ఎట్టకేలకు పోలీసుల ముందుకు బీప్ సాంగ్ అనిరుధ్
'బీప్ సాంగ్' వివాదంలో ఇరుక్కున్న సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ పోలీసుల వద్ద హాజరయ్యాడు. నటుడు శింబుతో ఈ పాట పాడించి ఒక్కసారిగా వివాదాలు మూటగట్టుకున్న అనిరుధ్.. ఇన్నాళ్లుగా విదేశాల్లో ఉన్న విషయం తెలిసిందే. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో రేస్ కోర్స్ రోడ్డు పోలీసు స్టేషన్ వద్ద హాజరైన అనిరుధ్.. రెండు పేజీల ప్రకటన సమర్పించాడు. ఆ పాటను తాను కంపోజ్ చేయలేదనే మరో సారి చెప్పాడు. కోయంబత్తూరులో పోలీసుల వద్ద హాజరై తన ప్రకటన ఇచ్చానని వాట్సప్ మెసేజి ద్వారా మీడియాకు చెప్పాడు. ఆలిండియా డెమొక్రాటిక్ ఉమెన్ అసోసియేషన్ (ఐద్వా) వాళ్లు ఈ పాట విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ పాటలో మహిళలను కించపరిచేలా అసభ్య లిరిక్స్ ఉన్నాయని ఐద్వా మండిపడిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు కేసు నమోదుచేసి శింబు, అనిరుధ్ ఇద్దరినీ డిసెంబర్ 19న హాజరు కావాల్సిందిగా ఆదేశించారు. అయితే శింబు వాళ్లను నెల రోజుల గడువు కోరాడు. అనిరుధ్ మాత్రం తాను ఆ పాటను కంపోజ్ చేయలేదని, అందవల్ల తనపై ఎఫ్ఐఆర్ ఎత్తేయాలని అడిగాడు. పోలీసులు దాన్ని నిరాకరించి, జనవరి 2న హాజరు కావాలన్నారు. అప్పుడు మళ్లీ అనిరుధ్ 15 రోజుల గడువు కోరాడు. తాను చెన్నై వరద బాధితుల సహాయార్థం విదేశాల్లో ప్రదర్శనలు చేస్తున్నానని, వచ్చాక హాజరవుతానని చెప్పాడు.