దర్శకుడికి 'అవార్డు' నటుడి గురుదక్షిణ
ముంబై: పద్మభూషణ్ అవార్డుకు ఎంపికైన బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్.. దర్శకుడు మహేష్ భట్కు గురుదక్షిణ చెల్లించుకున్నాడు. మహేష్ భట్కు వెయ్యి రూపాయల నోటు ఇచ్చి, తనకు కెరీర్ ప్రసాదించినందుకు ధన్యవాదాలు తెలిపాడు. భట్ దర్శకత్వం వహించిన 'సారాంశ్' చిత్రం ద్వారా ఖేర్ బాలీవుడ్లో తెరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి భట్, ఖేర్ల మధ్య గురుశిష్యుల బంధం కొనసాగుతోంది.
భట్ను కలసినపుడు తీసిన ఫొటోను అనుపమ్ ఖేర్ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఖేర్ వెయ్యి రూపాయల కాగితాన్ని అందించి, ధన్యవాదాలు తెలపగా, భట్ ఆయన్ని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని నుదుటిపై ముద్దుపెట్టాడు. పద్మభూషణ్ అవార్డుకు ఎంపికైన ఖేర్కు భట్ అభినందనలు తెలిపాడు. ఈ అవార్డు రావడం గర్వంగా ఉందని చెప్పాడు.