
అరిమానంబి అలా మొదలైంది
యువ నటుడు విక్రమ్ ప్రభు, ప్రియా ఆనంద్ జంటగా నటిస్తున్న చిత్రం అరిమానం బి. వి.క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్.ధాను నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన ప్రముఖ దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్ శిష్యుడు. అరిమా నంబి చిత్రం గురించి దర్శకుడితో కాసిన్ని ముచ్చట్లు.
ప్ర: అరిమానంబి అవకాశం ఎలా వచ్చింది?
జ: తుపాకి చిత్రం షూటింగ్ సమయంలో కలైపులి ఎస్.ధానుకు ఈ స్క్రిప్ట్ గురించి చెప్పాను. వెంటనే ఆయన బాగుందే అంటూ అభినందించారు. హీరోగా నటుడు విక్రమ్ ప్రభు నటించడానికి ఓకే అనడంతో అరిమా నంబికి శ్రీకారం చుట్టాం. ఎస్.ధాను గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన భారీ చిత్రాలకు ఎలా ఖర్చు చేస్తారో అంతగా ఈ చిత్రానికి వ్యయం గురించి ఏ మాత్రం ఆలోచించలేదు.
ప్ర: చిత్ర కథేంటి?
జ: జీవితంలో ఒక్కొక్కరికి ఒక్కో సమస్య ఉంటుంది. దాన్ని పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఏ రోజు సమస్య లేదో ఆ రోజు నిజంగా ఆ వ్యక్తికి ప్రశాంతతనిచ్చే రోజు. ఇక చిత్ర హీరో సమస్య ఏమిటి? అలాగే ఆయన దేని కోసం అన్వేషిస్తున్నారన్నదే అరిమా నంబి.
ప్ర: యాక్షన్ హీరో పాత్రకు విక్రమ్ ప్రభు ఓకేనా?
జ: ఆయన బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్లుగా ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలుంటాయి. చిత్రం చూస్తే తెలుస్తుంది. విక్రమ్ ప్రభు ఆ పాత్రకు ఎంతగా న్యాయం చేశారో చిత్రంలో యాక్షన్‌తోపాటు ప్రేమకు ప్రాధాన్యత ఉంటుంది. విక్రమ్ ప్రభు, ప్రియా ఆనంద్‌ల ప్రేమ సన్నివేశాలు అంత లవబుల్‌గా ఉంటాయి.
ప్ర: హీరోయిన్ ప్రియా ఆనంద్ పాత్ర గురించి?
జ: నిజం చెప్పాలంటే ఈ చిత్ర కథే ఆమె చుట్టూ తిరుగుతుంది. ప్రస్తుత చెన్నై మోడ్రన్ గర్ల్ ఎలా ఉంటుందో అలాంటి పాత్ర ప్రియా ఆనంద్ ది.
ప్ర: ఇదయం అనే పాటలో లొకేషన్స్‌ను గ్రాఫిక్స్ ద్వారా రూపొందించారా?
జ : ఈ విషయం గురించి చాలా మంది అడుగుతున్నారు. నిజానికిది గ్రాఫిక్స్ కాదు. ఆ పాటను థాయ్‌లాండ్‌లో చిత్రీకరించాం. థాయ్‌లాండ్ అడవుల్లోని సుందర ప్రాంతం అది. బ్యాంకాక్ నుంచి నాలుగు గంటలు ప్రయాణం చేస్తే కాంచనాపురి అనే ప్రాంతం వస్తుంది. అక్కడ నుంచి అడవిలోకి వెళ్లాలి. ఇలా చెప్పడం సులభం అయినా అక్కడికి వెళ్లడం కష్టసాధ్యం. అయితే లొకేషన్ చూసిన తరువాత యూనిట్ వర్గం ఆశ్చర్యపోయింది. అంత అద్భుత ప్రాంతం అది. పలు భారతీయ చిత్రాల షూటింగ్‌లు విదేశాల్లో జరిగినా ఆ ప్రాంతం మాత్రం ఎవరికంటా పడలేదు.
ప్ర: ఈ చిత్రం ద్వారా డ్రమ్స్ మణిని సంగీత దర్శకుడిగా పరిచయం చేయడానికి కారణం ?
జ : డ్రమ్స్ మణిని తాము సంగీత దర్శకుడిగా పరిచయం చేయడం లేదు. ఎందుకంటే ఆయనకు ఎంతో సంగీతానుభవం ఉంది. ఈ చిత్రంలో పాటలన్నీ జనరంజకంగా వచ్చాయి. కొత్త స్వరాలను ప్రవేశపెట్టారు. నేపథ్య సంగీతాన్ని అద్భుతంగా రూపొందించారు.