‘జాబిలిని తాకి ముద్దులిడు ఆశ’ అని పాట చేశాడు ఏ.ఆర్.రహమాన్ ‘రోజా’ కోసం. ఆ సినిమా వచ్చి దాదాపు 30 ఏళ్లవుతోంది. వైరముత్తు ఆ వాక్యాన్ని ఏ ముహూర్తాన రాశాడో జాబిలిని తాకేంత ఎత్తుకు ఎదిగాడు రహమాన్. భూగోళం తిరగేసేవారు వందేళ్లకు ఒకసారి వస్తారు. రహమాన్ అలా వచ్చాడు. మార్చడం పెద్ద విషయం. ఉన్నదానిని కొనసాగించడం అతి చిన్న విషయం. ఇళయరాజా వంటి దిగ్గజం ప్రభావాన్ని, హిందీలో లక్ష్మీకాంత్ ప్యారేలాల్, అనూమల్లిక్, ఆనంద్–మిళింద్, నదీమ్–శ్రావణ్ వంటి అతి పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్లను ఉల్టాపల్టా చేయదగ్గ సంగీతంతో ఒక యువ సంగీతకారుడు రావడం పర్వతాలను అంచున ఒక చిన్న మేఘం నిలబడి ‘నా సత్తా ఇది’ అని చెప్పడమే. ‘మండపేట మలక్‌పేట నాయుడు పేట పేట రాప్’ అని రహమాన్ ‘ప్రేమికుడు’ కోసం రహమాన్ పాట చేస్తే కుర్రకారు ఉలిక్కిపడ్డాడు. ‘చుకుబుకురైలే’ అంటే వెర్రెత్తి గంతులేశారు.
రహమాన్ ‘ప్రేమదేశం’ కోసం చేసిన పాటలు ‘ప్రేమా’... అని బాలూ పాడుతుంటే ముంబై అరేబియా సముద్రం అంచువరకూ వచ్చి వినడాలూ రహమాన్‌ని అందరికీ ఇష్టగానాన్ని చేశాయి. తాజా ప్రేమని కలిగించాయి. శబ్దాలు మాత్రమే వినిపిస్తాడని నిందలు పడ్డ రహమాన్ ‘లాలీ లాలీ అని’ పాట చేస్తే ఎంత మాధుర్యం. ‘అంజలీ అంజలీ పుష్పాంజలి’ పాట చేస్తే ఎంత పారవశ్యం. ‘ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్నా విద్యార్థిని’ అని పాట చేస్తే నేడూ ఆ ప్రేమ పరీక్ష రాసిన ఎందరో విద్యార్థులు ఆ పాట పాడుకుంటూ ఫలితాల కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. మహేశ్‌బాబుకు చేసిన ‘పెదవే పలికిన మాటల్లోన’ చేసిన రహమానే ‘చక్కెర ఎక్కడ నక్కిన’ కొంటె పాట చేశాడు. ‘కొమరం పులి’లో రహమాన్ చేసిన పాటలు ఆ సినిమా అపజయం వల్ల జనంలోకి వెళ్లలేదు. ‘అమ్మా తల్లి నోర్మూయవే’ పాట ఒక ప్రయోగం.
‘నమ్మకమియ్యరా స్వామి’ పాట మధురం. రహమాన్ తమిళంలో చేసినా హిందీలో చేసినా ఆ పాటకు భాషతో పెద్ద నిమిత్తం లేదు. ఆ పాటే ఒక భాష మాట్లాడేది. ‘గుంజుకున్నా’... అనే పాట ఎంత గుంజుతుంది మనల్ని. హిందీలో రహమాన్ వల్ల సూపర్‌డూపర్ హిట్ అయిన సినిమాలు లెక్కలేనివి. ‘లగాన్’, ‘తాళ్’, ‘గజని’, ‘రంగ్ దే బసంతి’, ‘జోధా అక్బర్’... ఎన్నని. ‘తాళ్ సే తాళ్ మిలా’... అని రహమాన్ పాట కడితే తాళం వేసినవారే అంతా.
‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ సినిమా ‘జయ హో’ పాటతో భారతీయ పాటను అస్కార్ వేదిక మీదకు తీసుకెళ్లాడు రహమాన్. 1992లో మణిరత్నం ‘రోజా’ చేసిన రహమాన్ 2021లో అదే మణిరత్నం ‘పొన్నియన్ సెల్వం’ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఆ జోడి కొనసాగింది. ఆ పాట కూడా.రహమాన్ ఇచ్చిన కొత్తగొంతులు, రహెమాన్ పట్టుకొచ్చిన కొత్త నాదాలు అనంతం. పాటను అందుకోవడంలో ప్రతిభ కలిగిన సామాన్యుడికిసులువు చేశాడాయన. రహమాన్ మరెన్నో గీతాలు అందివ్వాలని కోరుకుందాం. అతని పాటే చాలనుకునే అభిమానులతో ఈ పూట పాట కలుపుదాం.‘ఇవి మాత్రం చాలు.. ఇవి మాత్రమే’...
Comments
Please login to add a commentAdd a comment