ళింది. శింబు పాడిన ఆ ‘‘ప్రైవేట్’’ బీప్‌సాంగ్ అనిరుధ్ రూపొందించినదే అని కథనం. తాజాగా ఆయన మళ్ళీ వార్తల్లోకి ఎక్కారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంత జంటగా రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘అ...ఆ (అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి)’ చిత్రం నుంచి సంగీత దర్శకుడిగా అనిరుధ్‌ను పక్కకు తప్పించారు. ఒక పక్క ‘బీప్‌సాంగ్’ వివాదం, మరో పక్క ఇప్పటికే ఒప్పుకొన్న స్టేజ్ షోలు, చేతిలో ఉన్న తమిళ ప్రాజెక్ట్స్‌తో అనిరుధ్ ‘అ...ఆ...’ చిత్రంపై ఇప్పటి వరకు దృష్టి పెట్టనేలేదని చెన్నై సమాచారం. సమ్మర్ రిలీజ్ ప్లాన్‌తో, హైదరాబాద్ పరిసరాల్లో శరవేగంతో షూటింగ్ జరుపుకొంటున్న ‘అ..ఆ’ చిత్ర యూనిట్‌కు ఇది పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పటి దాకా సహనంతో భరించిన యూనిట్ ఇక లాభం లేదని ప్రత్యామ్నాయం ఆలోచించింది. ఫలితంగా అనిరుధ్ స్థానంలో మిక్కీ జె. మేయర్‌కు మ్యూజిక్ డెరైక్షన్ చాన్స్ దక్కింది. ‘హ్యాపీ డేస్’ మొదలు పలు హిట్ చిత్రాలకు బాణీలు కూర్చిన మిక్కీ తాజాగా మహేశ్‌బాబు ‘బ్రహ్మో త్సవం’కి సంగీతమిస్తున్నారు. ఇప్పుడిలా అనుకోకుండా త్రివిక్రమ్ లాంటి దర్శకుడి చిత్రానికి స్వరాలు కూర్చే అవకాశం మిక్కీకి దక్కింది. తెలుగు సినిమాలపై... ‘వై దిస్ కొలవెరి డీ’! సహజంగానే ఈ వార్త సినీవర్గాల్లో సంచలన మైంది. రజనీకాంత్‌కు బంధువూ, ధనుష్, ఆయన భార్య ఐశ్వర్యా ధనుష్‌ల ఆశీస్సులు పుష్కలంగా అనిరుధ్ గతంలోనూ తెలుగు సినిమాల విషయంలో ఇలానే వ్యవహరించారని కృష్ణానగర్ వర్గాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. రామ్‌చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శక త్వంలో వచ్చిన ‘బ్రూస్లీ’కి మొదట అనిరుధ్‌నే తీసు కున్నారు. ఆ సినిమాతో తెలుగులో స్వరంగేట్రం చేయాల్సిన మనవాడు తీరా, అజిత్ హీరోగా తమిళ ‘వేదాళమ్’ ఆఫర్ రావడంతో ‘బ్రూస్ లీ’ని అర్ధంతరంగా వదిలేశాడు. దర్శక - నిర్మాతలకు చుక్కలు చూపించాడు. ఫలితంగా, ‘బ్రూస్లీ’ బృందం తమన్‌ను ఆశ్రయించాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ‘అ...ఆ’కు అలాంటి పరిస్థితే వచ్చింది. చిత్రమేమి టంటే, ‘అ..ఆ’ యూనిట్ మొదట ఎంచుకొన్న ఆర్ట్ డెరైక్టర్ రాజీవన్ కానీ, ఇప్పుడు అనిరుధ్ కానీ ఇద్దరూ ప్రొఫెషనలిజమ్‌ను విస్మరించి, తమ విధులు సరిగ్గా నిర్వర్తించకపోవడం, సరైన టైమ్‌లో స్పందించక పోవడం! ఫలితంగా ఇద్దరినీ ‘అ...ఆ’ నుంచి పక్కకు తప్పించాల్సి వచ్చింది. వాళ్ళ అన్ప్రొఫెషనలిజమ్ వాళ్ళపై ఏ మేరకు ప్రభావం చూపిందో కానీ, ఇక్కడి దర్శకనిర్మాతలకు డబ్బు, కాలం వృథా కదా! -
నా పెళ్లి మీ ఇష్టం
నా పెళ్లి మీ ఇష్టం కానీ అంటూ సంచలనాలకు కేంద్ర బిందువైన నటుడు శింబు మరోసారి వార్తల్లోకెక్కారు.ఈ మధ్య నటి హన్సికతో ప్రేమ ఫెయిల్యూర్, ఇటీవల బీప్‌సాంగ్ కలకలం సంఘటనలు కాస్త సద్దుమణిగాయనుకుంటున్న సమయంలో వివాహం విషయంలో శింబు పేరు మరోసారి హెడ్లైన్లో కొచ్చేసింది. ప్రేమ వివాహం చేసుకోవాలన్నది శింబు బలమైన కోరిక. ఈ విషయాన్ని ఆయన చాలా సార్లు బహిరంగంగానే వెల్లడించారు. ఆ దిశగా ప్రయత్నించి విఫలం అయ్యారు కూడా. శింబు నయనతార ప్రేమ వ్యవహారం, నటి హంన్సికతో ప్రేమ పెళ్లి వరకూ వెళ్లి బెడిసికొట్టిన విషయం తెలిసిందే. అలా రెండు సార్లు ప్రేమ బ్రేకప్ అవ్వడం, ఇటీవల బీప్ సాంగ్ వివాదం శింబు మనసును బాగా కలచివేశాయని చెప్పవచ్చు. మరో పక్క ఆయన తల్లిదండ్రుల పెళ్లి ఒత్తిడి కూడా శింబుపై చాలా ప్రభావం చూపినట్లుంది. వెరసి ప్రేమ వివాహం చేసుకోవాలనే తన ఆకాంక్షను పక్కన పెట్టి పెద్దలు కుదిర్చిన పెళ్లికి తలవంచేలా చేశాయి. ఎస్ శింబు తన తల్లిదండ్రులు సెలెక్ట్ చేసి అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సమ్మతించారు. అయితే ఒక నిబంధనను విధించారట. అదేమిటంటే తల్లిదండ్రులు చూసిన అమ్మాయి తనకు నచ్చాలి. అదే సమయంలో తానూ ఆ అమ్మాయికి నచ్చి ఉండాలి అన్నది శింబు కండిషన్ అట. ఈ విషయాన్ని ఆయన తండ్రి టీ.రాజేందర్ వెల్లడించినట్లు కోలీవుడ్ మీడియా సమాచారం. శింబు తల్లిదండ్రులు ఆయనకు తగిన వధువు అన్వేషణలో ఉన్నారు. అయితే ఇటీవల శింబు కుటుంబ సభ్యులు తమ సన్నిహిత కుటుంబ సభ్యులతో కలిసి ఒక విందులో పాల్గొన్నారని అక్కడ వారి మధ్య శింబు పెళ్లికి సంబంధించిన చర్చ జరిగిందనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంలో నిజం లేదని టీ.రాజేందర్ కొట్టిపారేశారు.అయితే శింబుకు నచ్చిన పెళ్లికూతురుని వెతికే పనిలో ఉన్నట్లు ఆయన తెలిపారు. -
బీప్ సాంగ్‌తో ఎలాంటి సంబంధం లేదు
చెన్నై: బీప్ సాంగ్ వివాదంలో యువ సంగీత దర్శకుడు అనిరుద్ కోవై రేస్ కోర్స్ పోలీసుల ముందు హాజరై రెండు పేజీల వివరణతో కూడిన లేఖను అందించారు. వివరాల్లోకెళితే శింబు రాసి, పాడిన బీప్ సాంగ్ మహిళలను అగౌరవపరిచే విధంగా ఉందంటూ రాష్ట్రంలో నెల రోజులకు పైగా పెద్ద దుమారమై చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఆ పాటకు అనిరుద్ సంగీతాన్ని అందించారంటూ శింబుతో పాటు ఆయన పైనా పలు కేసులు నమోదయ్యాయి. వీరిద్దరిని అరెస్ట్ చేయడానికి కోవై, చెన్నై పోలీసులు రంగం సిద్ధం చేశారు. నటుడు శింబు కోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్‌కు అర్హతను పొందారు. అయితే సంగీత కచేరీల కోసం కెనడా వెళ్లిన అనిరుద్ పోలీసుల ముందు హాజరు కావడానికి కాల సమయాన్ని కోరారు. దీంతో ఆయన తిరిగి రాక కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు.ఈ నేపథ్యంలో అనిరుద్ మంగళవారం అర్ధరాత్రి సమయంలో కోవై రేస్ కోర్స్ పోలీసుల ఎదుట హాజరై బీప్ సాంగ్ వ్యవహారంలో వివరణతో కూడిన లేఖ ఇచ్చారు.అందులో తనకు బీప్ సాంగ్ పాటకు ఎలాంటి సంబంధం లేదని వివరించారు. ఈ విషయాన్ని నటుడు శింబు కూడా వెల్లడించారన్న విషయాన్ని గుర్తు చేశారు. ఆ పాటపై వివాదం చెలరేగినప్పుడు కెనడాలో ఉన్నానని పోలీసుల సమక్షంలో హాజరు కాలేక పోయానని చెప్పారు. తన ప్రమేయం లేక పోయినా తనపై కేసులు నమోదు అయ్యాయని పేర్కొన్నారు. అనిరుద్ వివరణ లేఖను అందుకున్న కోవై రేస్ కోర్స్ పోలీస్ ఇన్స్పెక్టర్ సెల్వరాజ్ విచారణకు పిలిచినప్పుడు హాజరవ్వాలని అనిరుద్‌కు చెప్పారు. పోలీసుల ఎలాంటి విచారణకైనా సహకరిస్తానని అనిరుద్ హామీ ఇచ్చారు. -
కేసును రద్దు చేయండి
హైకోర్టులో పిటిషన్ :శింబు చెన్నై: నటుడు శింబు తనపై నమోదైన కేసుల నుంచి చాకచక్యంగా బయట పడే ప్రయత్నాలు చేస్తున్నారు. మహిళలను అగౌరపరిచేలా పాటరాసి, పాడిన బీప్ సాంగ్ వివాదంలో ఇప్పటికే మద్రాసు హైకోర్టులో ముందస్తు బెయిల్‌కు అర్హత పొందిన శింబు కోవై రేస్‌కోర్స్ పోలీసులు, చెన్నై నేరపరిశోధనా విభాగం పోలీసుల ఎదుట ఈ నెల 11న హాజరుకావలసి ఉన్నా ఆ తేదీని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి ఈ నెల 29కు గడువును పొందారు. తాజాగా చెన్నై నేరపరిశోధనా విభాగం పోలీసులు నమోదు చేసిన కేసును రద్దు చేయాలంటూ మరో పిటిషన్‌ను హైకోర్టులో దాఖలు చేశారు.అందులో ఆయన పేర్కొంటూ ఒకే నేరానికి ఒకటికి మించిన కేసులు నమోదు చేయరాదని సుప్రీమ్ కోర్టు ఇంతకు ముందే తీర్పు ఇచ్చిందన్నారు. ఆ విధంగా బీప్ సాంగ్ అనే ఒక్క నేరానికి తనపై ఒక్క కేసు మాత్రమే నమోదు చేయాలన్నారు. ఆ విధంగా కోవై పోలీసులు ఇంతకు ముందే తనపై కేసు నమోదు చేశారని అందువల్ల చెన్నై నేరపరిశోధనా విభాగం పోలీసులు నమోదు చేసిన కేసును రద్దు చేయాలని కోరారు. ఈ కేసు మంగళవారం న్యాయమూర్తి ఆర్.సుబ్బయ్య సమక్షంలో విచారణకు వచ్చింది. ప్రభుత్వం తరపున నేరపరిశోధనా విభాగం న్యాయవాది షణ్ముగవేలాయుధం హాజరై వాదించారు. అయితే శింబు తరపు న్యాయవాది వేరే కోర్టుకు హాజరవడం వల్ల విచారణను న్యాయమూర్తి మధ్యాహ్నానికి వాయిదా వేశారు. -
ఎట్టకేలకు పోలీసుల ముందుకు బీప్ సాంగ్ అనిరుధ్
'బీప్ సాంగ్' వివాదంలో ఇరుక్కున్న సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ పోలీసుల వద్ద హాజరయ్యాడు. నటుడు శింబుతో ఈ పాట పాడించి ఒక్కసారిగా వివాదాలు మూటగట్టుకున్న అనిరుధ్.. ఇన్నాళ్లుగా విదేశాల్లో ఉన్న విషయం తెలిసిందే. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో రేస్ కోర్స్ రోడ్డు పోలీసు స్టేషన్ వద్ద హాజరైన అనిరుధ్.. రెండు పేజీల ప్రకటన సమర్పించాడు. ఆ పాటను తాను కంపోజ్ చేయలేదనే మరో సారి చెప్పాడు. కోయంబత్తూరులో పోలీసుల వద్ద హాజరై తన ప్రకటన ఇచ్చానని వాట్సప్ మెసేజి ద్వారా మీడియాకు చెప్పాడు. ఆలిండియా డెమొక్రాటిక్ ఉమెన్ అసోసియేషన్ (ఐద్వా) వాళ్లు ఈ పాట విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ పాటలో మహిళలను కించపరిచేలా అసభ్య లిరిక్స్ ఉన్నాయని ఐద్వా మండిపడిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు కేసు నమోదుచేసి శింబు, అనిరుధ్ ఇద్దరినీ డిసెంబర్ 19న హాజరు కావాల్సిందిగా ఆదేశించారు. అయితే శింబు వాళ్లను నెల రోజుల గడువు కోరాడు. అనిరుధ్ మాత్రం తాను ఆ పాటను కంపోజ్ చేయలేదని, అందవల్ల తనపై ఎఫ్ఐఆర్ ఎత్తేయాలని అడిగాడు. పోలీసులు దాన్ని నిరాకరించి, జనవరి 2న హాజరు కావాలన్నారు. అప్పుడు మళ్లీ అనిరుధ్ 15 రోజుల గడువు కోరాడు. తాను చెన్నై వరద బాధితుల సహాయార్థం విదేశాల్లో ప్రదర్శనలు చేస్తున్నానని, వచ్చాక హాజరవుతానని చెప్పాడు. -
శింబు అజ్ఞాతం వీడతారా?
చెన్నై: నటుడు శింబు బీప్ సాంగ్ కేసులో సోమవారం చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ముందు విచారణకు హాజరు కావలసి ఉంది. అయితే ఇప్పటికే పలు కేసుల విచారణకు సహకరించకుండా అజ్ఞాతంలో ఉన్న శింబు సోమవారం పోలీసుల ఎదుట హాజరవుతారా లేదాఅన్న ఆసక్తి నెలకొంది. నటుడు శింబు స్త్రీలను కించపరిచేలా అసభ్యపదాలతో పాట రాసి, పాడారని,దానికి యువ సంగీత దర్శకుడు అనిరుద్ బాణీలు కట్టారంటూ నెల రోజులకు పైగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలు ఆందోళనకు దిగిన విషయం,తద్వారా కోవై,తూత్తుకుడి,చెన్నై తదితర ప్రాంతాల్లో శింబుపై కేసులు నమోదైన సంఘటనలు తెలిసిందే. దీంతో అజ్ఞాతంలోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతున్న శింబు ముందస్తు బెయిల్ కోసం మద్రాసు హైకోర్టును ఆశ్రయించి అరెస్ట్ నుంచి బయట పడ్డారు. అయితే తనపై ఇకపై కేసులు నమోదు కాకుండా పోలీస్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేయాలన్న శింబు పిటిషన్‌ను మాత్రం హైకోర్టు తిరస్కరించింది. అదే విధంగా పోలీసుల విచారణకు సహకరించాలని కోర్టు శింబును ఆదేశించింది. దీంతో శింబు ఇవాళ చెన్నై పోలీసుల ముందు హాజరు కావలసి ఉంది. అయితే ఆయన పోలీసుల ఎదుట హాజరవుతారా?లేక తన న్యాయవాది ద్వారా వివరణ ఇప్పిస్తారా?అన్నది ఆసక్తిగా మారింది. శింబు హాజరైతే ఆయనను విచారించి వాగ్మూలం నమోదు చేస్తామని చెన్నై నేరపరిశోధనా విభాగం పోలీసు ఒకరు వెల్లడించారు. -
హైకోర్టులో శింబుకు చుక్కెదురు
చెన్నై: నటుడు శింబుకు హైకోర్టులో చుక్కెదురైంది. బీప్ సాంగ్ వివాదంలో ముందస్తు బెయిల్ కోరుతూ మద్రాసు హైకోర్టును ఆశ్రయించిన నటుడు శింబుకు బెయిల్ రావడం కాస్త ఊరటనిచ్చినా తాజాగా హైకోర్టు షాక్ ఇచ్చింది. వివరాల్లోకెళ్లితే బీప్‌సాంగ్ వ్యవహారంలో శింబు.. తనపై ఇక కేసులు నమోదు చేయరాదని డీజీపీకి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను గురువారం విచారించిన హైకోర్టు శింబు అభ్యర్థన పిటిషన్‌ను కొట్టివేసింది. శింబు పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి సుబ్బయ్య ఇలాంటి పిటిషన్‌పై ఉత్తర్వులు జారీ చేయడానికి చట్టంలో స్థానం లేదంటూ కొట్టివేశారు. -
హీరో శింబుకు హైకోర్టులో ఊరట
చెన్నై: బీప్‌సాంగ్ వ్యవహారంలో నటుడు శింబుకు ఊరట కలిగింది. ఆయనకు మద్రాస్ హైకోర్టు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. శింబు బీప్ సాంగ్ వివాదంతో ఇటీవల తమిళనాడే దద్దరిల్లిందని చెప్పవచ్చు. మహిళా సంఘాలు ఆందోళనలు, పోలీసులు కేసులు నమోదులు అంటూ.. పెద్ద రచ్చే జరిగింది. బీప్ సాంగ్ రాసి పాడిన శింబు, సంగీతాన్ని అందించిన అనురుధ్ ఏ క్షణంలోనైనా అరెస్ట్ కావచ్చు అంటూ మీడియా ప్రచారం హోరెత్తించింది. కోవై పోలీసులు శింబును అరెస్ట్ చేయడానికి చెన్నై వచ్చి మూడు రోజు లు ఆయన కోసం గాలించారు కూడా. శింబు పరారీలో ఉన్నారనే ప్రచారం కలకలం సృష్టించింది. ఇక అనిరుధ్ అయితే సంగీత కచేరీ కోసం కెనడా వెళ్లి అక్కడే ఉం డిపోయారు. కాగా శింబు ముందస్తు బెయిల్ కోసం చెన్నై హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటీషన్ గత నెల 22 న హైకోర్టులో విచారణకు రాగా ముందస్తు బెయిల్‌ను నిరాకరిస్తూ తుది విచారణను జనవరి నాలుగవ తేదీకి వాయిదా వేశారు. ఆలోపు పోలీసులు శింబు ను అరెస్ట్ చేయవచ్చునని కూడా ప్రకటించారు. కాగా శింబు కేసు సోమవారం విచారణకు వచ్చింది. కేసును పరిశీలించిన న్యాయమూర్తి శింబుకు ముందస్తు బెయిల్ ఇవ్వకపోయేంత బలమైన కారణాలు లేవు అంటూ బెయిల్‌ను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే బీప్ సాంగ్ వ్యవహారంలో పోలీసులు వాయిస్ టెస్ట్‌కు అనుమతి కోరుతున్నారు కాబట్టి శింబు అందుకు సహకరించాలని ఆదేశించారు. అదేవిధంగా శింబును కోవై, రేస్‌కోర్స్ పోలీసులు మంగళవారం (5వ తేదీ)విచారణకు హాజరుకావలసిందిగా ఆదేశాలు జారీ చేసినందున్న ఈ నెల 11న వారి విచారణకు హాజరవ్వాల్సిందిగా హైకోర్టు న్కాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. శింబుపై మరో రెండు కేసులు; ఇదిలా ఉండగా బీప్ సాంగ్ వ్యవహారంలో శింబుపై తూత్తుకుడి, కోవై లలో మరో రెండు కేసులు నమోదవ్వడం గమనార్హం. మహిళలను అవమాన పరచే విధంగా బీప్‌సాంగ్‌ను రూపొందించిన శింబు, అనిరుద్‌లపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ తూత్తుకుడికి చెందిన న్యాయవాది శక్తికని స్థానిక 2వ జ్యూడిషియల్ మేజిస్టేట్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. స్త్రీజాతిని అగౌరపరచే విధంగా బీప్‌సాంగ్‌ను రూపొందించిన నటుడు శింబు, సంగీతదర్శకుడు అనిరుద్పై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ పిటీషన్‌ను విచారించిన న్యాయమూర్తి శింబు, అనిరుద్‌లపై కేసు నమోదు చేసి పూర్తి దర్యాప్తు చేసి వివరాలను మార్చి 7వ తారీకున కోర్టుకు సమర్పించాలని తూత్తుకుడి, మద్దియపాక్కమ్ పోలీసులకు ఆదేశించారు. దీంతో మద్దియపాక్కమ్ పోలీసులు శింబు, అనిరుద్‌లపై 509,67 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అదేవిధంగా కోవైకు చెందిన ఇళంగోవన్ అనే వ్యక్తి కోవై 2వ నేర విభాగ న్యాయస్థానంలో శింబు, అనిరుద్‌లపై పిటీషన్ దాఖలు చేశారు. ఆ పిటీషన్‌ను విచారణకు స్వీకరించిన మెజిస్ట్రేట్ రాజకుమార్ ఈ నెల 12వనతేదీన కేసును విచారించనున్నట్లు వెల్లడించారు. -
శింబుపై కేసు వాపస్
నటుడు శింబు బీప్ సాంగ్ కలకలం కొనసాగుతూనే ఉంది. మహిళలను అవమానించే విధంగా అసభ్య పదజాలాలతో పాట రాసి, పాడారంటూ నటుడు శింబుపై తమిళనాడులోని పలు మహిళా సంఘాల నిర్వాహకులు మండిపడుతూ ఆందోళనకు దిగుతున్న విషయం తేలిసిందే. ఈ నేపథ్యంలో శింబుపై కోవై, చెన్నైలో పలు విభాగాల్లో పోలీసులు కేసులు నమోదు చేసి, ఆయన్ని అరెస్ట్ చేసే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. దీంతో శింబు పరారీలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే శింబు ఎక్కడికి పారిపోలేదనీ తమిళనాడులోనే ఉన్నాడనీ ఆయన తల్లిదండ్రులు టి.రాజేందర్, ఉషారాజేందర్ అంటున్నారు. శింబు మాత్రం పోలీసులకు దొరకడం లేదు. తను ముందస్తు బెయిల్ కోసం చెన్నై హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై జనవరి నాలుగున విచారణ జరగనుంది. శింబుపై పాట్టాలీ మక్కల్ కట్చికి చెందిన వెంకటేశన్ అనే వ్యక్తి చెన్నై సైదాపేట కోర్టులో బీప్ సాంగ్ వ్యవహారంలో పిటీషన్ దాఖలు చేసిన విషయం తేలిసిందే. దానిపై సోమవారం విచరణ జరగనున్న నేపథ్యంలో వెంకటేశన్ తన పిటీషన్‌ను వాపస్ తీసుకున్నారు. పార్టీ అధినాయకత్వం ఆదేశాల మేరకే ఆయన కేసును వాపస్ తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. శింబుకు మద్దతుగా ఆందోళన నటుడు శింబుకు మద్దతుగా ఇప్పటికే కొందరు సినీ ప్రముఖులు గొంత్తెతిన నేపథ్యంలో అభిమానులు ఆయనకు అనుకూలంగా ఆందోళనకు దిగుతుండడం గమనార్హం. సోమవారం ఉదయం 50కి పైగా శింబు అభిమానులు సతీష్ హరికరన్ ఆధ్వర్యంలో స్థానిక నుంగంబాక్కం సమీపంలోని వళ్లువర్‌కూటం వద్ద ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. సమాచారం అందిన పోలీసులు వెంటనే అక్కడకు వచ్చి ఆందోళన కార్యక్రమానికి అనుమతి లేదంటూ వారందరినీ పంపించేశారు. దీంతో అభిమానులందరూ టీనగర్, హిందీ ప్రచారసభ వీధిలోని శింబు ఇంటి ముందు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగాా సతీష్ హరికరన్ మాట్లాడుతూ శింబు పాటను ఎవరో తస్కరించి ఇంటర్నెట్లో ప్రసారం చేశారన్నారు. వారెవరో పోలీసులు కనిపెట్టి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
రాధికా శరత్‌కుమార్‌కు నోటీస్ జారీ చేస్తాం
-
రాధికా శరత్‌కుమార్‌కు నోటీస్ జారీ చేస్తాం
తమిళసినిమా: నటి రాధిక శరత్‌కుమార్‌కు నోటీస్ జారీ చేస్తామని దక్షిణ భారత నటీనటుల సంఘం అధ్యక్షుడు నాజర్ అన్నారు. సంఘం కార్యవర్గ సమావేశం శనివారం సాయంత్రం చెన్నైలోని ఒక నక్షత్ర హోటల్లో జరిగింది. ఈ సమావేశంలో పలు విషయాల గురించి చర్చించినట్లు తెలిసింది.అయితే తమిళనాడు యావత్తు ప్రకంపనలు సృష్టిస్తున్న శింబు బీప్ సాంగ్ వ్యవహారం చర్చకు రానట్టు సమాచారం. అనంతరం విలేకరుల ప్రశ్నలకు సంఘం సభ్యులు బదులిచ్చారు.ముఖ్యంగా శింబు విషయంలో సంఘం జోక్యం చేసుకోలేదన్న నటి రాధిక శరత్‌కుమార్ ఆరోపణపై స్పందిస్తూ రాధిక శరత్‌కుమార్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని తీవ్రంగా ఖండించారు. వాస్తవానికి శింబు బీప్ సాంగ్ వ్యవహారంలో ఆయన కుటుంబ సభ్యులతో సంప్రదించామన్నారు. అయితే ఆ సమస్యను వారు కోర్టులోనే తేల్చుకుంటామని చెప్పారని వివరించారు. అంతే కాదు ఈ విషయమై శింబుతో కూడా మాట్లాడామని,సమస్య పరిష్కారానికి తగిన సహాయం చేస్తామని చెప్పామన్నారు. అందుకు ఆయన సరిగా స్పందించలేదని తెలిపారు. అలాంటప్పు డు తామేమి చేయగలమని అని అన్నారు. కాగా సంఘంపై అసత్య ఆరోపణలు చేస్తున్న నటి రాధికా శరత్‌కుమార్‌ను వివరణ కోరుతూ నోటీసులు జారీ చేయనున్నట్లు దానికి ఆమె వివరణ ఇచ్చే తీరాలని సంఘం అధ్యక్షుడు నాజర్ అన్నారు. దక్షిణ భారత నటీనటుల సంఘం అందులోని సభ్యులందరికీ అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.బీప్ సాంగ్ వ్యవహారం కారణంగా శింబును సంఘం నుంచి తొలగించమని నాజర్ స్పష్టం చేశారు. 8జీ చట్టం అమలు అదే విధంగా సంఘాభివృద్ధికి విరాళాలు సేకరిస్తామని, దాతలు టాక్స్ మినహాయింపు,అదే విధంగా డిపాజిట్ల విషయంలో 8జీ చట్టాన్ని తీసుకొస్తామని సంఘం కార్యదర్శి విశాల్ వెల్లడించారు. ఈ విషయమై బ్యాంక్‌లో వినతిపత్రాన్ని అప్లై చేస్తామని తెలిపారు. ఇకపోతే తమిళనాడులో వరద భాదితులను ఆదుకునే విధంగా సేకరించిన విరాళాలు మొత్తం ఒక కోటీ మూడు లక్షల రూపాయల్ని ముఖ్యమంతి సహాయనిధికి అందించినట్లు తెలిపారు. -
‘బీప్’ తొలగించడానికి యూట్యూబ్ నిరాకరణ
తమిళసినిమా: తమిళనాడునే ఊపేస్తున్న శింబు బీప్ పాటను యూ ట్యూబ్ నుంచి తొలగించడానికి ఆ సంస్థ నిర్వాహకులు నిరాకరించడంతో సమస్య మరింత జఠిలంగా మారింది. బీప్ సాంగ్ గత 11వ తేదీ నుంచి వాట్సాప్,ఫేస్బుక్, ఇంటర్నెట్,యూట్యూబ్ అంటూ హల్చల్ చేస్తోంది. ఇప్పటికే 10 లక్షల మంది ఈ పాటను లైక్ చేశారు. దీంతో శింబు బీప్ పాటకు సంబంధించిన వివాదానికి త్వరగా పుల్‌స్టాప్ పెట్టాలని భావించిన నగర నేరపరిశోధన శాఖ అధికారులు ఆ సాంగ్‌ను యూట్యూబ్ నుంచి తొలగించే చర్యలు చేపట్టాల్సిందిగా పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పోలీసులు ఆగమేఘాలపై యూట్యూబ్ అధికారులను కలిసి శింబు సాంగ్‌ను నిలిపివేయాల్సిందిగా కోరారు.అయితే ఆ సాంగ్ అర్థం ఏమిటో ఆంగ్లంలో తర్జుమా చేసి తమకు వివరించాల్సిందిగా యూట్యూబ్ నిర్వాహకులు పోలీసులకు చెప్పారు. దీంతో అతి కష్టం మీద అరకొర అర్థాలతో బీప్ సాంగ్‌ను పోలీసులు ఆంగ్లంలోకి అనువదించి చెప్పగా అందులో పెద్దగా తప్పు పట్టాల్సిన విషయం ఏమీ లేదని యూట్యూబ్ నిర్వాహకులు తేల్సి చెప్పడంతో పోలీసులు కంగు తిన్నారు. దీంతో అసలు ఇంతగా కలకలం సృష్టిస్తున్న ఆ పాట యూట్యూబ్‌లోకి ఎలా వచ్చింది? దీనికి కారకులెవరు?అన్న విషయాలపై పోలీసులు దృష్టి సారించినట్లు సమాచారం. -
బాధపడింది శింబునే
చెన్నై : తమిళసినిమా నటుడు శింబు రాసి, పాడిన మహిళలను అవమానించేదిగా కలకలం సృష్టిస్తున్న బీప్ సాగ్ వివాదం రచ్చ రచ్చగా మారింది. అయితే ఇప్పటి వరకూ శింబును శిక్షించాల్సిందే అంటూ ఏక గొంతు వినిపించింది. తాజాగా కొద్దిగా స్వరం మారింది. శింబుకు మద్దతుగా కొన్ని గొంతులు వినిపించడం విశేషం. బాధింపునకు గురైంది శింబునే నటుడు శింబుపై కోవై, చెన్నైలలో నాలుగు విభాగాల్లో కేసులు నమోదైన విషయం తెలిసిందే. పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. శింబు పరారీలో ఉన్నట్లు తన కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నట్లు ప్రచారం హల్ చల్ చేస్తోంది. ఇలాంటి పరిస్థితిలో గురువారం శింబు తల్లి ఉషారాంజేందర్ ఆవేదన భేటీ ఒక వర్గాన్ని కదిలించిదనే చెప్పాలి. ఒక ప్రముఖ న్యాయవాది తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ బీప్ వ్యవహారంలో నిజానికి బాధింపునకు గురైంది నటుడు శింబునేనని ఆయన పాటను దొంగిలించి ఇంటర్నెట్లో విడుదల చేసిన వ్యక్తిని కనుగొనడంలో పోలీసులు విఫలం అయ్యారని అన్నారు. అంతే కాదు ఇది తుపాన్ బాధితుల సమస్యను మరుగున పడేయడానికి ప్రభుత్వం పన్నుతున్న కట్ర అని కూడా ఆరోపించడం గమనార్హం.అదే విధంగా నటుడు, నడిగర్‌సంఘం మాజీ అధ్యక్షుడు శరత్‌కుమార్ మాట్లాడుతూ... శింబు చర్య క్షమార్హమే అంటూ పేర్కొన్నారు. అదే విధంగా నటి రాధిక శరత్‌కుమార్ శింబు వ్యవహారంలో నడిఘర్ సంఘం జోక్యం చేసుకోదేమ్ అంటూ ప్రశ్నించారు. శింబు వల్ల మహిళలకు మానసిక క్షోభే కాగా మహిళా సంఘాలు మాత్రం నటుడు శింబు వల్ల ప్రతి స్త్రీకీ మానసిక క్షోభేనని దుయ్యపడుతున్నారు.ఇక పోలీసులైతే శింబు పోలీస్‌స్టేషన్‌కు ప్రత్యక్షంగా హాజరై వివరణ ఇవ్వకుంటే అతని కోసం గాలించి అరెస్ట్ చేయడం సబబేనని అంటున్నారు.ఇలా శింబు బీప్ సాంగ్ వ్యవహారం ఇంకా రచ్చరచ్చగానే ఉంది. -
శింబునే కాదు నన్నూ ఉరి తీయండి!
నా కొడుకుతో పాటు నన్నూ ఉరి తీయండి అంటూ నటుడు శింబు తల్లి ఉషా రాజేందర్ కన్నీళ్ల పర్యంతం అయ్యారు. శింబు రాసి, పాడిన బీప్ సాంగ్ సమస్య ఇటీవల తుపాన్ బాధితుల ఇక్కట్లను మరిపించేంతగా విశ్వరూపం దాల్చిందని చెప్పవచ్చు. శింబు, అనిరుద్‌లపై కోవై, చెన్నైలలో కేసులు నమోదయ్యాయి. శింబు పరారీలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ముందస్తు మెయిల్ కోసం కోర్టును ఆశ్రయించినా ఫలితం కనిపించడం లేదు. దీంతో శింబు సరెండర్ కాకుంటే చర్యలు తీవ్రంగా ఉంటాయని పోలీసులు హెచ్చరించిన నేపథ్యంలో శింబు తల్లి కంటతడి పెడుతూ తన ఆవేదనను వ్యక్తం చేస్తూ ఒక వీడియోను విడుదల చేశారు. అదేమిటో చూద్దాం. ఆకతాయి తనంగా రూపొందించిన పాట శింబు చిన్నతనంలోనే నటుడయ్యాడు. శింబు చిన్న కుర్రాడు. తనకింకా పెళ్లి కాలేదు. ఆకతాయితనంగా రూపొందించిన పాట అది. ఆ తరువాత దానిని వద్దని పారేశాడు. శింబు అంటే గిట్టని వాళ్లెవరో ఆ పాటను దొంగిలించి ఇంటర్నెట్లో ప్రసారం చేశారు. వారిపై చర్యలు తీసుకోవలసిందిగా పోలీసులకు ఫిర్యాదు చేశాం. అయితే శింబుపై మాత్రం కేసులు నమోదయ్యాయి. తుపాను బాధితుల కంటే ఇది పెద్ద విషయమా? తినడానికి అన్నం లేక, నిలువ నీడలేక ఎందరో అలమటిస్తున్నారు. అలాంటి వారికి సాయం చేయకుండా శింబు విషయాన్ని భూతద్దంలో చూస్తున్నారు.అసలు శింబు చేసిన తప్పు ఏమిటీ? తన బహిరంగ కార్యక్రమంలో గానీ, సినిమాలో గానీ లేక ఏదైనా భేటీలో ఆ పాట పాడాడా? లేదే. శింబు ఎదుగుదలను అడ్డుకుంటున్నారు శింబు ఎదుగుదలను అడ్డుకోవడానికి సినిమాలోని సహ నటులే అడ్డుకుంటున్నారు. శింబు చిత్రాల విడుదలకు వరుసగా కుట్ర చేస్తున్నారు. పోటీ అన్నది అవసరమే. అయితే అది ఆరోగ్యకరంగా ఉండాలి. అలా కాకుండా శింబు ఎదుగుదలను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తన పేరుకు చెడును ఆపాదించే చర్యలకు పాల్పడుతున్నారు. శింబు ఎక్కడికి పారిపోలేదు కనీసం ఇంటి ముందు ముగ్గు కూడా వేసుకోలేకపోతున్నాను. అంతగా మనసు అశాంతికి గురవుతోంది. శింబు పరారీలో ఉన్నాడంటూ ప్రచారం జరుగుతోంది. తన ఎక్కడికీ వెళ్లలేదు. పోలీసులు గాలించడానికి శింబు చేసిన తప్పేమిటి? తనను వెతకడానికి తను ఎక్కడికీ పారిపోలేదు. మీకు నా కొడుకు కావాలి అంతేగా అతన్ని ఏ పోలీసుకు అప్పచెప్పడానికైనా సిద్ధమే. నన్ను ఉరి తీయండి శింబును ఉరి తీయాలంటున్నారు.అంత తప్పు తనేం చేశాడు.శింబును పెంచిన నన్ను ఉరి తీయండి.ఇప్పుడు చూసినా కెమెరాలతో మనషులు ఇంటి ముందు తిరుగుతున్నారు. మనశ్శాంతి కరువైంది. అసహనానికి గురౌవుతున్నాం. ఏమి రాష్ట్రం ఇది? మేమిక తమిళనాడులో జీవించలేం. ఏ కర్ణాటకకో, కేరళకో లేక మరెక్కడికైనా వెళ్లి మా బతుకు మేము బ్రతుకుతాం. మాకు జీవితాన్నిచ్చిన తమిళనాడుకు కృతజ్ఞతలు అంటూ శింబు తల్లి ఉషా రాజేందర్ కన్నీళ్ల పర్యంతం అయ్యారు. నా కొడుకు ప్రాణం కావాలా? ఏం ఊరి ఇది? సొంత ఇంటిలో స్వేచ్ఛగా జీవించడానికి కూడా స్వతంత్రం లేదు. ఇంకా ఎందుకు ఇక్కడ ఉండాలి? మా పక్కన ఉన్న మంచి గురించి ఎవరూ చెప్పడం లేదు. ఆ పాట దొంగలించబడింది. అది ఒక బీప్ సాంగ్. వద్దని పారేసిన పాట. ఆ కోణంలో ఎవరూ ఆలోచించడం లేదు. అసలు మీకు ఏమి కావాలి? నా కొడుకు ప్రాణం కావాలా? తీసుకోండి. లేదా తనను కనిపెంచిన నా ప్రాణం కావాలా? తీసుకోండి. అసలు మీ సమస్య ఏమిటి? -
బీప్ సాంగ్ ప్రసారం చేయొద్దు
చెన్నై : శింబు బీప్ సాంగ్ కేసు శింబును అరెస్ట్ చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో శింబు ముందస్తు మెయిల్ కోసం మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. తాను నటుడిని మాత్రమే కాకుండా గాయకుడిని కూడానని పలు చిత్రాల్లో పాడినట్లు తన పిటిషన్లో పేర్కొన్నారు. కొన్ని ప్రైవేట్ పాటలు పాడుతున్నట్లు, అలా పాడిన ఒక డమ్మీ పాటనే బీప్ సాంగ్ అని దాన్ని తాను ఏ సోషల్ నెట్ వర్క్స్‌లోనూ ప్రచారం చేయలేదని, అలా దొంగతనంగా ప్రచారం చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని తాను పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. బీప్ సాంగ్ వ్యవహారంలో తన తప్పు ఏమీలేదని తెలిపారు. ఈ కేసు సోమవారం న్యాయమూర్తి టీ.రాజేంద్రన్ సమక్షంలో విచారణకు వచ్చింది. నటుడు శింబు తరపున న్యాయవాది ముత్తు రామసామి, పోలీసుల తరపున హాజరైన న్యాయవాది ముహమదు రాయాజుద్ధీన్ హాజరయ్యారు. వాదోపవాదాలు విన్న తరువాత న్యాయమూర్తి బీప్ సాంగ్‌ను దీంతో ఆ పాటను ఇంటర్నెట్, ఫేస్బుక్లో ప్రసారం కాకుండా చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి ఆదేశించారు.అదే విధంగా శింబుకు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేయడానికి నిరాకరించారు. ఆ ప్రముఖ నటుడు ఎవరు? కాగా శింబు రాసి, పాడిన బీప్ సాంగ్‌కు సంగీత దర్శకుడు అనిరుద్ బాణీలు కట్టినట్లు దాన్ని స్నేహం కోసం, ఆకతాయితనంగానూ తన సన్నిహిత మిత్రుడైన ప్రముఖ నటుడికి పంపినట్లు ఆయన ఆ పాటను సీరియస్‌గా తీసుకోకుండా వాట్సాప్ లో పోస్ట్ చేసినట్లు సమాచారం. పోలీసులు ఇప్పుడు ఆ కోణంలో దర్యాప్తును వేగవంతం చేస్తున్నట్లు తెలిసింది. ఇంతకీ ఆ ప్రముఖ నటుడెవరన్న అంశం కోలీవుడ్‌లో కలకలం రేకెత్తిస్తోంది. -
శింబు పాటలో మంచి పదాలూ ఉన్నాయి
శింబు పాటలో మంచి పదాలు ఉన్నాయనీ, వాటిని పక్కన పెట్టి మాటలు లేని బీప్ అంశాన్ని తెరపైకి తెచ్చి రాద్ధాంతం చేస్తున్నారని ఆయన తండ్రి టీ రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వాట్స్‌యాప్‌లో ఒక ప్రకటన విడుదల చేస్తూ శింబుపై కావాలనే కొందరు కుట్ర పన్ని దుష్ర్పచారానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. తాను మహిళలను ఉన్నతంగా చూపిస్తూ పలు చిత్రాలు రూపొందించాననీ, తనకు మహిళలపై చాలా గౌరవం ఉందని, అదే మర్యాద శింబుకు ఉందని అన్నారు. తను స్త్రీలను ఏనాడు అగౌరవ పరచలేదని అన్నారు. మహిళా సమాజం మనోభావాలు దెబ్బతిన్నాయని భావిస్తే తాను వారికి క్షమాపణలు చెప్పుకుంటున్నానన్నారు. చట్ట నిబంధనలు తెలియవు నటుడు శింబు ఒక టీవీ ఛానల్‌కు బేటీ ఇస్తూ తాను 30 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో ఉన్నానన్నారు. సినిమా మినహా తనకేమీ తెలియదనీ అదేవిధంగా చట్ట నిబంధనలు తనకు తె లియవని అ న్నారు. ఆ కష్ట కాలంలో తన కు అండగా నిలబడిన తన తల్లిదండ్రుల కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు. తాను పాటను కావాలని వాట్స్‌యాప్‌లో పోస్ట్ చేయలేదని అందువల్ల తనను విమర్శించడం సబబు కాదని అన్నారు. తప్పుగా భావిస్తే క్షమించమని కోరుకుంటున్నానని అన్నారు. రెండు కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ శింబు సోమవారం చెన్నై హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.అయితే ఆ పిటీషన్‌పై ఈ నెల 23న విచారణ జగపనున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది. శింబుపై ఫిర్యాదులను, ఆర దోళనలను భరించలేక ఆయన ఇంటి ముందు సోమవారం నలుగురు ఆయన అభిమానులు ఆత్మహత్యకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. నడిగర్‌సంఘం ఖండన శింబు చర్యల్ని నడిగర్ సంఘం ఖండించింది. దీని గురించి ఒక ప్రకటన విడుదల చేస్తూ సినిమా అన్నది కళకు, కోట్లాది రూపాయల వ్యాపారానికి చిరునామా అన్నారు. అలాంటి సినీ రంగంలో తప్పు చేస్తే చింతించడం, క్షమాపణ కోరడం చేయాలని పేర్కొన్నారు. శింబుపై సోమవారం మరో రెండు కేసులు నమోదు కావడం విశేషం. -
ప్రాచుర్యానికి మనమే కారణం
ఏ విషయమైనా ప్రాచుర్యంలోకి రావడానికి మనమే కారణం అన్నారు సీనియర్ నటి స్నేహ. బీప్ సాంగ్‌గా చెప్పబడుతున్న నటుడు శింబు రాసి, పాడగా సంగీత దర్శకుడు అనిరుద్ బాణీలు కట్టినట్లు ప్రచారంలో కలకలం సృష్టిస్తున్న పాటపై మహిళా సంఘాలు మండిపడుతున్న విషయం తెలిసిందే. శింబు ,అనిరుద్‌లపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో పలు కేసులు నమోదవుతున్నాయి. పలువురు సినీ ప్రముఖుల నుంచి విమర్శలు రావడంతో బీప్ పాట తమిళనాట ప్రకంపనలు సృష్టిస్తోంది.దీంతో ఆ పాటను వినని వారికి కూడా ఇప్పుడు వినాలనే ఆకాంక్ష అధికం అవుతోంది. ఆ బీప్ సాంగ్ ఇంతకు ముందుకన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువగా వాట్స్‌యాప్‌లో హల్చల్ చేయడం గమనార్హం. మనమే కారణం ఈ విషయంపై నటి స్నేహ స్పందించారు. ఒక పాట ప్రాచుర్యం పొందడానికి మనమే కారణం అన్నారు. ఇంతకు ముందు స్త్రీలను గౌరవించే వారి ఘనతను చాటే పాటలు చాలా వచ్చాయి. అదే విధంగా ఆ మధ్య అడిడా అవళ్(కొట్టరా ఆమెను) లాంటి మహిళలను కించపరచే స్థాయికి మన పాటలు పడిపోయాయి. వాటి గురించి ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. ఇప్పుడు మనం ఏమీ చేయలేని పరిస్థితి అని పేర్కొన్నారు. ఒక పాట గురించి పదే పదే చర్చించడం వల్ల దానికి కచ్చితంగా ప్రాచుర్యం లభించడానికి మనమే కారణం అవుతున్నాం అన్నారు. దాని విజయానికి దోహదపడుతున్నామనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన బీప్ పాట గురించి తనను చాలా మంది అడిగారని, నిజానికి తానా పాటను వినలేదని చెప్పారు. ఇప్పుడా పాట వినాలనే ఆసక్తి తనకూ కలుగుతోందన్నారు. అయితే ఆ పాట అసభ్యపదజాలాలతో కూడిన పాట అని తెలిసిందన్నారు. అది మంచి పాట కాదని తెలిసిన తరువాత అసలు దాని గురించి చర్చించకుండా ఉండడమే ఉత్తమం అన్నారు. అదే విధంగా దానికింత ప్రాచుర్యం వచ్చేది కాదు కూడా అన్నారు. ఒక మహిళగా చెప్పాలంటే ఇప్పుడు చిన్న పిల్లలు కూడా పాటలు వింటున్నారు. కాబట్టి పాటల్లో అసభ్య పదాలు లేకుండా ఉంటే బాగుంటుంది అని స్నేహ అన్నారు. -
తమిళనాట ‘బీప్ సాంగ్’ దుమారం
తమిళనాడులో నిన్న మొన్నటి వరకూ తుపాను కల్లోలం కలిగిస్తే, తాజాగా ‘బీప్’ సాంగ్ దుమారం రేపుతోంది. ఇది ఏ సినిమాలోని పాటా కాదు. శింబు సరదాగా రాసుకున్న ఈ పాటకు అనిరుథ్ స్వరాలందించాడు. ఈ పాటను శింబూనే పాడాడు. ఆడవాళ్ల గురించి ఈ పాటలో అభ్యంతరకర పదాలు ఉండటంతో దుమారం రేగింది. ‘శింబు, అనిరుథ్ ఎక్కడున్నా వెంటనే అరెస్ట్ చేయండి’ అంటూ తమిళనాడుకు చెందిన కొన్ని మహిళా సంఘాలు పోలీసులను ఆశ్రయించాయి. ఫలితంగా శింబు, అనిరుథ్ల మీద పలు కేసులు నమోదయ్యాయి. దాంతో చెన్నై హైకోర్టులో శింబు ముందస్తు బెయిలుకు అపీల్ చేసుకున్నాడు. అనిరుథ్ విదేశాల్లో మ్యూజిక్ షోస్‌తో బిజీగా ఉన్నాడు. అతను చెన్నైలో అడుగుపెట్టగానే ఎయిర్‌పోర్ట్‌లోనే అరెస్ట్ చేయడానికి పోలీసులు ప్లాన్ చేసుకున్నారట. ఇది ‘బ్రేకప్’ పాట ఇంతకీ ఈ పాట దేని గురించి? లవ్ ఫెయిల్యూర్లో ఉన్నవాళ్లు పాడుకోదగ్గ పాట ఇది. శింబు లవ్‌లో ఫెయిల్ అయినప్పుడు రాసుకున్నాడట. నయనతారతో ప్రేమాయణం ముగిశాక రాసుకున్నాడో, హన్సికతో బ్రేకప్ అయ్యాక రాశాడో అనే విషయం స్పష్టంగా బయటికి రాలేదు. ముఖ్యంగా పాటలో ఉన్న ఓ పదం బాగా అభ్యంతరకరమైనదిగా తెలుస్తోంది. ఆ పదాన్ని మ్యూట్ చేసేశారు. విచిత్రం ఏంటంటే... ‘అసలీ పాటకు నేను ట్యూన్ చేయలేదు. గతంలో శింబు, నా కాంబినేషన్లో వచ్చిన పాట ట్యూన్‌ని ఎవరో ఇలా మలిచి, లేనిపోని పదాలు తగిలించి విడుదల చేశారు’ అని అనిరుథ్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. ఈ పాటకూ, శింబూకి అస్సలు సంబంధమే లేదని శింబు తండ్రి టి. రాజేందర్ ప్రకటించారు. శింబు మాత్రం ‘ఈ పాటకూ, అనిరుథ్కీ సంబంధం లేదనీ, ఎప్పుడో తాను రాసుకున్న పాట ఇది’ అని చెప్పడం విశేషం. పూర్తి కాని పాటను ఎవరో అభ్యంతరకర పదాలతో పూర్తి చేసి మరీ యూ ట్యూబ్‌లో విడుదల చేశారనీ శింబు, అనిరుథ్ ఆరోపిస్తున్నారు. ‘బీప్ సాంగ్’ విషయంలో తాను క్షమాపణలు కోరననీ, కావాలని ఎవరో తస్కరించి విడుదల చేసిన పాటకు తనను తప్పుబట్టడం సరికాదనీ శింబు ఓ న్యూస్ చానల్‌తో మాట్లాడుతూ పేర్కొన్నాడు. అది మాత్రమే కాదు.. ‘ఆడవాళ్లను తన్నండి... తిట్టండి..’ అంటూ ఈ మధ్యకాలంలో వచ్చిన ఇతర పాటలను వదిలేసి, ఆడవాళ్లను సపోర్ట్ చేసే విధంగా ఉన్న ‘బీప్’ సాంగ్‌ను పూర్తిగా వినకుండా వివాదం చేయడం అన్యాయమని శింబు పేర్కొనడం చర్చనీయాంశమైంది. ధనుష్ హీరోగా నటించిన ఓ చిత్రంలో అతను పాడిన పాటలో అలాంటి పదాలు ఉన్నాయి. మరి.. శింబు పరోక్షంగా విసిరిన ఈ విసుర్లుకు ధనుష్ స్పందిస్తే, మరో వివాదం మొదలుకావడం ఖాయం. ఈ బీప్ సాంగ్ వ్యవహారం శింబు, అనిరుథ్కి మాత్రమే తలనొప్పిగా తయారవ్వలేదు. ఈ పాట కారణంగా తమిళ పరిశ్రమలో ఉన్న పలువురు ప్రముఖులు సైతం వివాదాలపాలయ్యారు. ‘బీప్..’ వివాదంలో ప్రముఖులు! చెన్నై తుపాను బాధితులకు సహాయం చేసినవారిని అభినందించడం కోసం ఏర్పాటైన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఇళయరాజా దగ్గర ఈ పాట గురించి ఓ పాత్రికేయుడు ప్రస్తావిస్తే, ‘‘నేనీ ఫంక్షన్‌కి వచ్చింది ఈ పాట గురించి మాట్లాడటానికేనా?’’ అని రాజా సార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో పాత్రికేయ సంఘాలు ఇళయరాజాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇళయరాజా సోదరుడు గంగై అమరన్ మరో వివాదానికి తెరతీశారు. సూపర్ స్టార్ రజనీకాంత్‌కు అనిరుథ్ బంధువు కాబట్టి, ఈ పాట గురించి స్పందించమని ఆయన్ను అడగొచ్చుగా అంటూ రజనీని ఇరుకుల్లో పడేసేలా మాట్లాడారు. మరోవైపు తమిళనాడు నటీనటుల సంఘం మాజీ అధ్యక్షుడు శరత్‌కుమార్ అయితే తాజా కమిటీపై మండిపడ్డారు. శింబు పాడిన అభ్యంతరకర పాటకు నటీనటుల సంఘం ఎందుకు వివరణ కోరడంలేదని ఆయన ప్రశ్నించారు. విశేషం ఏంటంటే... ఇటీవల జరిగిన నటీనటుల సంఘంలో శరత్‌కుమార్ ప్యానెల్లోనే శింబు పోటీ చేశారు. ఇంకా పలువురు ప్రముఖ రచయితలు ఈ పాట పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి.. ఈ వివాదం ఎందాకా వెళుతుందో... ఏమో? -
టీఆర్నూ వదలని బీప్ సాంగ్
సరదాగా అనుకున్న విషయాలు ఒక్కోసారి తీవ్ర పరిణామాలను చూపుతాయి. కాలక్షేపం కోసం చేసిన పనులు అనూహ్యంగా కాళ్లకు చుట్టుకుంటాయి. చెరపకురా చెడేవు అన్న నానుడి తరహాలోనే నవ్వకురా నలుగురిలో నానేవు అనేలా తయారయ్యింది నటుడు శింబు, సంగీత దర్శకుడు అనిరుద్‌ల పరిస్థితి. శింబు,అనిరుద్ ఊసుపోక రూపొందించిన ఒక్క పాట వారి కెరీర్‌కే పెద్ద మచ్చగా మారిం ది. ఆడ వారిని అవమానించే విధంగా అసభ్య పదజాలాలతో కూడిన ఆ పాటను మహిళా లోకమే కాకుండా సభ్య సమాజమే అసహ్యహించుకుంటోంది. పలువురు శింబు,అనిరుద్ చర్యల్ని ఖండిస్తున్నారు. ఫిర్యాదుల పర్యంతం మేరకు చట్టం తన పని తాను చేయడానికి సన్నద్ధం అవుతోంది. ఇక శింబు, అనిరుద్ రూపొందించిన పాటగా చెప్పబడే ఆ బీప్ సాంగ్ ఇప్పటికీ సోషల్ నెట్ వర్క్స్‌లో హల్ చల్ చేస్తూనే ఉంది. అవకాశాలు వెనక్కి శింబు నటించిన ఇదు నమ్మ ఆళు చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని చాలా కాలంగా విడుదలకు నోచుకోకుండా ఉండి పోయింది. తాజాగా నటిస్తున్న అచ్చం ఎంబదు మడమయడా చిత్రం చాలా కాలంగా నిర్మాణంలోనే ఉంది. తాజాగా చేయాల్సిన ఒక చిత్రం సందిగ్ధంలో పడింది. త్రిష ఇల్లన్నా నయనతార చిత్ర దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ తన తదుపరి చిత్రాన్ని శింబు హీరోగా చేయడానికి సిద్ధమైనట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితిలో శింబు బీప్ సాంగ్ ప్రకంపనలు సృష్టించడంతో ఆ చిత్ర నిర్మాతలు ఇప్పుడు ఆలోచనల్లో పడ్డట్టు సమాచారం. ఇక అనిరుద్ పరిస్థితి అంతకంటే దారణంగా మారింది. ఈ యువ సంగీత దర్శకుడి సూర్య చిత్రం సింగం-3 కి సంగీతాన్ని అందించే అవకావం వచ్చింది. అయితే తన బీప్ సాంగ్ రగడ కారణంగా ఆయన్ని ఆ చిత్రం నుంచి తొలగించారు. ఇదే విధంగా అనిరుద్‌కు మరో రెండు చిత్రాలు పోయినట్లు తెలిసింది. తండ్రిని వదలని బీప్ సాంగ్ పాట రాసి పాడిన శింబును బాణీలు కట్టిన అనిరుద్‌ను కష్టాల్లోకి నెట్టిన బీప్ సాంగ్ శింబు తండ్రి టీ.రాజేందర్‌ను వదలలేదు. 10 ఎండ్రదుకుళ్ చిత్రం తరువాత ఆ చిత్ర దర్శకుడు విజయ్ మిల్టన్ టీ.రాజేందర్ కథానాయకుడిగా చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. అయితే తాజా పరిణామాలతో విజయ్ మిల్టన్ తన చిత్రం నుంచి టీఆర్ను తొలగించినట్లు కోలీవుడ్ వర్గాల టాక్. ఒక్కపాట ఎందరి కెరీర్లకు ఎఫెక్ట్ ఇచ్చిందో చూశారా? ఇది శింబు,అనిరుద్‌లకు అవసరమా! -
'ఆ పాట నేను విడుదల చేయలేదు'
చెన్నై: బీప్ పాటను తాను విడుదల చేయలేదని తమిళ హీరో శింబు తెలిపాడు. అనిరుధ్ రవిచందర్ స్వరపరిచిన 'ఎన్న పీ***** లవ్ పన్ రోమ్' పాటలో అసభ్యకర పదాలు ఉండడంతో బీప్ సాంగ్ గా పేర్కొంటున్నారు. ఈ పదాలు స్పష్టంగా విన్పిస్తుండడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. ఈ పాట బయటకు రావడంపై గీత రచయిత చారు నివేదిత విస్మయం వ్యక్తం చేశాడు. భారీ వర్షాలతో చెన్నై, తమిళనాడులోని కొన్ని జిల్లాలు అతలాకుతలమైన తరుణంలో బీప్ సాంగ్ ను విడుదల చేయడాన్ని అతడు ఖండించాడు. అయితే తాను రాసిన ఈ పాటలో ప్రయోగించిన పదాలపై తనకు ఎటువంటి అభ్యంతరం లేదన్నాడు. ఈ పాటను తాను విడుదల చేయలేదని శింబు వివరణయిచ్చాడు. అకారణంగా తనను నిందించడం తగదని అన్నాడు. ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్న ఈ పాట అసభ్యకరంగా ఉందని శ్రోతలు మండిపడుతున్నారు. శింబు, అనిరుధ్ లపై మహిళా హక్కుల సంఘం 'ఆల్ ఇండియా డెమొక్రటిక్ వుమన్స్ అసోసియేషన్' కోయంబత్తూర్ లో ఫిర్యాదు చేసింది. ఈ వివాదంపై మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఇంకా స్పందించలేదు. ప్రస్తుతం అతడు టొరంటోలో ఉన్నాడు.