శింబు అజ్ఞాతం వీడతారా?
చెన్నై: నటుడు శింబు బీప్ సాంగ్ కేసులో సోమవారం చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ముందు విచారణకు హాజరు కావలసి ఉంది. అయితే ఇప్పటికే పలు కేసుల విచారణకు సహకరించకుండా అజ్ఞాతంలో ఉన్న శింబు సోమవారం పోలీసుల ఎదుట హాజరవుతారా లేదాఅన్న ఆసక్తి నెలకొంది. నటుడు శింబు స్త్రీలను కించపరిచేలా అసభ్యపదాలతో పాట రాసి, పాడారని,దానికి యువ సంగీత దర్శకుడు అనిరుద్ బాణీలు కట్టారంటూ నెల రోజులకు పైగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలు ఆందోళనకు దిగిన విషయం,తద్వారా కోవై,తూత్తుకుడి,చెన్నై తదితర ప్రాంతాల్లో శింబుపై కేసులు నమోదైన సంఘటనలు తెలిసిందే.
దీంతో అజ్ఞాతంలోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతున్న శింబు ముందస్తు బెయిల్ కోసం మద్రాసు హైకోర్టును ఆశ్రయించి అరెస్ట్ నుంచి బయట పడ్డారు. అయితే తనపై ఇకపై కేసులు నమోదు కాకుండా పోలీస్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేయాలన్న శింబు పిటిషన్‌ను మాత్రం హైకోర్టు తిరస్కరించింది. అదే విధంగా పోలీసుల విచారణకు సహకరించాలని కోర్టు శింబును ఆదేశించింది. దీంతో శింబు ఇవాళ చెన్నై పోలీసుల ముందు హాజరు కావలసి ఉంది. అయితే ఆయన పోలీసుల ఎదుట హాజరవుతారా?లేక తన న్యాయవాది ద్వారా వివరణ ఇప్పిస్తారా?అన్నది ఆసక్తిగా మారింది. శింబు హాజరైతే ఆయనను విచారించి వాగ్మూలం నమోదు చేస్తామని చెన్నై నేరపరిశోధనా విభాగం పోలీసు ఒకరు వెల్లడించారు.