shimbhu
-
అదితిరావ్‌కు మళ్లీ లక్కీచాన్స్!
తమిళసినిమా: మణిరత్నం చిత్రంలో మరోసారి నటించడానికి నటి అదితిరావ్ హైదరి సిద్ధమవుతోంది. ఇంతకు ముందు మణరత్నం తెరకెక్కించిన కాట్రువెలియిడై చిత్రంలో కార్తీకి జంటగా నటించిన విషయం తెలిసిందే. అయితే ఆ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. అయినా తన తాజా చిత్రంలో అదితిరావ్‌ను మణిరత్నం తీసుకున్నారనేది తాజా సమాచారం. ఈ ప్రఖ్యాత దర్శకుడు తన తాజా చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. కథా చర్చల కోసమే చాలా కాలం తీసుకున్నారు. అంతే కాదు చిత్రంలో పలువురు స్టార్ హీరోలను నటింçపజేస్తున్నారు. ఈ మల్టీస్టారర్ చిత్రంలో ఇప్పటికే విజయ్‌సేతుపతి, శింబు, ఫాహద్ ఫాజిల్, అరవిందస్వామి, జ్యోతిక, ఐశ్వర్యరాజేశ్‌లను ఎంపిక చేశారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ అదితిరావ్ కూడా ఈ జాబితాలో చేరిందని సమాచారం. అయితే ఈ అమ్మడు చిత్రంలో ఏ హీరోతో రొమాన్స్ చేయనుందన్నది తెలియాల్సి ఉంది. అదే విధంగా చిత్ర వివరాలను దర్శకుడు మణిరత్నం ఇంకా అధికారిక పూర్వంగా ప్రకటించలేదన్నది గమనార్హం. ఇక సంగీత మాంత్రికుడు ఏఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందించనున్న ఈ చిత్రాన్ని లైకా సంస్థ ఫస్ట్‌కాపీ విధానంతో మణిరత్నం మెడ్రాస్ టాకీస్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని నిర్మించడానికి సిద్ధమైంది. అయితే గత డిసెంబర్లోనే ఈ భారీ చిత్రం సెట్ పైకి వెళ్లాల్సింది. కారణాలేమైనా షూటింగ్ ఆలస్యమైంది. త్వరలోనే చిత్రీకరణకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రం కోసం శింబు గెడ్డం, మీసం పెంచి చాలా డిఫరెంట్‌గా కనిపించడానికి రెడీ అయ్యారు. -
తమిళనాట ‘బీప్ సాంగ్’ దుమారం
తమిళనాడులో నిన్న మొన్నటి వరకూ తుపాను కల్లోలం కలిగిస్తే, తాజాగా ‘బీప్’ సాంగ్ దుమారం రేపుతోంది. ఇది ఏ సినిమాలోని పాటా కాదు. శింబు సరదాగా రాసుకున్న ఈ పాటకు అనిరుథ్ స్వరాలందించాడు. ఈ పాటను శింబూనే పాడాడు. ఆడవాళ్ల గురించి ఈ పాటలో అభ్యంతరకర పదాలు ఉండటంతో దుమారం రేగింది. ‘శింబు, అనిరుథ్ ఎక్కడున్నా వెంటనే అరెస్ట్ చేయండి’ అంటూ తమిళనాడుకు చెందిన కొన్ని మహిళా సంఘాలు పోలీసులను ఆశ్రయించాయి. ఫలితంగా శింబు, అనిరుథ్ల మీద పలు కేసులు నమోదయ్యాయి. దాంతో చెన్నై హైకోర్టులో శింబు ముందస్తు బెయిలుకు అపీల్ చేసుకున్నాడు. అనిరుథ్ విదేశాల్లో మ్యూజిక్ షోస్‌తో బిజీగా ఉన్నాడు. అతను చెన్నైలో అడుగుపెట్టగానే ఎయిర్‌పోర్ట్‌లోనే అరెస్ట్ చేయడానికి పోలీసులు ప్లాన్ చేసుకున్నారట. ఇది ‘బ్రేకప్’ పాట ఇంతకీ ఈ పాట దేని గురించి? లవ్ ఫెయిల్యూర్లో ఉన్నవాళ్లు పాడుకోదగ్గ పాట ఇది. శింబు లవ్‌లో ఫెయిల్ అయినప్పుడు రాసుకున్నాడట. నయనతారతో ప్రేమాయణం ముగిశాక రాసుకున్నాడో, హన్సికతో బ్రేకప్ అయ్యాక రాశాడో అనే విషయం స్పష్టంగా బయటికి రాలేదు. ముఖ్యంగా పాటలో ఉన్న ఓ పదం బాగా అభ్యంతరకరమైనదిగా తెలుస్తోంది. ఆ పదాన్ని మ్యూట్ చేసేశారు. విచిత్రం ఏంటంటే... ‘అసలీ పాటకు నేను ట్యూన్ చేయలేదు. గతంలో శింబు, నా కాంబినేషన్లో వచ్చిన పాట ట్యూన్‌ని ఎవరో ఇలా మలిచి, లేనిపోని పదాలు తగిలించి విడుదల చేశారు’ అని అనిరుథ్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. ఈ పాటకూ, శింబూకి అస్సలు సంబంధమే లేదని శింబు తండ్రి టి. రాజేందర్ ప్రకటించారు. శింబు మాత్రం ‘ఈ పాటకూ, అనిరుథ్కీ సంబంధం లేదనీ, ఎప్పుడో తాను రాసుకున్న పాట ఇది’ అని చెప్పడం విశేషం. పూర్తి కాని పాటను ఎవరో అభ్యంతరకర పదాలతో పూర్తి చేసి మరీ యూ ట్యూబ్‌లో విడుదల చేశారనీ శింబు, అనిరుథ్ ఆరోపిస్తున్నారు. ‘బీప్ సాంగ్’ విషయంలో తాను క్షమాపణలు కోరననీ, కావాలని ఎవరో తస్కరించి విడుదల చేసిన పాటకు తనను తప్పుబట్టడం సరికాదనీ శింబు ఓ న్యూస్ చానల్‌తో మాట్లాడుతూ పేర్కొన్నాడు. అది మాత్రమే కాదు.. ‘ఆడవాళ్లను తన్నండి... తిట్టండి..’ అంటూ ఈ మధ్యకాలంలో వచ్చిన ఇతర పాటలను వదిలేసి, ఆడవాళ్లను సపోర్ట్ చేసే విధంగా ఉన్న ‘బీప్’ సాంగ్‌ను పూర్తిగా వినకుండా వివాదం చేయడం అన్యాయమని శింబు పేర్కొనడం చర్చనీయాంశమైంది. ధనుష్ హీరోగా నటించిన ఓ చిత్రంలో అతను పాడిన పాటలో అలాంటి పదాలు ఉన్నాయి. మరి.. శింబు పరోక్షంగా విసిరిన ఈ విసుర్లుకు ధనుష్ స్పందిస్తే, మరో వివాదం మొదలుకావడం ఖాయం. ఈ బీప్ సాంగ్ వ్యవహారం శింబు, అనిరుథ్కి మాత్రమే తలనొప్పిగా తయారవ్వలేదు. ఈ పాట కారణంగా తమిళ పరిశ్రమలో ఉన్న పలువురు ప్రముఖులు సైతం వివాదాలపాలయ్యారు. ‘బీప్..’ వివాదంలో ప్రముఖులు! చెన్నై తుపాను బాధితులకు సహాయం చేసినవారిని అభినందించడం కోసం ఏర్పాటైన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఇళయరాజా దగ్గర ఈ పాట గురించి ఓ పాత్రికేయుడు ప్రస్తావిస్తే, ‘‘నేనీ ఫంక్షన్‌కి వచ్చింది ఈ పాట గురించి మాట్లాడటానికేనా?’’ అని రాజా సార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో పాత్రికేయ సంఘాలు ఇళయరాజాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇళయరాజా సోదరుడు గంగై అమరన్ మరో వివాదానికి తెరతీశారు. సూపర్ స్టార్ రజనీకాంత్‌కు అనిరుథ్ బంధువు కాబట్టి, ఈ పాట గురించి స్పందించమని ఆయన్ను అడగొచ్చుగా అంటూ రజనీని ఇరుకుల్లో పడేసేలా మాట్లాడారు. మరోవైపు తమిళనాడు నటీనటుల సంఘం మాజీ అధ్యక్షుడు శరత్‌కుమార్ అయితే తాజా కమిటీపై మండిపడ్డారు. శింబు పాడిన అభ్యంతరకర పాటకు నటీనటుల సంఘం ఎందుకు వివరణ కోరడంలేదని ఆయన ప్రశ్నించారు. విశేషం ఏంటంటే... ఇటీవల జరిగిన నటీనటుల సంఘంలో శరత్‌కుమార్ ప్యానెల్లోనే శింబు పోటీ చేశారు. ఇంకా పలువురు ప్రముఖ రచయితలు ఈ పాట పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి.. ఈ వివాదం ఎందాకా వెళుతుందో... ఏమో? -
శింబుతో ఎడమొహం పెడమొహం
శింబు మంచి గుర్రుమీదున్నాడు. అవమాన భారంతో రగిలిపోతున్నాడు. అతన్ని అంతలా అవమానానికి గురిచేసింది ఎవరో కాదు. తన మాజీ ప్రియురాలు నయనతార. వారి రెండేళ్ల ప్రేమ పెటాకులవ్వడం, తత్ఫలితంగా ఎవరిదారి వారు చూసుకోవడం. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ఇద్దరూ కలిసి నటిస్తుండటం అందరికీ తెలిసిందే. అయితే... ఇటీవల తన ఫ్రెండ్స్‌తో నయతార మాట్లాడిన తీరు... శింబు అవమాన భారానికి కారణమైంది. వివరాల్లోకెళ్తే- ‘మళ్లీ శింబుతో కలిసి నటిస్తున్నావ్. జాగ్రత్తగా ఉండు. గత స్మృతుల ఫలితంగా మళ్లీ ప్రేమలో పడినా పడతావ్’ అని సరదాగా ఓ హెచ్చరికను నయనతారకు పాస్ చేశారట ఆమె సన్నిహితులు. దానికి నయన... ‘అంత సీన్ లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో నాకు శింబు అయినా ఒక్కటే... శివకార్తికేయన్ అయినా ఒక్కటే’ అని ఘాటుగా స్పందించిందని సమాచారం. అయితే... ఈ మాట అలా అలా శింబు చెవిన పడింది. ఇంకేముంది. శింబు కోపం నషాళానికి అంటింది. శివకార్తికేయన్ కమెడియన్‌గా మొదలై, తర్వాత సహాయ నటునిగా నటించి, ఇప్పుడు తమిళనాట కామెడీ హీరోగా స్థిరపడ్డాడు. అతనితో తనని పోల్చడంతో శింబు కోపం కట్టలు తెగిందని కోలీవుడ్ టాక్. అప్పటిదాకా నయనతారతో సరదాగా ఉన్న శింబు, ఈ మాట చెవిన పడ్డ దగ్గర్నుంచీ... లొకేషన్లో అంటీ ముట్టనట్లు ఉంటున్నాడట. నయనతారకు కూడా ఈ విషయం తెలిసి, తానూ బెట్టుగా ఉండటం మొదలుపెట్టిందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. లొకేషన్లో వీరిద్దరూ ఎడమొహం పెడమొహంగా ఉండటం అక్కడ చర్చనీయాంశమైంది. -
వివాదంలో హన్సిక!
తొలినాళ్లలో హన్సిక వివాదరహితురాలే. శింబుతో ప్రేమ.. తర్వాత కటీఫ్.. ఈ నేపథ్యంలోనే.. హన్సిక కూడా వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయ్యారు. ఇటీవలే ఈ ముద్దుగుమ్మ ఓ కొత్త వివాదంలో చిక్కుకున్నారు. వివరాల్లోకెళితే... చెన్నయ్‌కి చెందిన ఓ క్యాబ్ కంపెనీ ప్రారంభోత్సవానికి అతిథిగా వెళ్లడానికి అంగీకారం తెలిపారు హన్సిక. హైదరాబాద్ నుంచి హన్సిక అండ్ టీమ్ చెన్నయ్ వెళ్లడానికి సదరు క్యాబ్ కంపెనీ వారు కొన్ని ఫ్లయిట్ టికెట్స్ కూడా బుక్ చేశారు. అయితే... చివరి నిమిషంలో మరో అయిదు టికెట్స్‌ని బుక్ చేయమని క్యాబ్ కంపెనీ వారిని హన్సిక రిక్వెస్ట్ చేశారట. ఆర్థిక భారం అధికమవుతుండటంతో ‘ఇక ఫ్లయిట్ టికెట్స్ తీయలేం’ అని క్యాబ్ కంపెనీవారు కరాఖండీగా చెప్పేశారట. మరి... ఈ పరిణామం హన్సికకు బాధ కలిగించిందో ఏమో.. అసలు ఓపెనింగ్‌కే ఎగనామం పెట్టేసింది. తమ కంపెనీ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హన్సిక రాబోతున్నారని ఓ రేంజ్లో పబ్లిసిటీ చేసుకున్న ఆ సంస్థ... హన్సిక హ్యాండివ్వడంతో ఒక్కసారిగా షాక్‌కు లోనయ్యారు. పైగా ఆహ్వాన పత్రికల్లో కూడా హన్సిక పేరు వేయడంతో వారు అవమానంగా కూడా ఫీలయ్యారట. ‘బాధ్యత కలిగిన సెలబ్రిటీ చేయాల్సిన పని కాదిది’ అంటూ హన్సికపై విమర్శల బాణాలను సంధించింది సదరు కంపెనీ యాజమాన్యం. అయితే... ఈ విషయంపై హన్సిక వెర్షన్ వేరేలా ఉంది. ప్రారంభోత్సవానికి హాజరవుతాననడం నిజమేనని, అయితే... తన స్టిల్స్‌ని మాత్రం సదరు కంపెనీ వారు ప్రచారానికి ఉపయోగించుకోకూడదని ముందే షరతు విధించారని సమాచారం. కానీ, దాని తాలూకు ఒప్పంద పత్రాన్ని అందజేయలేదట. అది తనకు బాధ కలిగించడంతో ఈ ప్రారంభోత్సవంలో పాలుపంచుకోవడానికి ఇష్టపడలేదట. చివరి నిమిషంలో కాకుండా, ఈ విషయాన్ని ముందే తెలియ జేశారట హన్సిక. మరి.. వీరి వాదనల్లో ఏది నిజమో వాళ్లకే తెలియాలి. -
అది మాత్రం అడగొద్దు
శింబుతో ప్రేమ ప్రస్తావన రాగానే ప్లీజ్ అది మాత్రం అడగొద్దు అంటోంది నటి హన్సిక. ఈ అందాల భామపై ఇప్పటికే రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయన్న విషయం తెలిసిందే. హన్సిక మాట్లాడుతూ తాను ఈ ఏడాది చాలా బిజీగా ఉన్నానంది. 22 ఏళ్లలోనే ఇంత బిజీగా ఉండటం గొప్పగా భావిస్తున్నాననే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. మరి కొందరు పదేళ్ల వరకు మీరు సినిమాలో నిలబడతారా? అని అడుగుతున్నారని అంది. తనకు అలాంటి విషయాలపై చింత లేదని చెప్పింది. తాను గడుస్తున్న రోజులను లెక్క పెడుతూ కూర్చోనని పేర్కొంది. తమన్న, సమంతలతో పోటీ ఎలా ఉందని అడుగుతున్నారని నిజానికి తనకలాంటి భావనే లేదని స్పష్టం చేసింది. ఇప్పుడు కూడా తన చేతిలో పది చిత్రాలు ఉన్నాయని చెప్పింది. ప్రతి పాత్రలోనూ బాగా నటించాలని ఆశిస్తున్నానంది. ఎవరి నటన అయినా నచ్చితే వెంటనే ఫోన్ చేసి వారిని అభినందిస్తానని తెలిపింది. ఇకపోతే శింబుతో ప్రేమ కొండెక్కిందటగా అని అడుగుతున్నారని ఇలాంటి వాటికి దూరంగా ఉండాలనుకుంటున్నానని కాబట్టి మరోసారి ఈ ప్రశ్న అడగొద్దని అంది. ఎదుటపడిన వారంతా పెళ్లెప్పుడని అడుగుతున్నారంది. తనకు నచ్చని విషయాలకు బదులు చెప్పడం ఇష్టం లేదని పేర్కొంది. సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు వివరంగా చెబుతానని అంది. 15 ఏళ్ల వయసులోనే తాను నటి నవుతానని ఊహించలేదని, అదే విధంగా సమయం వచ్చినప్పుడు తనకు, తన తల్లికి కరెక్ట్ అనిపించినప్పుడు పెళ్లి చేసుకుంటానని హన్సిక స్పష్టం చేసింది.