హవీష్
‘‘సాధారణంగా నాకు థ్రిల్లర్స్ పెద్దగా ఆసక్తి లేదు. ఆ సబ్జక్టే కొంచెం డ్రైగా అనిపిస్తుంది. కానీ ఈ థ్రిల్లర్ ఒప్పుకోవడానికి కారణం కథ. ప్లస్ 6 హీరోయిన్లు ఉన్న తర్వాత ఇక డ్రైగా ఎందుకు ఉంటుంది? ఇలాంటి కథ ఎక్కడా రాలేదు’’ అన్నారు హవీష్. కెమెరామేన్ నిజార్ షఫీ దర్శకుడిగా మారి హవీష్ హీరోగా రెజీనా, నందితా శ్వేత, త్రిధా చౌదరి, అనీషా ఆంబ్రోస్, అదితీ ఆర్య, పూజితా పొన్నాడ హీరోయిన్లుగా రూపొందించిన చిత్రం ‘7’. రమేశ్ వర్మ కథను అందించి, నిర్మించిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ ఈ నెల 5న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా హవీష్ పలు విషయాలు పంచుకున్నారు.
► సినిమాలో రెహమాన్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపిస్తారు. ఆయన దృష్టిలో హీరోయిన్లు, నేను (6+1) 7 పాత్రలం. అందుకే ఆ టైటిల్ పెట్టాం. మొదట సినిమా అనుకున్నప్పటి నుంచి మరో నాలుగు రోజుల్లో సెట్స్ మీదకు వెళ్తాం అనేవరకూ కూడా తెలుగులో మాత్రమే తీయాలనునుకున్నాం. చివర్లో మరో నిర్మాత కూడా తోడవ్వడంతో తెలుగు, తమిళంలో నిర్మించాం. దర్శకుడు షఫీ పుట్టింది తమిళనాడులో అయినా తెలుగు సినిమాలు ఎక్కువ చేశారు. రెండు ప్రాంతాల వాళ్లకు అనుగుణంగా ఈ సినిమా తెరకెక్కించారు. నాకు ఒక్క ముక్క తమిళం రాదు. డైలాగ్స్ నేర్చుకోవడానికి గంటల గంటలు పట్టేది.
► కథలో బలం ఉండబట్టే ఆరుగురు హీరోయిన్లు నటించడానికి ఒప్పుకున్నారు. ఒకరితో ఫ్రెండ్ అవుతున్నాను అనుకునే లోపు ఆమె పార్ట్ షూటింగ్ పూర్తయి మరో హీరోయిన్ జాయిన్ అయ్యేవారు. ఇంత మంది హీరోయిన్లు ఉన్నప్పుడు చిన్న చిన్న ఫైట్స్ కామన్. ఇద్దరు హీరోయిన్స్ సెట్లో ఉన్నప్పుడు అక్కడి వాతావరణంలో తేడా నాకు అర్థం అయ్యేది.
► ఏ పని చేసినా నం.1గా ఉండాలనుకునే మనస్తత్వం నాది. అలానే కష్టపడతాను. మన పని మనం చేసుకుంటూ వెళ్తే సక్సెస్ ఆటోమేటిక్‌గా వస్తుంది. ఆ మధ్య ఓ పెద్ద ప్రాజెక్ట్‌లో హీరోగా అవకాశం వచ్చింది. చివరి నిమిషంలో క్యాన్సిల్ అయింది. దాంతో నా గత చిత్రానికి, దీనికి ఇంత గ్యాప్ వచ్చింది. ప్రస్తుతం ఓ మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి. అభిషేక్ పిక్చర్స్ వాళ్లకు చేస్తున్నది ఫ్యామిలీ డ్రామా. అందులో మంచి లవ్‌స్టోరీ ఉంటుంది.
► మా ప్రొడక్షన్‌లో ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్‌తో ‘రాక్షసుడు’ సినిమా చేస్తున్నాం. జూలై 18న రిలీజ్ అనుకుంటున్నాం. నా బ్యానర్‌లో నేను నటించకపోయినా ఫర్వాలేదు. ఆల్రెడీ బ్యానర్‌లో నిర్మాతగా నా పేరున్నట్టే. ప్రతి సినిమాలో నేనుండవసరం లేదు కదా.
► ‘7’లో కొన్ని లిప్‌లాక్ సన్నివేశాలు ఉన్నాయి. కథ చెప్పినప్పుడు ముద్దు సీన్లు ఉన్నాయని నాతో చెప్పలేదు. సెట్లోకి వెళ్లి హీరోయిన్‌ను ముద్దుపెట్టమంటే భయపడ్డాను. ‘ఒకవేళ తను కొడితే ఏంటి?’ అనుకున్నాను. మొదట్లో కొంచెం ఇబ్బంది పడ్డాను. ఆ తర్వాత ధైర్యంగా చేసేశాను.
ఏ రంగంలో అయినా మార్పు మంచిదే. అందరికీ చాన్స్ ఇవ్వాలనే పద్ధతిని నమ్ముతాను. ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబుగారిని చూశాం. ఇప్పుడు జగన్‌గారికి అవకాశం ఇచ్చారు. ఆప్షన్ ఉండాలి. ఈయన సరిగ్గా పరిపాలించకపోతే ఆయన. ఆయన చేయకపోతే ఈయన.. అలా ఉండాలి. జగన్‌గారు రావడం ఖచ్చితంగా మంచిదే. ఆయనకి ఎక్స్‌పీరియన్స్ లేదని ఎందుకు అనుకోవాలి. జగన్‌గారు యంగ్‌స్టర్, ప్రపంచాన్ని చూశాడు. ఆయన బాగా పాలించగలరని అనుకుంటున్నాను.
Comments
Please login to add a commentAdd a comment