
'ఆ చిత్రం చేయడానికి కొంచెం భయపడ్డా'
చెన్నై : సంగీతానికి భాషాభేదం లేదు. అయినా దాన్ని ఎలా అందిస్తున్నామన్న బాధ్యత అధికం అవుతుందంటున్నారు ప్రఖాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్. రెండు ఆస్కార్ అవార్డులను అవలీల గా గెలుచుకున్న ఈ సంగీత మాంత్రికుడు అంతర్జాతీయ స్థాయిలో కీర్తిగాంచారు. అలాంటి రెహ్మాన్ ఇప్పుడు చిత్ర నిర్మాణంపై దృష్టి సారించారు.
అంతే కాదు ఆ చిత్రానికి ఆయనే కథను తయారు చేసుకోవడం విశేషం. నాలుగేళ్లుగా రాసుకుంటున్న ఈ కథకు దర్శకత్వం వహించే సరైన దర్శకుడి కోసం ఆయన చిరకాల అన్వేషణ ఇప్పటికి ఫలించింది. ముంబాయికి చెందిన విశ్వేష్ అనే దర్శకుడిని ఏఆర్ రెహ్మాన్ ఎంపిక చేశారు. ఈ చిత్రానికి సంబంధించి పూర్వ కార్యక్రమాలు త్వరలో మొదలవుతాయని రెహ్మాన్ వెల్లడించారు.
తాను కళాశాల విద్యనభ్యసింశాలని ఆశించానన్నారు. అయితే అంతకు ముందే సంగీత రంగంలోకి ప్రవేశించి సంగీత కళాశాలను నెలకొల్పానన్నారు. ఇరానీ చిత్రానికి సంగీతం అందించిన అనుభవం గురించి అడుగుతున్నారనీ, ఆ భాషలో చిత్రం చేయ్యడానికి తాను కొంచెం జంకానన్నారు. ఎవరైనా తిడితే ఎలా అన్న ఆలోచనతోనే పనిచేశానని అన్నారు. అయితే పూర్తిగా వైవిద్య భరిత చిత్రానికి సంగీతాన్ని అందించానన్న సంతృప్తి కలిగిందన్నారు. సంగీతానికి భాషాభేదం లేకపోయినా దాన్ని ఎలా అందిస్తున్నామన్న బాధ్యత ఎక్కువగా ఉంటుందని రెహ్మాన్ అన్నారు.