ప్రాచుర్యానికి మనమే కారణం
ఏ విషయమైనా ప్రాచుర్యంలోకి రావడానికి మనమే కారణం అన్నారు సీనియర్ నటి స్నేహ. బీప్ సాంగ్‌గా చెప్పబడుతున్న నటుడు శింబు రాసి, పాడగా సంగీత దర్శకుడు అనిరుద్ బాణీలు కట్టినట్లు ప్రచారంలో కలకలం సృష్టిస్తున్న పాటపై మహిళా సంఘాలు మండిపడుతున్న విషయం తెలిసిందే. శింబు ,అనిరుద్‌లపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో పలు కేసులు నమోదవుతున్నాయి. పలువురు సినీ ప్రముఖుల నుంచి విమర్శలు రావడంతో బీప్ పాట తమిళనాట ప్రకంపనలు సృష్టిస్తోంది.దీంతో ఆ పాటను వినని వారికి కూడా ఇప్పుడు వినాలనే ఆకాంక్ష అధికం అవుతోంది. ఆ బీప్ సాంగ్ ఇంతకు ముందుకన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువగా వాట్స్‌యాప్‌లో హల్‌చల్ చేయడం గమనార్హం.
మనమే కారణం ఈ విషయంపై నటి స్నేహ స్పందించారు. ఒక పాట ప్రాచుర్యం పొందడానికి మనమే కారణం అన్నారు. ఇంతకు ముందు స్త్రీలను గౌరవించే వారి ఘనతను చాటే పాటలు చాలా వచ్చాయి. అదే విధంగా ఆ మధ్య అడిడా అవళ్(కొట్టరా ఆమెను) లాంటి మహిళలను కించపరచే స్థాయికి మన పాటలు పడిపోయాయి. వాటి గురించి ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. ఇప్పుడు మనం ఏమీ చేయలేని పరిస్థితి అని పేర్కొన్నారు. ఒక పాట గురించి పదే పదే చర్చించడం వల్ల దానికి కచ్చితంగా ప్రాచుర్యం లభించడానికి మనమే కారణం అవుతున్నాం అన్నారు. దాని విజయానికి దోహదపడుతున్నామనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఇక ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన బీప్ పాట గురించి తనను చాలా మంది అడిగారని, నిజానికి తానా పాటను వినలేదని చెప్పారు. ఇప్పుడా పాట వినాలనే ఆసక్తి తనకూ కలుగుతోందన్నారు. అయితే ఆ పాట అసభ్యపదజాలాలతో కూడిన పాట అని తెలిసిందన్నారు. అది మంచి పాట కాదని తెలిసిన తరువాత అసలు దాని గురించి చర్చించకుండా ఉండడమే ఉత్తమం అన్నారు. అదే విధంగా దానికింత ప్రాచుర్యం వచ్చేది కాదు కూడా అన్నారు. ఒక మహిళగా చెప్పాలంటే ఇప్పుడు చిన్న పిల్లలు కూడా పాటలు వింటున్నారు. కాబట్టి పాటల్లో అసభ్య పదాలు లేకుండా ఉంటే బాగుంటుంది అని స్నేహ అన్నారు.