వంశీగారి కోసం గ్లామరస్‌గా నటించా
‘‘ఈ చిత్రంలో పల్లెటూరి సంస్కృతిపై ఇష్టంతో విదేశాల నుంచి వచ్చిన అమ్మాయిగా నటించా. తనకు చీర కట్టుకోవడం రాదు, ఇక్కడి పద్ధతులు తెలీవు. వెరీ గ్లామరస్ రోల్. దర్శకుడు వంశీగారని గ్లామరస్‌గా కనిపించడానికి ఒప్పుకున్నా. ఆయన దర్శకత్వంలో నటించడం నా అదృష్టం’’ అన్నారు అనీషా ఆంబ్రోస్. సుమంత్ అశ్విన్ హీరోగా వంశీ దర్శకత్వంలో మధుర శ్రీధర్ నిర్మించిన ‘ఫ్యాషన్ డిజైనర్... సన్నాఫ్ లేడీస్ టైలర్’లో ఆమె ఓ కథానాయిక. వచ్చే నెల 2న విడుదల కానున్న ఈ సినిమా గురించి అనీషా చెప్పిన సంగతులు...
► ఫ్యాషన్ డిజైనర్ కావాలనుకున్న ‘లేడీస్ టైలర్’ కొడుకు కథే సినిమా. మాది సీక్వెల్ కదా, ‘లేడీస్ టైలర్’తో పోలిస్తే చాలా తేడాలుంటాయి. వంశీగారు పాత్రలను తీర్చిదిద్దిన విధానం బాగుంటుంది. నన్ను గ్లామరస్, బోల్డ్ క్యారెక్టర్‌లో చూసి ప్రేక్షకులు షాకవుతారు. నాతో పాటు మిగతా ఇద్దరు హీరోయిన్లు మనాలీ రాథోడ్, మానసలకు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పబ్లిసిటీ స్టంట్ కాదు. హీరో అలా ఎందుకు చేశాడనేది సినిమాలో చూడాలి.
► సుమంత్‌తో షూటింగ్ అంటే పిక్నిక్‌కు వెళ్లినట్టుంటుంది. ఫ్రెండ్లీ కోస్టార్. నిర్మాత ‘మధుర’ శ్రీధర్‌గారు నటీనటులకు ఏ సమస్య రాకుండా చూసుకుంటారు. ఆయనతో వ్యక్తిగత సమస్యలు చెప్పుకునేంత చనువు ఉంది. ఆయన నిర్మాణంలో పది సినిమాలు చేయొచ్చనే నమ్మకం ఏర్పడింది. మణిశర్మగారు అద్భుతమైన పాటలు స్వరపరిచారు. పాటలన్నిటినీ పాపికొండల్లో తీశారు. అక్కడ సెల్ సిగ్నల్స్ లేవు. అమ్మానాన్నలతో మాట్లాడకుండా చాలా రోజులు అక్కడ షూటింగ్ చేయడం డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్.
► పవన్ కల్యాణ్ ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ను నేను వదులుకోలేదు. కాజల్ అగర్వాల్ ఆ సినిమా చేయడం కరెక్ట్. అంత పెద్ద స్టార్‌తో నటించడమంటే నాకు నెర్వస్‌గా ఉండేదేమో! ప్రస్తుతం మంచు మనోజ్ ‘ఒక్కడు మిగిలాడు’లో నటిస్తున్నా. తమిళంలో ఓ సినిమాకి సంతకం చేశా.