శింబుపై కేసు వాపస్ | return case on shimbhu | Sakshi
Sakshi News home page

శింబుపై కేసు వాపస్

Published Tue, Dec 29 2015 2:44 AM | Last Updated on Sun, Sep 3 2017 2:42 PM

శింబుపై కేసు వాపస్

శింబుపై కేసు వాపస్

నటుడు శింబు బీప్ సాంగ్ కలకలం కొనసాగుతూనే ఉంది. మహిళలను అవమానించే విధంగా అసభ్య పదజాలాలతో పాట రాసి, పాడారంటూ నటుడు శింబుపై తమిళనాడులోని పలు మహిళా సంఘాల నిర్వాహకులు మండిపడుతూ ఆందోళనకు దిగుతున్న విషయం తేలిసిందే. ఈ నేపథ్యంలో శింబుపై కోవై, చెన్నైలో పలు విభాగాల్లో పోలీసులు కేసులు నమోదు చేసి, ఆయన్ని అరెస్ట్ చేసే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు.
 
  దీంతో శింబు పరారీలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే శింబు ఎక్కడికి పారిపోలేదనీ తమిళనాడులోనే ఉన్నాడనీ ఆయన తల్లిదండ్రులు టి.రాజేందర్, ఉషారాజేందర్ అంటున్నారు. శింబు మాత్రం పోలీసులకు దొరకడం లేదు. తను ముందస్తు బెయిల్ కోసం చెన్నై హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై జనవరి నాలుగున విచారణ జరగనుంది. శింబుపై పాట్టాలీ మక్కల్ కట్చికి చెందిన వెంకటేశన్ అనే వ్యక్తి చెన్నై సైదాపేట కోర్టులో బీప్ సాంగ్ వ్యవహారంలో పిటీషన్ దాఖలు చేసిన విషయం తేలిసిందే. దానిపై సోమవారం విచరణ జరగనున్న నేపథ్యంలో వెంకటేశన్ తన పిటీషన్‌ను వాపస్ తీసుకున్నారు. పార్టీ అధినాయకత్వం ఆదేశాల మేరకే ఆయన కేసును వాపస్ తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది.
 
 శింబుకు మద్దతుగా ఆందోళన
 నటుడు శింబుకు మద్దతుగా ఇప్పటికే కొందరు సినీ ప్రముఖులు గొంత్తెతిన నేపథ్యంలో అభిమానులు ఆయనకు అనుకూలంగా ఆందోళనకు దిగుతుండడం గమనార్హం. సోమవారం ఉదయం 50కి పైగా శింబు అభిమానులు సతీష్ హరికరన్ ఆధ్వర్యంలో స్థానిక నుంగంబాక్కం సమీపంలోని వళ్లువర్‌కూటం వద్ద ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. సమాచారం అందిన పోలీసులు వెంటనే అక్కడకు వచ్చి ఆందోళన కార్యక్రమానికి అనుమతి లేదంటూ వారందరినీ పంపించేశారు. దీంతో అభిమానులందరూ టీనగర్, హిందీ ప్రచారసభ వీధిలోని శింబు ఇంటి ముందు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగాా సతీష్ హరికరన్ మాట్లాడుతూ శింబు పాటను ఎవరో తస్కరించి ఇంటర్నెట్‌లో ప్రసారం చేశారన్నారు. వారెవరో పోలీసులు కనిపెట్టి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement