వాళ్లవి రాంగ్ స్టెప్స్... ‘బాహుబలి’ది రైట్ స్టెప్!
భారతీయ దర్శక–నిర్మాతలు ఎవరూ ‘బాహుబలి’ వంటి సినిమాలు తీసే సాహసం చేయలేదా? కలలో కూడా అలాంటి సినిమా గురించి ఊహించలేదా? అనడిగితే... ‘‘ఎందుకు లేదు? ఎప్పుడో ‘బాహుబలి’ విడుదలకు ముందెప్పుడో ఊహించారు. అటువంటి సినిమా తీశారు కూడా. కానీ, సక్సెస్ కాలేదు’’ అన్నారు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. ఇప్పుడు ఎక్కడ చూసినా ‘బాహుబలి’ గురించే డిస్కషన్. ఆ సినిమా సాధించిన సక్సెస్ అటువంటిది మరి. ఇండియన్ సినిమాపై ‘బాహుబలి’ ప్రభావం ఎంతుంది? అనే దానిపై ఎక్కువ డిస్కషన్ జరుగుతోంది.
ఫ్రాన్స్‌లో జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రెహమాన్‌కు సేమ్ క్వశ్చన్ ఎదురైంది. అప్పుడు రెహమాన్ – ‘‘బాహుబలి’ గురించి తప్పకుండా చెబుతాను. అంతకు ముందు కొన్ని విషయాలు చెప్పాలి. ‘బాహుబలి’కి ముందు శేఖర్ కపూర్ ‘పానీ’ పేరుతో సినిమా తీయాలనుకున్నారు. ఇప్పటికీ ప్రయత్నిస్తున్నారు. కానీ, సెట్ కావడం లేదు. ఈ మేనియాను ఏడెనిమిదేళ్ల క్రితమే శేఖర్ కపూర్ ఊహించారు.
తర్వాత ‘కొచ్చాడియన్’లో యానిమేషన్, సీజీ వర్క్ (గ్రాఫిక్స్) సరిగా కుదరలేదు. లేకపోతే... అది ‘బాహుబలి’ అయ్యేదే. సో, ఇట్ ఈజ్ నాట్ లైక్ ‘బాహుబలి’ ఈజ్ ద ఫస్ట్ వన్ (బాహుబలి ఏం ఫస్ట్ సినిమా కాదు). అలాంటి ప్రయత్నాలు అంతకు ముందు జరిగాయి. కానీ, ఫెయిల్ అయ్యాయి. వాళ్ల నమ్మకం సరైనదే. కానీ, తప్పటడుగులు పడ్డాయి. ‘బాహుబలి’ టీమ్ ఈజ్ వెరీ లక్కీ. మంచి మంచి ప్రతిభావంతులు ఆ సినిమాకు పనిచేశారు’’ అన్నారు.