శింబునే కాదు నన్నూ ఉరి తీయండి!
నా కొడుకుతో పాటు నన్నూ ఉరి తీయండి అంటూ నటుడు శింబు తల్లి ఉషా రాజేందర్ కన్నీళ్ల పర్యంతం అయ్యారు. శింబు రాసి, పాడిన బీప్ సాంగ్ సమస్య ఇటీవల తుపాన్ బాధితుల ఇక్కట్లను మరిపించేంతగా విశ్వరూపం దాల్చిందని చెప్పవచ్చు. శింబు, అనిరుద్‌లపై కోవై, చెన్నైలలో కేసులు నమోదయ్యాయి. శింబు పరారీలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ముందస్తు మెయిల్ కోసం కోర్టును ఆశ్రయించినా ఫలితం కనిపించడం లేదు. దీంతో శింబు సరెండర్ కాకుంటే చర్యలు తీవ్రంగా ఉంటాయని పోలీసులు హెచ్చరించిన నేపథ్యంలో శింబు తల్లి కంటతడి పెడుతూ తన ఆవేదనను వ్యక్తం చేస్తూ ఒక వీడియోను విడుదల చేశారు. అదేమిటో చూద్దాం.
ఆకతాయి తనంగా రూపొందించిన పాట
శింబు చిన్నతనంలోనే నటుడయ్యాడు. శింబు చిన్న కుర్రాడు. తనకింకా పెళ్లి కాలేదు. ఆకతాయితనంగా రూపొందించిన పాట అది. ఆ తరువాత దానిని వద్దని పారేశాడు. శింబు అంటే గిట్టని వాళ్లెవరో ఆ పాటను దొంగిలించి ఇంటర్నెట్‌లో ప్రసారం చేశారు. వారిపై చర్యలు తీసుకోవలసిందిగా పోలీసులకు ఫిర్యాదు చేశాం. అయితే శింబుపై మాత్రం కేసులు నమోదయ్యాయి. తుపాను బాధితుల కంటే ఇది పెద్ద విషయమా? తినడానికి అన్నం లేక, నిలువ నీడలేక ఎందరో అలమటిస్తున్నారు. అలాంటి వారికి సాయం చేయకుండా శింబు విషయాన్ని భూతద్దంలో చూస్తున్నారు.అసలు శింబు చేసిన తప్పు ఏమిటీ? తన బహిరంగ కార్యక్రమంలో గానీ, సినిమాలో గానీ లేక ఏదైనా భేటీలో ఆ పాట పాడాడా? లేదే.
శింబు ఎదుగుదలను అడ్డుకుంటున్నారు
శింబు ఎదుగుదలను అడ్డుకోవడానికి సినిమాలోని సహ నటులే అడ్డుకుంటున్నారు. శింబు చిత్రాల విడుదలకు వరుసగా కుట్ర చేస్తున్నారు. పోటీ అన్నది అవసరమే. అయితే అది ఆరోగ్యకరంగా ఉండాలి. అలా కాకుండా శింబు ఎదుగుదలను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తన పేరుకు చెడును ఆపాదించే చర్యలకు పాల్పడుతున్నారు.
శింబు ఎక్కడికి పారిపోలేదు
కనీసం ఇంటి ముందు ముగ్గు కూడా వేసుకోలేకపోతున్నాను. అంతగా మనసు అశాంతికి గురవుతోంది. శింబు పరారీలో ఉన్నాడంటూ ప్రచారం జరుగుతోంది. తన ఎక్కడికీ వెళ్లలేదు. పోలీసులు గాలించడానికి శింబు చేసిన తప్పేమిటి? తనను వెతకడానికి తను ఎక్కడికీ పారిపోలేదు. మీకు నా కొడుకు కావాలి అంతేగా అతన్ని ఏ పోలీసుకు అప్పచెప్పడానికైనా సిద్ధమే.
నన్ను ఉరి తీయండి
శింబును ఉరి తీయాలంటున్నారు.అంత తప్పు తనేం చేశాడు.శింబును పెంచిన నన్ను ఉరి తీయండి.ఇప్పుడు చూసినా కెమెరాలతో మనషులు ఇంటి ముందు తిరుగుతున్నారు. మనశ్శాంతి కరువైంది. అసహనానికి గురౌవుతున్నాం. ఏమి రాష్ట్రం ఇది? మేమిక తమిళనాడులో జీవించలేం. ఏ కర్ణాటకకో, కేరళకో లేక మరెక్కడికైనా వెళ్లి మా బతుకు మేము బ్రతుకుతాం. మాకు జీవితాన్నిచ్చిన తమిళనాడుకు కృతజ్ఞతలు అంటూ శింబు తల్లి ఉషా రాజేందర్ కన్నీళ్ల పర్యంతం అయ్యారు.
నా కొడుకు ప్రాణం కావాలా?
ఏం ఊరి ఇది? సొంత ఇంటిలో స్వేచ్ఛగా జీవించడానికి కూడా స్వతంత్రం లేదు. ఇంకా ఎందుకు ఇక్కడ ఉండాలి? మా పక్కన ఉన్న మంచి గురించి ఎవరూ చెప్పడం లేదు. ఆ పాట దొంగలించబడింది. అది ఒక బీప్ సాంగ్. వద్దని పారేసిన పాట. ఆ కోణంలో ఎవరూ ఆలోచించడం లేదు. అసలు మీకు ఏమి కావాలి? నా కొడుకు ప్రాణం కావాలా? తీసుకోండి. లేదా తనను కనిపెంచిన నా ప్రాణం కావాలా? తీసుకోండి. అసలు మీ సమస్య ఏమిటి?