
రెహమాన్‌కి హెచ్చరిక!
‘‘హఠాత్తుగా నా రికార్డింగ్ స్ట్టూడియోకి అనుకోని అతిథి వచ్చాడు. తనని చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. పని చేయడానికి వీల్లేదంటూ హెచ్చరించాడు’’ అన్నారు ఎ.ఆర్. రెహమాన్. ఈ సంగీత సంచలనం చెబుతున్న అతిథి పేరు ‘అమీన్’. స్వయానా రెహమాన్ ముద్దుల కొడుకు. రాత్రీ పగలూ తేడా లేకుండా తన తండ్రి పాటల పని మీద ఉండటం అమీన్‌కి ఏమాత్రం నచ్చలేదు. అందుకే, గురువారం తెల్లవారుజామున మూడు గంటలకు రికార్డింగ్ స్టూడియోకి వెళ్లాడు. తర్వాత ఏం జరిగిందో రెహమాన్ చెబుతూ -‘‘నా కొత్త ఆల్బమ్ ‘రౌనాక్’కు పాటలు స్వరపరిచే పని మీద ఉన్నాను. సడన్‌గా అమీన్ వచ్చి, సౌండ్ ఇంజినీర్ దగ్గరికెళ్లి కంప్యూటర్లు, ఇతర పరికరాలను ఆఫ్ చేయమని డిమాండ్ చేశాడు.
మా నాన్న రోజుకి కనీసం ఏడు గంటలైనా నిద్రపోవాలి. లేకపోతే ఆరోగ్యం పాడవుతుందని అన్నాడు. దగ్గరుండి అన్ని ప్లగ్స్ తీయించేశాడు. నాకైతే తనను కన్విన్స్ చేయడానికి పది నిమిషాలు పట్టింది. ‘నువ్వు నిద్రపో. కచ్చితంగా ఇంకాసేపటిలో నేను వస్తా’ అని ఒట్టేశా. అప్పుడు శాంతించాడు. ఇక, మా అబ్బాయి చిన్నపిల్లాడు కాదు. నా గురించి ఆలోచించే స్థాయికి ఎదిగిపోయాడు’’ అన్నారు మురిపెంగా.