టైటిల్ : అర్జున్ రెడ్డి
జానర్ : లవ్ ఎంటర్ టైనర్
తారాగణం : విజయ్ దేవరకొండ, షాలిని పాండే, రాహుల్ రామకృష్ణ, సంజయ్ స్వరూప్, కమల్ కామరాజు
సంగీతం : రధన్
దర్శకత్వం : సందీప్ రెడ్డి వంగా
నిర్మాత : ప్రణయ్ రెడ్డి వంగా
ఇటీవల కాలంలో టాలీవుడ్ లో అత్యంత వివాదాస్పదమైన సినిమా అర్జున్ రెడ్డి. సాధారణంగా వాయిదాల తరువాత రిలీజ్ అయిన సినిమాలకు పెద్దగా హైప్ క్రియేట్ అవ్వదు. కానీ అర్జున్ రెడ్డి విషయంలో మాత్రం అలా జరగలేదు. ఆ సినిమాకు యూనిట్ ఆశించిన దానికన్నా చాలా ఎక్కువ పబ్లిసిటీ వచ్చింది. ముఖ్యంగా రాజకీయ నాయకులు, మహిళా సంఘాల విమర్శలు సినిమాలకు నష్టం కన్నా లాభమే ఎక్కువ చేశాయి. వివాదాల కారణంగా పెయిడ్ ప్రి వ్యూస్ లో సత్తా చాటిన అర్జున్ రెడ్డి ప్రేక్షకులను ఎంత మేరకు ఆకట్టుకున్నాడు..? పలు సందర్భాల్లో సినిమా సక్సెస్ గురించి ఎంతో కాన్ఫిడెంట్ గా మాట్లాడిన విజయ్.., నమ్మకం నిజమైందా..?
కథ :
అర్జున్ రెడ్డి ( విజయ్ దేవరకొండ)... స్వతంత్ర భావాలున్న ఆవేశపరుడైన మెడికల్ స్టూడెంట్. తన జూనియర్ అయిన ప్రీతి ( షాలిని పాండే)ని తొలి చూపులోనే ప్రేమిస్తాడు అర్జున్. ప్రీతి కూడా అర్జున్ మీద ప్రేమ పెంచుకుంటుంది. కాలేజ్ డేస్ పూర్తయ్యే సరికి వాళ్లు చాలా దగ్గరవుతారు. కానీ ప్రేమ కథల్లో లాగే ఈ ప్రేమ కథలో కూడా హీరోయిన్ తండ్రి వాళ్ల ప్రేమకు నో చెప్తాడు. అంతేకాదు.. ఆమెకు నచ్చని వేరే అబ్బాయికి ఇచ్చి పెళ్లి కూడా చేసేస్తాడు. ప్రీతి దూరమైన అర్జున్ రెడ్డి డిప్రెషన్ లోకి వెళ్లిపోతాడు, ఇంటి నుంచి బయటకు వచ్చేసి చెడు వ్యసనాలకు బానిస అవుతాడు. తన కోపం కారణంగా తనకు ఎంతో ఇష్టమైన డాక్టర్ వృత్తికి కూడా దూరమవుతాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న అర్జున్ రెడ్డి తిరిగి కోలుకున్నాడా..? అతడి ప్రేమకథ సుఖాంతమయ్యిందా.. లేదా..? అన్నదే మిగతా కథ.
నటీనటులు :
ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న నటుడికి అర్జున్ రెడ్డి లాంటి పాత్ర ఓ ఛాలెంజ్ లాంటిదే. అలాంటి టిపికల్ క్యారెక్టర్ లో విజయ్ దేవరకొండ అద్భుతంగా నటించాడనే చెప్పాలి. పట్టలేని కోపం, ప్రేమ ఉన్న వ్యక్తిగా.. వ్యసనాలకు బానిసనై భగ్న ప్రేమికుడిగా విజయ్ మంచి వేరియేషన్స్ చూపించాడు. కెరీర్ స్టార్టింగ్ లోనే ఇలాంటి డిఫరెంట్ క్యారెక్టర్ విజయ్ ని వరించటం అదృష్టమనే చెప్పాలి. హీరోయిన్ గా ప్రీతి ఆకట్టుకుంది. తన పరిధి మేరకు మంచి నటన కనబరించింది. హీరో ఫ్రెండ్ శివ పాత్రలో నటించిన రాహుల్ రామకృష్ణ అందరి దృష్టిని ఆకర్షించాడు. సినిమా అంతా హీరోతో పాటే ట్రావెల్ చేస్తూ మంచి కామెడీ పండించాడు. ఇతర పాత్రల్లో సంజయ్ స్వరూప్, కళ్యాణ్, కమల్ కామరాజ్ లు ఆకట్టుకున్నారు.
సాంకేతిక నిపుణులు :
దేవదాసు కథనే మరోసారి ఈ జనరేషన్ కు తగ్గట్టుగా మలిచిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మంచి విజయం సాధించాడు. సినిమాను ఎంతో రియలిస్టిక్ గా తెరకెక్కించిన దర్శకుడు.. తన అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యాడు. కేవలం యూత్ ను మాత్రమే దృష్టిలో ఉంచుకొని తెరకెక్కించిన అర్జున్ రెడ్డి.. ఆ వర్గాన్ని బాగానే మెప్పిస్తుంది. కొన్ని బోల్డ్ సన్నివేశాలు, డైలాగ్స్ కారణంగా ఫ్యామిలీ ఆడియన్స్ కు దూరమయ్యే అవకాశం ఉంది. అయితే కథా కథనాల పరంగా మాత్రం దర్శకుడి మంచి ప్రతిభ చూపించాడు. ఓ వ్యక్తి తన వ్యక్తిత్వంగా కారణంగా ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడో ఆకట్టుకునే విధంగా తెరకెక్కించాడు.
హీరో హీరోయిన్ల మధ్య సన్నివేశాల్లో దర్శకుడు ప్రతిభ కనిపిస్తోంది. తాను కూడా లవ్ ఫెయిల్యూర్ అని చెప్పిన దర్శకుడు తన ప్రేయసి దూరమైనప్పుడు హీరో పడే మనోవేదనను చాలా బాగా చూపించాడు. అయితే సినిమా నిడివి విషయంలో కాంప్రమైజ్ కాకపోవటం ప్రేక్షకులను ఇబ్బంది పెడుతుంది. ఫస్ట్ హాఫ్ కాస్త త్వరగానే ముగిసినా.. సెకండ్ హాఫ్ మాత్రం క్లైమాక్స్ కోసం ఎదురుచూడాల్సి వస్తుంది. క్లైమాక్స్ పాజిటివ్ గా ముగించాలన్న ఉద్దేశంతో కావాలని మలుపు తిప్పినట్టుగా అనిపిస్తుంది.
సంగీత దర్శకుడు పాటలతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తోనూ ఆకట్టుకున్నాడు. ఎమోషనల్ సీన్స్ లో రధన్ సంగీతం కట్టిపడేస్తుంది. ఎడిటింగ్ లో సెకండ్ హాఫ్ మరికొన్ని సీన్స్ కు కత్తెర వేయాల్సింది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్ :
విజయ్ దేవరకొండ నటన
ఎమోషనల్ సీన్స్
కామెడీ
మైనస్ పాయింట్స్ :
సెకండ్ హాఫ్ నిడివి
అన్ని వర్గాలను ఆకట్టుకోలేకపోవటం
- సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్
'అర్జున్ రెడ్డి' మూవీ రివ్యూ
Published Fri, Aug 25 2017 9:44 AM | Last Updated on Tue, Sep 19 2017 12:20 PM
Advertisement