తమిళనాట ‘బీప్ సాంగ్’ దుమారం
తమిళనాడులో నిన్న మొన్నటి వరకూ తుపాను కల్లోలం కలిగిస్తే, తాజాగా ‘బీప్’ సాంగ్ దుమారం రేపుతోంది. ఇది ఏ సినిమాలోని పాటా కాదు. శింబు సరదాగా రాసుకున్న ఈ పాటకు అనిరుథ్ స్వరాలందించాడు. ఈ పాటను శింబూనే పాడాడు. ఆడవాళ్ల గురించి ఈ పాటలో అభ్యంతరకర పదాలు ఉండటంతో దుమారం రేగింది. ‘శింబు, అనిరుథ్ ఎక్కడున్నా వెంటనే అరెస్ట్ చేయండి’ అంటూ తమిళనాడుకు చెందిన కొన్ని మహిళా సంఘాలు పోలీసులను ఆశ్రయించాయి. ఫలితంగా శింబు, అనిరుథ్‌ల మీద పలు కేసులు నమోదయ్యాయి. దాంతో చెన్నై హైకోర్టులో శింబు ముందస్తు బెయిలుకు అపీల్ చేసుకున్నాడు. అనిరుథ్ విదేశాల్లో మ్యూజిక్ షోస్‌తో బిజీగా ఉన్నాడు. అతను చెన్నైలో అడుగుపెట్టగానే ఎయిర్‌పోర్ట్‌లోనే అరెస్ట్ చేయడానికి పోలీసులు ప్లాన్ చేసుకున్నారట.
ఇది ‘బ్రేకప్’ పాట
ఇంతకీ ఈ పాట దేని గురించి? లవ్ ఫెయిల్యూర్‌లో ఉన్నవాళ్లు పాడుకోదగ్గ పాట ఇది. శింబు లవ్‌లో ఫెయిల్ అయినప్పుడు రాసుకున్నాడట. నయనతారతో ప్రేమాయణం ముగిశాక రాసుకున్నాడో, హన్సికతో బ్రేకప్ అయ్యాక రాశాడో అనే విషయం స్పష్టంగా బయటికి రాలేదు. ముఖ్యంగా పాటలో ఉన్న ఓ పదం బాగా అభ్యంతరకరమైనదిగా తెలుస్తోంది. ఆ పదాన్ని మ్యూట్ చేసేశారు. విచిత్రం ఏంటంటే... ‘అసలీ పాటకు నేను ట్యూన్ చేయలేదు. గతంలో శింబు, నా కాంబినేషన్‌లో వచ్చిన పాట ట్యూన్‌ని ఎవరో ఇలా మలిచి, లేనిపోని పదాలు తగిలించి విడుదల చేశారు’ అని అనిరుథ్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు.
ఈ పాటకూ, శింబూకి అస్సలు సంబంధమే లేదని శింబు తండ్రి టి. రాజేందర్ ప్రకటించారు. శింబు మాత్రం ‘ఈ పాటకూ, అనిరుథ్‌కీ సంబంధం లేదనీ, ఎప్పుడో తాను రాసుకున్న పాట ఇది’ అని చెప్పడం విశేషం. పూర్తి కాని పాటను ఎవరో అభ్యంతరకర పదాలతో పూర్తి చేసి మరీ యూ ట్యూబ్‌లో విడుదల చేశారనీ శింబు, అనిరుథ్ ఆరోపిస్తున్నారు. ‘బీప్ సాంగ్’ విషయంలో తాను క్షమాపణలు కోరననీ, కావాలని ఎవరో తస్కరించి విడుదల చేసిన పాటకు తనను తప్పుబట్టడం సరికాదనీ శింబు ఓ న్యూస్ చానల్‌తో మాట్లాడుతూ పేర్కొన్నాడు.
అది మాత్రమే కాదు.. ‘ఆడవాళ్లను తన్నండి... తిట్టండి..’ అంటూ ఈ మధ్యకాలంలో వచ్చిన ఇతర పాటలను వదిలేసి, ఆడవాళ్లను సపోర్ట్ చేసే విధంగా ఉన్న ‘బీప్’ సాంగ్‌ను పూర్తిగా వినకుండా వివాదం చేయడం అన్యాయమని శింబు పేర్కొనడం చర్చనీయాంశమైంది. ధనుష్ హీరోగా నటించిన ఓ చిత్రంలో అతను పాడిన పాటలో అలాంటి పదాలు ఉన్నాయి. మరి.. శింబు పరోక్షంగా విసిరిన ఈ విసుర్లుకు ధనుష్ స్పందిస్తే, మరో వివాదం మొదలుకావడం ఖాయం. ఈ బీప్ సాంగ్ వ్యవహారం శింబు, అనిరుథ్‌కి మాత్రమే తలనొప్పిగా తయారవ్వలేదు. ఈ పాట కారణంగా తమిళ పరిశ్రమలో ఉన్న పలువురు ప్రముఖులు సైతం వివాదాలపాలయ్యారు.
‘బీప్..’ వివాదంలో ప్రముఖులు!
చెన్నై తుపాను బాధితులకు సహాయం చేసినవారిని అభినందించడం కోసం ఏర్పాటైన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఇళయరాజా దగ్గర ఈ పాట గురించి ఓ పాత్రికేయుడు ప్రస్తావిస్తే, ‘‘నేనీ ఫంక్షన్‌కి వచ్చింది ఈ పాట గురించి మాట్లాడటానికేనా?’’ అని రాజా సార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో పాత్రికేయ సంఘాలు ఇళయరాజాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఇళయరాజా సోదరుడు గంగై అమరన్ మరో వివాదానికి తెరతీశారు. సూపర్ స్టార్ రజనీకాంత్‌కు అనిరుథ్ బంధువు కాబట్టి, ఈ పాట గురించి స్పందించమని ఆయన్ను అడగొచ్చుగా అంటూ రజనీని ఇరుకుల్లో పడేసేలా మాట్లాడారు. మరోవైపు తమిళనాడు నటీనటుల సంఘం మాజీ అధ్యక్షుడు శరత్‌కుమార్ అయితే తాజా కమిటీపై మండిపడ్డారు. శింబు పాడిన అభ్యంతరకర పాటకు నటీనటుల సంఘం ఎందుకు వివరణ కోరడంలేదని ఆయన ప్రశ్నించారు. విశేషం ఏంటంటే... ఇటీవల జరిగిన నటీనటుల సంఘంలో శరత్‌కుమార్ ప్యానెల్‌లోనే శింబు పోటీ చేశారు. ఇంకా పలువురు ప్రముఖ రచయితలు ఈ పాట పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి.. ఈ వివాదం ఎందాకా వెళుతుందో... ఏమో?