టీఆర్‌నూ వదలని బీప్ సాంగ్
సరదాగా అనుకున్న విషయాలు ఒక్కోసారి తీవ్ర పరిణామాలను చూపుతాయి. కాలక్షేపం కోసం చేసిన పనులు అనూహ్యంగా కాళ్లకు చుట్టుకుంటాయి. చెరపకురా చెడేవు అన్న నానుడి తరహాలోనే నవ్వకురా నలుగురిలో నానేవు అనేలా తయారయ్యింది నటుడు శింబు, సంగీత దర్శకుడు అనిరుద్‌ల పరిస్థితి. శింబు,అనిరుద్ ఊసుపోక రూపొందించిన ఒక్క పాట వారి కెరీర్‌కే పెద్ద మచ్చగా మారిం ది. ఆడ వారిని అవమానించే విధంగా అసభ్య పదజాలాలతో కూడిన ఆ పాటను మహిళా లోకమే కాకుండా సభ్య సమాజమే అసహ్యహించుకుంటోంది. పలువురు శింబు,అనిరుద్ చర్యల్ని ఖండిస్తున్నారు. ఫిర్యాదుల పర్యంతం మేరకు చట్టం తన పని తాను చేయడానికి సన్నద్ధం అవుతోంది. ఇక శింబు, అనిరుద్ రూపొందించిన పాటగా చెప్పబడే ఆ బీప్ సాంగ్ ఇప్పటికీ సోషల్ నెట్ వర్క్స్‌లో హల్ చల్ చేస్తూనే ఉంది.
అవకాశాలు వెనక్కి
శింబు నటించిన ఇదు నమ్మ ఆళు చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని చాలా కాలంగా విడుదలకు నోచుకోకుండా ఉండి పోయింది. తాజాగా నటిస్తున్న అచ్చం ఎంబదు మడమయడా చిత్రం చాలా కాలంగా నిర్మాణంలోనే ఉంది. తాజాగా చేయాల్సిన ఒక చిత్రం సందిగ్ధంలో పడింది. త్రిష ఇల్లన్నా నయనతార చిత్ర దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ తన తదుపరి చిత్రాన్ని శింబు హీరోగా చేయడానికి సిద్ధమైనట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితిలో శింబు బీప్ సాంగ్ ప్రకంపనలు సృష్టించడంతో ఆ చిత్ర నిర్మాతలు ఇప్పుడు ఆలోచనల్లో పడ్డట్టు సమాచారం. ఇక అనిరుద్ పరిస్థితి అంతకంటే దారణంగా మారింది. ఈ యువ సంగీత దర్శకుడి సూర్య చిత్రం సింగం-3 కి సంగీతాన్ని అందించే అవకావం వచ్చింది. అయితే తన బీప్ సాంగ్ రగడ కారణంగా ఆయన్ని ఆ చిత్రం నుంచి తొలగించారు. ఇదే విధంగా అనిరుద్‌కు మరో రెండు చిత్రాలు పోయినట్లు తెలిసింది.
తండ్రిని వదలని బీప్ సాంగ్
పాట రాసి పాడిన శింబును బాణీలు కట్టిన అనిరుద్‌ను కష్టాల్లోకి నెట్టిన బీప్ సాంగ్ శింబు తండ్రి టీ.రాజేందర్‌ను వదలలేదు. 10 ఎండ్రదుకుళ్ చిత్రం తరువాత ఆ చిత్ర దర్శకుడు విజయ్ మిల్టన్ టీ.రాజేందర్ కథానాయకుడిగా చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. అయితే తాజా పరిణామాలతో విజయ్ మిల్టన్ తన చిత్రం నుంచి టీఆర్‌ను తొలగించినట్లు కోలీవుడ్ వర్గాల టాక్. ఒక్కపాట ఎందరి కెరీర్లకు ఎఫెక్ట్ ఇచ్చిందో చూశారా? ఇది శింబు,అనిరుద్‌లకు అవసరమా!