సంచలనం, కలకలం, వివాదం, అంతకు మించి ప్రతిభ ఇవన్నీ కలిస్తే శింబు. ఈ యువ నటుడు పాడినా, మాట్లాడినా, ఆడినా వార్తే. అలా శింబు ఎప్పుడూ ప్రత్యేకమే. శింబు షూటింగ్‌కు సరిగా రారు, నిర్మాతలను ఇబ్బంది పెడతారు, దర్శకులతో గొడవ పడతారు లాంటి ఆరోపణలూ ఉన్నాయి. ఆ మధ్య విజయాలకు దూరమై విమర్శలకు బాగా దగ్గరైన శింబుపై రెడ్ కార్డ్ పడనుందనే దుమారం వరకూ పరిస్థితులను తెచ్చుకున్న నటుడు శింబు.
ఇక ఆ మధ్య బీప్ పాటతో పోలీసులకు ఫిర్యాదు, కేసులు, కోర్టులు వరకూ వెళ్లారు. అలాంటివి తగ్గి ఇటీవల నటించిన సెక్క సివంద వానం చిత్ర విజయంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన శింబు నటుడిగా బిజీ అయ్యారు. ఆయన నటించిన తాజా చిత్రం వందా రాజాదాన్ వరువేన్ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. చేతిలో చాలా అవకాశాలు ఉన్నాయి కూడా. ఇలాంటి సమయంలో పెరియార్ కుత్తు అనే ప్రైవేట్ ఆల్బ మ్‌తో మరోసారి సంచలనానికి రెడీ అయ్యారు.
తమిళనాడులో పెరియార్‌కు చాలా ఉన్నత భావాలు కలిగిన రాజకీయ సామాజిక వాది అనే పేరు ఉంది. అలాంటి నాయకుడి పేరుకు కుత్తు (ఐటమ్ సాంగ్‌కు కుత్తు పదాన్ని వాడతారు) పదం చేర్చి శింబు పాడి, ఆడిన పాటతో కూడిన ఆడియోను శుక్రవారం యూ ట్యూబ్‌లో విడుదల చేశారు. జాతి, మత వివక్షతను ఎండగట్టేలా సాగే ఆ పాటకు నటుడు శింబు నల్లషర్టు, ప్యాంటు ధరించి గ్రాఫిక్స్‌తో రూపొందించిన పెరియార్ శిల వద్ద ఐటమ్ సాంగ్ మాదిరి చిందులేస్తూ నటించడం విశేషం. ఇప్పుడా వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ దుమ్మురేపుతోంది. మరి ఈ వీడియోను ఎవరు ఏ విధంగా కెలికి వివాదంగా తెరపైకి తీసుకొచ్చారో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment